Thursday, October 18, 2018

అవధారు


అవధారు

సాహితీమిత్రులారా!


మే నెలంతా సంతాపదినాల్లాగే గడిచేయి నాకు. మే 24 తెల్లవారు ఝామునే మేం దేశం విడిచి వెళిపోతున్నాము. హైదరాబాద్ చుట్టూ బండలు గుట్టలు పొలాలు చెరువులతో చాల అందమైన దేశం. అక్కడ మనుషులు చెట్లెక్కి కల్లుతీసుకునేవాళ్ళు, పెద్ద తలపాగాలతో మేకలు మేపుకునేవాళ్ళు, సైకిళ్ళమీద పచ్చళ్ళు ఫలహారాలు అమ్ముకునేవాళ్ళు, రకరకాల పనివాళ్ళు అనాది సాంస్కృతిక సౌందర్యంతో నిబ్బరంగా అవుపిస్తారు. ఏదో ఒకరోజు వాటన్నిటికీ దూరంగా వెళిపోతామని తెలుసు. ఆరేళ్ళుగా ప్రతి రాయి, రప్ప, గుట్ట, పిల్లలు, కుక్క, పంది, గేదె, గుడి, చెరువు అన్నీ కళ్ళతోనే ఫొటోలు తీసుకుని కడుపులో పెట్టుకుని అవి మళ్ళీ మళ్ళీ తల్చుకుంటాను. ఇంక వచ్చేసేముందు సంగారెడ్డి దాపుల్లో తిరుగుతూ దారితప్పిపోయి ఒకూళ్ళోకి వెళ్ళేము. దాన్ని అక్కడందరూ ఇస్మాఖంపేట్ అంటున్నారు. అది ఇస్మాయిల్‌ఖాన్ పేట. అక్కడి కోట, కోటలో దుర్గ గుడి ఎన్నో వందలేళ్ళనాటివి. ఒకసారి చూస్తే ఇంక అటు లాగుతూనే ఉంటాయి. ఓరోజు పొద్దున్న నగరం నుండి మురికి నీళ్ళు గోల్కొండ నాలాల్లో కలిసే చోట వ్యర్ధాలన్నీ పెద్ద పెద్ద సబ్బు నురగలుగా రయ్యిమని గాల్లోకి ఎగురుతున్నాయి, వెన్నముద్దల్లాగ. చివరికి ఇక్కడి కాలుష్యం కూడా నా కళ్ళకి అందంగానే కనిపిస్తుందని నవ్వుకున్నాను.

మే ఇరవైనాలుగు తెల్లవారుఝామునే మేము తట్టా బుట్టా అన్నీ సర్దుకుని దేశం విడిచి వెళిపోతున్నాము. మా అమ్మ మాతోనే వచ్చి విశాపట్నం వెళిపోతున్నాది. త్రిపురకి వేసంకాలంలో తొడుక్కునే పల్చని చొక్కాలంటే ఇష్టం. ఆర్నెల్ల కిందట వాళ్ళింటికెళ్ళి రెండ్రోజులున్నాను. నేను తొడుక్కోబోతున్న టీషర్ట్ ఇప్పించి తనకి కావాలని అడిగి తీసుకుని, అప్పటికప్పుడు తన చొక్కా ఇప్పీసి అది తొడుక్కున్నారు. మా అమ్మ చేతికిచ్చి మూడు చొక్కాలు పంపించేను – గచ్చపిక్క రంగుది, నల్లది, ఆకాశనీలంది. సరిగ్గా మేం దేశం నుండి శెలవు తీసుకుంటున్న ఘడియల్లోనే త్రిపుర లోకం నుంచి శలవు తీసుకున్నారు. మర్నాడు దిగి చూసుకుంటే తెలిసింది. పట్టుకెళ్ళిన చొక్కాలు ఏం చెయ్యమన్నావని మా అమ్మ అడుగుతున్నాది.

ఆరేళ్ళుగా త్రిపురతో చాల సంభాషణ నడిచింది. ఏణ్ణర్ధం కిందట ఆయన మా ఇంటికొచ్చి రెండ్రోజులున్నారు. చాలా కబుర్లు చెప్పేరు. ఏడాది కిందటి వరుకూ ఫోన్లో “హలో కనకా!” అని ఎస్వీరంగారావు లాగ అరిచేవారు, ఏ బెంగా లేకుండా. ఫోన్లో త్రిపురవి కిళ్ళీ లేకుండానే ముద్ద మాటలు – వ్యక్తావ్యక్త ప్రేలాపన అన్నట్టుగుంటాయి. చెవులు రిక్కించి జాగర్తగా వింటే తప్ప అర్ధం కావు. ఎదురుగా కూర్చున్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. ఇలాగని మొత్తుకుంటే సెల్ ఆపు చేసి మళ్ళీ మాట్లాడేవారు. త్రిపురకి తన పన్లు తను చేసుకోవడమే సరిగ్గా తెలీదు. లక్ష్మి ఆంటీ అన్నీ తానే అయ్యి ఇంటి పన్లూ, త్రిపురకి కావల్సినవీ చూసుకునేవారు. త్రిపుర కిళ్ళీలు రప్పించుకుని, చూడ్డానికొచ్చిన వాళ్ళని సంబాళించుకుని, క్రాస్‌వర్డ్ పజిల్స్ విజయవంతంగా పూర్తి చేస్తే ఆ రోజుని జయించినట్టే లెక్క. ఆంటీకి నాలుగేళ్ళయ్యి చాల చికాకు చేసింది. ఆవిడ ఉత్తమ ఉపాధ్యాయినిగా రాష్ట్రపతి నుండి జాతీయ పురస్కారం పొందిన మనిషి, స్వయంగా రచయిత్రి. అంతటి పనిమంతురాలికీ చివరికి కనీసం తన పనులు తనే చేసుకొనే వీలైనా లేకపోయింది. పనివాళ్ళు, నర్సులు పెద్దవాళ్ళిద్దరి అనువు కనిపెట్టి ఓ రోజొచ్చీ ఓ రోజు రాకా, అందిన కాడికి డబ్బూ దస్కం పట్టుకుపోయీ ఇబ్బంది పెట్టేరు. త్రిపురకి ఇల్లు ఎలా సంబాళించుకోవాలని, లక్ష్మి ఆంటీని ఎలా కాచుకుంటాననీ బెంగగా ఉండేది. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా “లక్ష్మిని చూసుకోవాలి…” అని మర్నాడే ఇంటికెళిపోయేవారు.

ఒక ఏడాదిగా మేం ఎప్పుడు మాటాడినా ముఖ్యంగా ఒక్క విషయం గురించే మాటాడుకున్నాము – పనిమనుషుల్ని గురించి. చాల వేరే వేరే కారణాల వల్ల నేనూ ఆయనా కూడాను పనిమనుషుల్ని గురించే బాగా ఆలోచించేము. త్రిపురకేమో పనిమనిషి చాల అవసరం. మా ఇంట్లోనేమో మాకు ఒక దేవదూత లాంటి పనమ్మాయి దొరికింది. ఆవిడ పేరు పద్మ. నాకు పనివాళ్ళు, వాళ్ళు మనకి పనులు చేసిపెట్టడం అంటే చాల ఇబ్బందిగా ఉంటుంది. ఎవరూ ఎవరికీ పనిమనుషులుగా ఉండకపోతే బావుంటుంది. పద్మ వాళ్ళూరు నల్గొండ దగ్గర. చదువు చిన్నప్పుడే ఆపీసింది గాని ఆవిడ చాల తెలివైన మనిషి, పనిమంతురాలు, నాయకురాలు. ప్రతి మాట, కదలికలోను, ప్రతి పనిలోను చాల స్థిరంగానూ, గొప్ప విశ్వాసంతో ఠీవిగానూ మసలుకునేది. తన పిల్లలు చదువుకోవాలని ఒక్కటి తప్ప ఇంక ఏమీ ఆశించేది కాదు. ‘అబ్బా! ఇలాటి మనుషులూ ఉంటారా?’ అని నేను రహస్యంగా నోరెళ్ళబెట్టుకుంటూ అవన్నీ త్రిపురకి ఫోన్లో వర్ణించి చెప్తుంటే ఆయన అన్నార్తుడికి విందు భోజనాన్ని వర్ణిస్తున్నట్టు మరింత ఇదైపోయేవారు. నేను చూసిన కొద్దిపాటి తెలంగాణ లోనే పద్మ లాంటి మనుషులు తారసపడుతూనే ఉన్నారు. వాళ్ళని దూరం నుండి చూసుకుంటూ, కొంచెం కదిపి మాటాడుకుంటుంటే నాకు త్రిపుర అరటిచెట్టు – ఆశాకిరణం లాగా చాలా బావుండేది. అవన్నీ ఒదిలి పోతున్నానని మే నెలల్లా గింజుకుంటున్నాను. పనిమనుషుల గురించి బెంగనీసి గట్టిగా ఎక్కడా బయటికి అననివ్వకుండా మా ఆవిడ నా గొడవంతా తనే విని ‘ఇలాటి సంగతులు ఇంకెక్కడా అనొద్దని ‘ చెప్పింది. ఎవరైనా వింటే నవ్విపోతారు. బహుశ పద్మా వాళ్ళే అర్ధం చేసుకోరు. త్రిపురకేమో పనిమనిషి కావాలి. పద్మలాంటి మనిషిని ఆయనయితేనే అర్ధం చేసుకుని, గౌరవించగలరు. ఆవిడలాంటి మనిషే కుదిరితే త్రిపుర రొట్టి విరిగి నేతిలో పడినట్టేను. పద్మకి ఇంగ్లిష్ అంటే, కొత్త పద్ధతులంటే ఉత్సాహం. త్రిపుర వాళ్ళింట్లో పన్లోకి కుదిరితే పద్మ తంతే బూర్లగంపలో పడినట్టే. పద్మని ఎలాగైనా త్రిపుర వాళ్ళింట్లో పనిమనిషిగా కుదిరించెద్దాం అని ఒక ప్రోజెక్ట్ లాగ పెట్టుకున్నాను. కాని ఆవిడుండేది నల్లగండ్ల. త్రిపురేమో వాల్తేర్ అప్‌లేండ్స్. ఎలా కుదురుతుంది? త్రిపురకి వెన్న రొట్టీ లేదు, పద్మకి పూర్ణం బూర్లూ లేవు గాని, పద్మతో త్రిపురతో ఈ ప్రోజెక్ట్ గురించే సంభాషణ చాలా దూరం నడిచింది.

త్రిపుర ఉత్తుత్తి పధకాలు వర్ణించినా అవి నిజమేననుకుని సంబరం పడిపోతారు. చాలా ఏళ్ళకిందట తనకి ఒక ఇల్లు కట్టించుకోవాల్నుందని అన్నారు. నేను లారీ బేకర్ హోం లాంటిది ఇల్లు డిజైన్లు గీసుకోనొచ్చి ‘ఇదిగో మీ కొత్తిల్లు. ఇది మీ గది, వంటిల్లు – ఇదేమో మీ అమ్మగారికి గది!’ అని బొమ్మలు చూపిస్తే ‘కనక ప్రసాద్ మాకు లారీ బేకర్ ఇల్లు కట్టించేస్తాడు!’ అని నిజంగానే గృహప్రవేశం చేసినట్టు సంబరం పడ్డారు. వాళ్ళమ్మగారు అప్పటికే చాల పెద్దావిడ. నేను త్రిపుర కోసం ఇంట్లోకెళ్తుండటం కనిపెట్టి అరిచేతిలో టక టకా రాస్తున్నట్టు చూపించి “కధ రాసీ! ఖధలు రాసీయండి!!” అని వేళాకోళం చేసి ఫక్కున నవ్వేవారు. ఆవిడ చాల తెలివైనావిడ అని, గొప్ప నవుతాలు మనిషనీ, ఆవిడకి కొసవెర్రి అనీ అదే తనకీనని ఇలాగ చెప్పి నవ్వేవారు. నిరుడు కధల పుస్తకం అచ్చవుతుందని హడావుడి జరుగుతున్నప్పుడు “మళ్ళీ వీటిని ఎవడు కొంటాడు? అంటే అలాక్కాదు చాలా మంది అభిమాన్లున్నారు, మీకే తెలీదు అంటున్నారు! నాకు రాయల్టీస్ ఇస్తార్ట! కాయితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. I am going to be rich!” అని ఇగటాలాడేరు.

రెండేళ్ళ కిందట మా ఇంటికొచ్చి రెండ్రోజులున్నారు. చిన్న పిల్లలు ఫ్రెండ్సింటికెళ్తున్నట్టు సరదా పడి సంచీ ఒకటీ, దాన్లో బట్టలూ కిళ్ళీలూ సర్దుకున్నారు. “అలా ఊరంతా తిరగాలనుందివై!” అన్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఊరల్లా తిరిగేము. మాటల్లో తనూసొస్తే అది ఎవరో వేరే మనిషి లాగ తృతీయ పురుషలో అనుకునేవాళ్ళం ‘త్రిపుర ఇలాగ ..’ అని. యూనివర్శిటీ కేంపస్‌లో తిరుగుతుంటే “Marx was right, you see?! He was right!” అన్నారు. “ఆయన చెప్పినట్టు అవ్వాలి, కాని అలాగ అవటం లేదు ” అన్నారు. కొత్త కొత్త రోడ్లూ దుకాణాలూ చూస్తూ ‘ఇదేంటి? అదేంటీ?’ అని అన్నీ అడిగేరు. అగర్తలాలో తనున్న పెద్ద కర్రబంగ్లా గురించీ రోజూ సాయంత్రం కురిసే జడివానల్ని గురించీ పూసగుచ్చినట్టు వివరించి చెప్పేరు. సంగీతం మేష్టారు పాఠం చెప్తుంటే సొఫాలో కూర్చుని బుర్ర ఊపుకుంటూ చేతులూపుకుంటూ విన్నారు. తనకి హిందుస్థానీ సంగీతమే ఇష్టం అనీ, అది వింటే ఏదో మీదికి మీదికి వెళ్తున్నట్టుంటుందనీ, కర్ణాటక సంగీతం వింటే ఇంకా కిందికి కిందికి దిగిపోతున్నట్టుంటుందనీ చేత్తో గాలినే మీదికీ కిందికీ తీగలు లాక్కుంటూ చెప్పేరు. త్రిపురలో తన స్నేహితుడొకడు, ఆయన పేరు చక్రవర్తి కావోలు – అతను అందరిముందూ ఉపన్యాసం ఇస్తానని వేదికనెక్కి తాగింది ‘ఫూ’ మని వాంతి చేసుకుని వేదిక దిగిపోయిన సంగతి చెప్పేరు. అతను నాలా ఉంటాడని చెప్పేరు.

షాన్‌బాగ్ హోటల్లోన దోశలు రప్పించు, పూరీలు రప్పించమని చాలా సరదా పడిపోయేరు. తీరామోసి తెప్పించేక కొంచెం దోశముక్క చిన్న పూరీ ముక్కా తిని ‘ఇంక చాలు! ఇంకొద్దు మనకి…’ అన్నట్టు సంజ్ఞలు చేసి. ఇంటికొచ్చేస్తుంటే అమీర్‌పేట్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని అటకాయించేరు. తప్పుగా రైట్ టర్న్ కోసేనని. అక్కడ ట్రాఫిక్ సైన్లేవీ లేవని, మా మానాన్న మమ్మల్ని ఒదిలీమని నేను, త్రిపుర ఇద్దరం వాళ్ళతో వాదించి అక్కణ్ణించి తుర్రుమన్నాం. ఆ సాహస కార్యంలో త్రిపుర నేనూ పోలీసుల్తో ఎలా బయట పడ్డామో తల్చుకుని నవ్వుకున్నాము. చాన్నాళ్ళ కిందట తను ఉద్యమాల కోసం సానుభూతి పన్లు చేస్తున్నాడని అనుమానంతో పోలీసులు మఫ్టీలో తను వెళ్ళే చోట్ల, రైల్వే స్టేషన్లలో ఎలా వెనకాలే తచ్చాడేవారో జ్ఞాపకం తెచ్చుకున్నారు. దార్లో ఇంద్ర నగర్‌లో కిళ్ళీల కోసం ఆగేము. కిళ్ళీ కొట్టతనితో కత్తు కలిపి అతని చరిత్రంతా కనుకున్నారు. “బయోగ్రఫీ అందరికీ ఉంటుంది. ఎవరి చరిత్ర రాసినా అది చదవడానికి చాల ఇంట్రష్టింగ్‌గానే ఉంటుంది.” అని చాలా చెప్పేరు. కొన్ని నమ్మేలా ఉంటాయి, కొన్నలా ఉండవు అని ఇలా ప్రస్తావనకొచ్చింది. “ఎలా ఉన్నది అలాగుంటుంది. ఎలా ఉన్నది అలాగే ఉంటుంది కాని అలాక్కాక మరింకెలా ఉంటుంది? ‘నీ ముక్కేంటి, అలాగుంది?’ అని అన్నామనుకో. బావుంది మరి, అది వాడి ముక్కు! అది అలాగే ఉన్నాది!! That’s how it is…!” అని చేతుల్తో ఎక్కువగా చేసి చెప్పేరు. “Hypocrisy is not a vice.” అని చెప్పేరు.

ఆ రెండ్రోజులూ రాయడం గురించీ చదవడం గురించీ నేనేవేవో అడుగుతూనే ఉన్నాను, ఆయన ఏవేవో చెప్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ లిటరేచర్‌ని గురించి ఎక్కడెక్కడివో, ఎప్పటెప్పటివో మనుషులు, సంగతులన్నీ ఆయనకి జ్ఞాపకమే. సందర్భానికి తగిన సంగతి ఠక్కుమని ఎత్తి చెప్పేవారు. అంతర్లయ అని ప్రసక్తి తెస్తే ‘అంటే ఏంటి?’ అన్నారు. Musicality అంటే ”G. M. Hopkins పొయెట్రీ చదివేవా?” అని ఆయన కవిత్వం, దాన్లో అంతర్లయ, Longing for God ఇలాగ ఒకొక్కటీ. త్రిపురకి కొద్దిపాటి జటిలంగా ఉండే తెలుగు మాటలు వాడినా వెంటనే వాటి సమానార్ధకాల్ని ఇంగ్లిష్‌లో చెప్తే గాని తెలీదు. శేషము అంటే Remainder అని, పటుత్వం అంటే Strength అనీ ఇలాగ. త్రిపురతో సంభాషణంతా దాదాపు ఇంగ్లిష్‌లోనే నడుస్తుంది. నాకు రాయడానికి సదృశం వాంతి అనిపిస్తుంది అనంటే ‘అవును, అదొక పద్ధతి’ అని, ఎప్పటికి ఏది తోస్తే అప్పటికి అదీ కాయితం మీద కలం ఎత్తకుండా రాసుకుపోడాన్ని గురించి మంచం మీద పడుక్కుని వివరించి చెప్పేరు. ఆది Spontaneous Fiction. అది ఇంకొకరిని దృష్టిలో పెట్టుకుని రాసేది కాదు. ఎవర్నీ దేన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వాంతైనట్టు రాసేది. “ఎవరైనా చదువుతారని దృష్టిలో పెట్టుకుని రాసేది అది – That is third-rate writing!!” అని పట్టుదలగా రెండుసార్లు నొక్కి చెప్పేరు. త్రిపుర యధాలాపంగా మాటల్లో విసిరేసే సంగతులు కూడా చాల అపురూపమైనవి, ఆ క్షణంలో ప్రస్తుతమైన విషయానికి చాల ఉపకరించేవి. ఏరి ఇక్కడా అక్కడా రాసుకున్నవి ఎక్కడో పడి, పోయేయి.

త్రిపుర ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పటం అనేది చాల అరుదు. మామూలుగా త్రిపుర సంభాషణ నడిపే పద్ధతి విలక్షణంగా, చిత్రంగా ఉంటుంది. మామూలుగా వ్యవహారం కోసం, చుట్టపు చూపుగా వచ్చే మనుషుల్ని అయన తప్పించుకుని తప్పించుకుని తిరిగేవారు. వీధి తిన్న ఇంట్లోకి మనుషులొస్తున్నారంటే ఆయన గబ గబా చొక్కా తొడుక్కుని పెరటి తిన్న ఎలా జారుకునేవారో నాకు కధలు చెప్పేవారు. ఒక్క లౌక్యుల్నుండి మాత్రం ఇలా తప్పించుకునేవారు కాని మిగతా రకాల మనుషులు – భోలా మనుషులు, గయ్యాళి మనుషులు, గర్విష్టివాళ్ళు, కోపగిష్టి వాళ్ళు, చాదస్తులు, నసపెట్టేవాళ్ళు, కార్యకర్తలు, పండితులు ఇలాగ ఎవరు తారసపడినా ఆయనకి ఇబ్బంది లేదు. కూర్చుని మాట్లాడ్తారు. ముందుగా ఎదటి మనిషిని జాగర్తగా పరిశీలించి, వాళ్ళ బుర్రలో ఆ క్షణంలో ముఖ్యంగా ఏం సుళ్ళు తిరుగుతోందో దాన్నే బయటికి రప్పించి, అదే ప్రపంచంలో చాల ముఖ్యమైన విషయమన్నట్టు మాటాడేవారు. అవతలవాళ్ళు చెప్పిందాన్నే వేరే మాటల్లో వాళ్ళకి ఎత్తి చెప్పి, మధ్య మధ్యన వాళ్ళకి ఉపశమనంగా ఉండే పిట్ట కధలు జోడించి రంజింపచేసేవారు. ఇలాగ త్రిపుర నాకు చెప్పిన పిట్ట కధలన్నీ రాస్తే అదే ఓ గ్రంధం అవుతుంది. మామూలుగా పిచ్చాపాటీ అనుకునే సంభాషణంతా ఆయన ఇలా నడుపుకునేవారు. అంటే ఒకళ్ళొచ్చి పంటి నొప్పి గురించి చెప్పుకుని, దంతవైద్యుల్ని విమర్శించడం మొదలు పెడితే ‘అవును, పన్ను నొప్పి – అబ్బ, మహా కష్టంవై…’ అని అదంతా వర్ణిస్తూనే డెంటిస్ట్‌ల్లో మంచివాళ్ళుంటారనీ ఇలా ఉపశమనంగా ఏదో ఒక పిట్ట కధో, జ్ఞాపకమో చెప్పి మాటలు నడిపేవారు. చాడీలు, సంఘర్షణ మరీ కట్టు తప్పిపోతుంటే అదును చూసుకుని విషయం మార్చేసేవారు – ‘అయితే ఇప్పుడు మార్చిలో మళ్ళీ – you are up for your next promotion, then…?’ అని ఇలాగ. టైలరు ఎవరి చొక్కాలు వాళ్ళకి ప్రత్యేకం కుట్టిచ్చినట్టు త్రిపుర నలుగురు మనుషులున్న చోట ఏక కాలంలోనే నలుగురితో నాలుగు రకాలుగానూ మట్లాడ్డం పరిశీలిస్తే అబ్బురంగా ఉండేది.

మాటాడ్డానికొచ్చేవాళ్ళు ఎవరితోనూ, రకరకాల దృక్పధాల్లో దేనితోనూ ఆయనకి ఏమాత్రం పేచీ ఉండేది కాదు, ఒక్క లౌక్యంతో తప్ప. ఆయనకి ‘ఇది త్రిపురది’ అని ఒక తోవా, ఆలోచనా విధానం ఇలాగ ఏమీ మిగల్లేదు. ఒకసారి ఆ మాట ప్రస్తావిస్తే “హ్యూమనిజం…” అని, నాకు బోధపదిందో లేదోనన్నట్టు పరీక్షగా చూసి మళ్ళీ “హ్యూమనిజం!” అని అన్నారు. కమ్యూనిష్ట్, ఫెమినిష్ట్, జెహోవా విట్నెస్, పరమ భక్తులు, పిల్లల తండ్రి, రాష్ట్రీయ స్వయంసేవక్ ఇలా రకరకాల తోవలంట పోతున్నవాళ్ళు ఎవరితోనైనా ఒక్క క్షణంలో ‘కనెక్ట్’ అయ్యి, అందర్నీ మనఃస్ఫూర్తిగా ఆదరించేవారు. ఎలాగంటే ప్రతీ ఒక్కరికీ ఒక నేపధ్యం ఉంది. పుట్టినిల్లూ, చదివింది, తిరిగింది, అనుభవిస్తున్నది, అర్ధం చేసుకోగలిగిందీ వాళ్ళకే ప్రత్యేకంగా ఒకటున్నాది. వీటిల్లో అనంతమైన వైవిధ్యం ఉంది. ఎలా ఉన్నవాళ్ళు అలా ఉన్నారు. దాన్ని ఏ సొడ్డింపూ లేకుండా ప్రస్ఫుటంగా పరిశీలించేవారు. అది ఏదైనా కానీ, నైసర్గికంగా – అంటే ఆయన మాటల్లోన “sincere”గా ఉందని అనిపించినంత కాలం ఏ ఇబ్బందీ లేకుండా త్రిపురతో స్నేహం నడుస్తుంది. అంటే – కుక్క కుక్కలా ఉండాలి, దొంగ దొంగలా ఉండాలి, కవి కవిలా ఉండాలి. ఆ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన సూచన కనిపించినా ఆయన ముడుచుకుపోతారు, లేకుంటే చిర్రెత్తిపోతారు, ఇంకా ఒక్కోసారి అగ్గి రుద్రుడే అయిపోతారు. ఒకసారి ఒకరు ఆయనవి సామాన్లు కొన్నీ, పుస్తకాలూ అడక్కుండా పట్టుకుపోయేరు. ఇంట్లో ఇంకెవరితోనో టీలు తాగుదామని కూర్చుంటుండగా ఆయనా ఇంట్లోకొచ్చి కూర్చున్నారు. త్రిపుర దిగ్గున లేచి “లక్ష్మీ! నాకో టీ ఇవ్వు, వీళ్ళకి టీలివ్వు! But ఇదిగో… ఇతను! No tea for this criminal!” అని కేకలేసేరు. ఇంకోసారి వాళ్ళబ్బాయి నాగార్జున్‌ని ఒక వంద రూపాయలిమ్మంటే ఆయన ‘అలా ఎందుకు నాన్నా! వంద సరిపోతుందా ఇంకా తీసుకోండి!’ అని ఎక్కువ డబ్బివ్వబోతే ‘హత్తిరి! నేను అడిగింది ఒక వందే! నువ్వు నాకు ఇంకా ఎక్కువిస్తానంటావా? నాకు అఖ్ఖల్లేదు!’ అని ఎలా పేచీ పెట్టేరో అదీ ఒక కధలాగ చెప్పేరు. వాళ్ళబ్బాయిని బిక్కు అని పిల్చేవారు. బిక్కుని చిన్నప్పుడు అగర్తలాలో జడివాన కురుస్తుంటే ఒక స్కూటర్ మీద ముందు నిలబెట్టి, ఇటూ అటూ చెట్లుండే నిటారు తోవంట చాల జోరుగా రయ్యిఁ మని తీసుకుపోతుంటే తను కేరింతలు కొట్టేవాడని మణిరత్నం సినిమా లాగ కధంతా చెప్పేవారు. పిల్లల్ని పెంచడం? అనడిగి నేను ఇంకా ‘బిడ్డల శిక్షణ’ లాగ ఏదో అనుకుంటుంటే ఆయన “నేను చేసిందేం లేదు. వాళ్ళంతట వాళ్ళే వీళ్ళనీ వాళ్ళనీ అడిగి, ఆ ఫారంస్ అవీ అన్నీ నింపుకుని వాళ్ళ చదువులు వాళ్ళే చదువుకున్నారు.” అని చెప్పేరు.

నేను ప్రతీ అడ్డమైనదీ ఒక ప్రశ్న లాగ అడిగేవాణ్ణి. ఆయన అడిగినవన్నింటికీ జవాబులు ఒక కధ లాగే చెప్పేవారు. మాటాడితే కధే. ‘డబ్బుండాలి కదా త్రిపుర?’ అంటే ‘ఉండాలుండాలి, money is important!’ అని తను ఎక్కడెక్కడ ఎలాగ డబ్బులు పోగొట్టుకున్నది, తనకి వచ్చే పెన్షన్ వివరాలు, చిన్నప్పడు అణాలు కాణీలు అవన్నీ కధలు. ఉండుండి ఏదో బుద్ధి పుట్టి డబ్బు ష్టాకుల్లో పెట్టి పోగొట్టుకున్న సంగతీ, బేంకి డెబిట్ కార్డు పిన్ నెంబర్తో సహా కిటికీలో పెట్టి లండన్ వెళిపోయి, తిరిగొచ్చి చూసుకుంటే దొంగలు కొట్టీసిన సంగతీ, పిల్లలు ఖర్చులకిచ్చిన సొమ్ము ఇంట్లో పనివాళ్ళు పట్టుకుపోయిన సంగతీ, మేస్త్రీ డబ్బు పుచ్చుకుని కనపడకుండా పోయిన సంగతీ ఇలాటివన్నీ అదేదో ఎవరికో జరిగిన అనుభవాల్లాగ కధలుగా చెప్పేవారు. త్రిపురతో కబుర్లన్నీ ఒక కాఫ్కా స్వదేహ దృశ్యం కవితలో లాగ త్రిపుర నేను కలిసి ఇంకెవరి గురించో చెప్పుకుంటున్నట్టుగా ఉండేవి. ఎప్పుడూ ఏ గుడికీ వెళ్ళని తను ఇస్మాయిల్ గారు వాళ్ళతో ద్రాక్షారామం గుళ్ళోకెళ్ళి అక్కడ అర్చకుడికి వెనక్కొచ్చేస్తూ టకామని బుద్ధి పుట్టి ఒక వంద రూపాయల నోటు అతని చేతిలో పెట్టేననీ, మీకు ఉండుండి హఠాత్తుగా భక్తి పుట్టుకొచ్చిందా? అంటే ‘అదేం కాదు. ఆ చిన్న కుర్రాడు వెళ్తుంటే తనని చూసి నవ్వేడని, అతని దొంతర పన్ను చూసి ముద్దొచ్చి అలాగిచ్చే’నని అదీ ఒక కధ.

త్రిపురతో సంభాషణంతా ఒక అబ్సర్డిష్ట్ కామెడీ లాగ చాల నవుతాలుగా కూడా నడిచేది. నేను త్రిపుర చెప్పే కధలన్నింటికీ ఇల్లదిరిపోయేలాగ పగలబడి నవ్వుతాను. త్రిపురకి బిగ్గరగా నవ్వే అలవాటు లేదు. ఇంక ఎప్పుడైనా మరీ నవ్వొస్తే మాత్రం ‘అహ్హహ్హా..’ అని నెమ్మదిగా నవ్వేవారు. ఒకాయనతో మాటల్లోన తనకి ఒంటరిగా ఉంటేనే ఇష్టం అంటే ఆయన ‘అవునండి! Two is company. Three is crowd’ అంటారు కదా!’ అన్నారట. త్రిపుర వెంటనే తనకి ‘One is crowd’ లాగుంటుంది అన్నారట. త్రిపురవి ఇలాంటివి, సమయానికి తగు మాటలు కొల్లలుగా జ్ఞాపకం వస్తాయి. ఒకసారి ఒక చిన్న పుస్తకం తీసేరు. దాంట్లో ఒక నలభై పేజీలుంటాయేమో, అసలు విషయం నాకు చూపించడం కోసం ఆయన ఎన్ని పేజీలు తిప్పుతున్నా ఇంకా ఇంకా ముందుమాటే నడుస్తోంది కాని అసలు విషయం రావటం లేదు. మేమిద్దరం నెమ్మదిగా చిరునవ్వుల్లాగ ప్రారంభించినా అలా ఆయన పేజీలు తిప్పుతున్న కొద్దీ నేను ఇంక ఉగ్గబట్టుకోలేక నవ్వుతుంటే ఆయన కూడా ఆ పుస్తకం పక్కన పడీసి “అబ్బ! ఎంత లెక్కన రాసేడువై Foreword?! అసలు దానికంటే ఇదే ఉన్నాదీ!!” అని నవ్వేరు. ఎప్పుడో చాలా ఏళ్ళ కిందట నేను తొలీత విమానం ఎక్కేను. విమానం బొంబాయిలో దిగితుంటే ధారవి మురికివాడలు చూసేనని, ఏడుపొచ్చిందనీ అన్నాను. ఆయన ఏమంటారో అని చూస్తున్నాను. ‘ఊఁ..!’ అని తలాడించి ఊరుకున్నారు. నేను రెట్టించడానికి ‘ఏడిస్తే మంచిదే కదా త్రిపుర?!’ అంటే ఠక్కుమని వెంటనే “మంచిదేవై! Tear ducts శుభ్రం అవుతాయి కదా!” అన్నారు. “ఏడ్చి, ఇలా చెప్పుకునీ ఏం సాధించేవు? Did that translate into any action, something you did for them?” అనడిగేరు.

త్రిపుర చుట్టూ ఒక చిత్రమైన సమాచార వ్యవస్థ ఉండేది. ఆయన చాలా కాలంగా పత్రికలకని రాసింది లేదు, చెప్పింది లేదు. కాని ఎందరో అభిమానులు, పరిచితులు ఆయన దగ్గరికి వచ్చి పోతుంటారు. అది ఒక నెట్‌వర్క్ అని త్రిపురకి తెలుసు. తను ఎవరితో ఏ మాటన్నా అది అలా అలా అంచెలంచెలుగా సాహితీ ప్రపంచం అంతటికీ విస్తరిస్తుందని చెప్పేవారు. సున్నితమైన విషయాలు ప్రస్తావనకి వచ్చినప్పుడు వచ్చినవాళ్ళకి సహాయంగా ఉంటాయనిపిస్తే ఒకటి రెండు మాటలు చెప్పి ముగించి, ఆ తరవాత ఇంక చాలు అన్నట్టు చూసి కళ్ళతోనే ఊఁ కొడుతూ చూస్తుండిపోయేవారు. ఒకసారి ఎవరితోనో ఆయనకి తగువులా ఒచ్చింది ఏ విషయం మీదనో. అప్పుడు అవతల పోట్లాడుతున్నాయనా ఈయనా ఎక్కడా ఎదురు పడకుండా, ఏ వాద ప్రతివాదాలూ రాసుకోకుండానే అట్నుంచిటూ ఇట్నించటూ మాటల్ని ఎలా బాణాల్లాగ సంధించుకున్నారో అదీ నాకు రెండు చేతుల్తో అట్నించీ ఇట్నించీ బాణాలు ఒస్తున్నట్టుగ నెమ్మదిగా అభినయించి చూపించేరు.

2011 వరకూ ఏవేవో పుస్తకాలు పట్టుకెళ్ళి ఇస్తుండేవాణ్ణి. Larry Shainberg పుస్తకం Ambivalent Zen ఆయనకిచ్చేను. చదివి కళ్ళంట నీళ్ళొచ్చేయి అనన్నారు. చాన్నాళ్ళ కిందట త్రిపురకి జపాన్‌లో ఒక జెన్ ప్రొఫెసర్‌తో ఉత్తరాలు నడిచేవి. ఆయన రమ్మనమంటే వెళిపోదామనుకున్నారు. ఎందుకో కుదర్లేదు. కార్లో పక్కన కూర్చుని ఆ సంగతులన్నీ చెప్పేరు. త్రిపుర అరవయ్యో ఏటి నుండే నాకు తెలుసు. అంతకు ముందరి సంగతులు ఆయన కధలు కధలుగా చెప్తేనే. ఆయన మాటల్లో ఎలాంటి religious overtones ఉండేవి కావు. దేవుడు, మతం ఇలాంటివి ప్రస్తావనకు వస్తే ఆయన సానుభూతితోనే ఒకే ఒక్క మాటతో తేలిక చేసేవారు. దేవుళ్ళకీ పెళ్ళిళ్ళు, ఆడ పెళ్ళివారు, మగ పెళ్ళివారు, వాళ్ళకి పిల్లలూ, పేరంటాలూ ఇలాగ మనకున్నవన్నీ వాళ్ళకీ చేస్తారు! అని నవ్వేవారు. ఎవరైనా మెడిటేషన్ చేస్తారా? అనడిగితే “మెడిటేషన్ అని కూర్చుంటే చెడ్డ ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇలాగుండడమే అంతే!” అని నవ్వించేవారు. “ఊళ్ళో ఏ జంక్షన్‌కి వెళ్ళి చూడవై! కోచింగ్ సెంటర్, చికెన్ సెంటర్, మెడిటేషన్ సెంటర్, ఈ మూడూ పక్క పక్కనే కనిపిస్తాయి. ఎమ్‌సెట్ కోచింగ్ తీసుకుని, చికెన్ వండుకు తిని, హా..యిగా మెడిటేషన్ చేసుకోమని!” అని నవ్వించేవారు. జ్యేష్ట గారి T.M. (Transcendental Meditation)ని ‘తీసుకోడం మానీడం’ అనేవాళ్ళమని చెప్పేవారు. చలం గారు అరుణాచలం వెళ్ళిన ఊసొస్తే “అక్కడికెళ్ళి చెడిపోయేడు!” అన్నారు. జిడ్డు క్రిష్ణమూర్తి గారి ప్రసంగాల ప్రసక్తి వస్తే “అవి షోకేస్ ఐటమ్‌స్ లాగ అనిపిస్తాయి. చూసి ‘ఓహో!’ అనుక్కోడానికే, They don’t actually operate in our lives కదా?!” అన్నారు. మతాల్లో ప్రతీ తోవకీ, ప్రతి శాఖకీ ఒక గురువుంటారనీ, ఆ గురువు చెప్పిన మాటలు విశ్వాసంతో నమ్మమంటారనీ, గురూజీ దగ్గర చూడు ఎంత ప్రశాంతంగా ఉందో? అంటారనీ, తనకి అలా నమ్మ బుద్ధెయ్యదనీ చెప్పి ‘ఎలా నమ్ముతాం? How can we …?’ అని నన్నడిగేవారు. ఎప్పుడో ఇరవయ్యేళ్ళ కిందట ఒక రోజు నేను గీతాజ్ఞాన యజ్ఞం లాంటి సమావేశానికెళ్ళి అట్నుంచటు త్రిపుర దగ్గరికెళ్ళేను. ఎక్కణ్ణుంచి ఒస్తున్నావని అడిగితే చెప్పేను. ఓహో! అన్నారు. “త్రిపుర, మీ ఫిలాసఫీ ఏంటి?” అని అడిగేను. చుట్టూ ప్రపంచాన్ని చేతుల్తో చూపిస్తున్నట్టు అభినయించి “ఇదంతా …. Nothing!” అన్నారు. ఇదంతానా? అనంటే ‘ఊఁ..’ అని అన్నారు. మానవ వ్యాపారాల్లో ఏ ఒక్కదాని ప్రస్తావన వచ్చినా దాని assumptions మీద ఎక్కుపెట్టి సున్నితమైన హాస్యాన్ని కేవలం ఒక్క వాక్యంలోనో, మాటలోనో సంధించి చాల నవ్వించేవారు కాని ఆ పరాచికాల్లోన కేవలం కరుణ, సానుభూతి తప్ప హేళణ, ఆరోపణ, సొడ్డింపు లేశమాత్రమైనా ఉండేవి కావు.

మేం చాలా కాలం ఉత్తరాలు రాసుకున్నాము. త్రిపుర దస్తూరిలో అక్షరాలు గుండ్రంగా ఉంటాయి, కాని ప్రతి అక్షరానికీ ఏదో ఒక కొమ్ము కొనదేలి కూడా ఉంటాయి. ఆయనకి నల్ల రంగు కాయితం మీద సిల్వర్ అక్షరాలంటే ఇష్టం. భగవంతం కోసం వెదుకులాట It ends in naught! అని రాసేరు. ఈ-మెయిల్ వచ్చిన కొత్తల్లో లండన్ నుండి నేర్చుకుని ఓపిగ్గా ఈ-మెయిల్సు కొట్టేవారు. పదిహేనేళ్ళ కిందట ఆస్టిన్‌లో మా ఇంటికొచ్చి రెండ్రోజులున్నారు. అప్పుడు నేనడిగితే ఏ ఏ పుస్తకాలు తప్పకుండా చదవాలో ఒక జాబితా రాసిచ్చేరు. Dharma Bums, On the Road, …. ఇలాగ. కిళ్ళీల కోసం చాలా దూరం ఇండియా బజారుకి తీస్కెళ్తే అక్కడ గుజరాతీ కొట్టాయనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. మా ఇంట్లో డాబా మీదికి ఒక గాజు స్లైడింగ్ డోర్ ఉండేది. హడావిడిగా అట్నుంచిటూ ఇట్నించటూ నడిచొస్తూ ప్రతీ సారీ ఆ గాజు తలుపు అక్కడ లేదనుకుని తల గుద్దుకునేవారు. ఆస్టిన్‌లో యూనివర్శిటీ, చర్చిలు, పుస్తకాల షాపులూ తిరిగేము. నది ఒడ్డున కూర్చుని పిజ్జా తిన్నాము. ఆయనకు కాశీలో స్నేహితుడు, All About H. Hatter నవలాకారుడు జీవీ దేశాని ఆస్టిన్‌లో ఉండేవారని ఆయనకోసం వెదికేము కాని ఆయన ఆచూకీ దొరకలేదు. ఆయన్ని ఇంగ్లిష్ నవలా సారస్వతానికి అపురూపమైన నవలను అందించిన వ్యక్తిగా చెప్పుకుంటారు. ఒకసారి కాశీలో త్రిపురని ఆయన హిప్నటైజ్ చేసి బాగా బరువుండే పెద్ద భోషాణం పెట్టెని గది ఈ మూలనుండి ఆ మూలకి జరిపేలా చేసేరట. ఇంగ్లిష్‌లో అనర్గళంగా, చాల చిత్రంగా మాట్లడేవారట. మీ ఉత్తరాలు UG Krishnamurti మాటల్లా ఉన్నాయని రాస్తే ‘అతను నాకు నచ్చేడు. అతను చెప్పేదే నేనూ చెప్తున్నాను. I do that without much fanfare’ అని రాసేరు. తనకి UGని బెనారస్‌లో తెలుసునని, ఆయన హేండ్‌సమ్‌గా ఉండేవాడని, గొప్ప వాక్చాతుర్యంతో ఉపన్యసించేవాడనీ గుర్తు తెచ్చుకున్నారు. వెనక్కెళిపోయేక UG పుస్తకాలు అడిగి తెప్పించుకున్నారు. నాయకులు, గొప్పవాళ్ళకి స్వయంగా వాళ్ళూ చుట్టూ పదిమందీ కలిసి నిర్మించే Public Personaను ఆయన సానుభూతితోను, సంశయంతోనూ పరికించి చూసేవారు. స్వాతంత్ర్య సమరం రోజుల్నుండి ఇవాళ్టి వరకూ చాల కధలు చెప్పి నవ్వించేవారు. అన్ని గొప్పల్నీ ప్రశ్నించీ త్రిపుర ఏ ఒక్కరి మీదా కోపగించుకోలేదు.

కొన్నాళ్ళకి నాకు ఉత్తరాలు రాయాలని ఆసక్తి లేకుండా పోయింది. ఊరుకున్నాను. అదీ ఆయన గ్రహించుకున్నారు. “అంతా కులాసా అని ఒక చిన్నపాటి వాక్యం రాయడానికే నీకు అంత స్ట్రగుల్‌లా ఉందా?” అని రాసి, మన్నించి ఒదిలీసేరు. ఆ తరవాత ఈ మధ్య ఉత్తరాలు రాయమంటారా మళ్ళీ? అనడిగితే ‘ఒద్దు, చదవలేను, ఓపిక లేదు!’ అన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి లేదులే, చదువుతాను రాయమన్నారు. నిరుడు ‘అది కాదే‘ అని ఒక కవిత ఆయన కంటపడింది. అది చదివి ‘ఈ భాష కవిత్వ భాష, దీని syntax కవిత్వానిది…’ అని అన్నారు. “నీకు ఇలాగుంటుందా? దీన్ని Acedia అంటారు. దేనిమీదా లేకపోతే, ఏదీ చెయ్యాలని లేకపోతే ఎలాగ మరి …? ఎలాగ…??” అని తనకి తెలీనట్టే అడిగేరు. ఏకకాలంలోనే ఆయనది complete rejection of everything, which is complete acceptance everything as well.

ఊదా రంగు త్రిపురకి ఇష్టమైన రంగు. మాటలతో రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చెయ్యడం సరదా ఆయనకి. ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ లోని ప్రతి ఒక్క మాటనీ కనీసం ఒకసారైనా చూసి ఉంటాననీ, తను చూడని మాట లేదనీ చెప్పేవారు. ఈ మధ్యల్లా ఆదివారాలు త్రిపుర క్రాస్‌వర్డ్ పజిల్స్ పూర్తి చెయ్యడం శ్రీవారి తోమాలసేవ లాగ ఒక పెద్ద కార్యక్రమంలా నడిచేది. ఆదివారం పొద్దున్న భోజనాల బల్ల మీద డెక్కన్ క్రానికల్ పరిచి బాల్ పెన్నుతో ఆ ప్రహేళికలన్నీ పూర్తిచెయ్యడమే ఆ కార్యక్రమం. ఆ పజిల్స్ ఇచ్చేవాళ్ళు రాన్రానూ మరీ ఏ మూల మూలల్లోనివో పారిభాషిక పదాలు చొప్పించేవారు – A leather contraption popularly used in the late medieval Celtic naval expeditions ఇలాగ. అవన్నీ పూర్తయి ఒకటో రెండో మిగిలిపోతే నాకు త్రిపుర నుండి “హలో! కనకా!!” ఫోన్‌కాల్ వచ్చేది. “It has 7 letters. K – – OB – D; A brick wall measure to the East of Nile during ….” అని ఇలాగ ఫోన్లో వర్ణించి నన్ను ఇంటర్‌నెట్ అంతా వెదకమని ఆజ్ఞాపించేవారు. మేం ఇద్దరం రకరకాలుగా కుస్తీలు పడుతుంటే ముందుగా త్రిపురకే ఆ మాటేదో తెలిసిపోయేది. అప్పుడు విజయగర్వంతో భోజనానికి లేస్తారు. మే మొదటి ఆదివారం ఏదో ఒక చాలా కష్టమైనది ఎక్కడిదో ఒక ఐదక్షరాల మాట పట్టుకోవలిసి ఒచ్చింది. ఆ పొద్దున్నంతా ఎన్ని రకాలుగా కుస్తీ పట్టినా ఎట్నుంచెటూ ఏం పాలుపోలేదు. ‘మా ఆవిడ డబ్బాలు సర్దుకోవాలని పోరు పెడుతున్నాది, నా వల్ల కాదు త్రిపుర!’ అని నేను మొదటి సారిగా చేతులెత్తీసేను. ఆయన ‘అదిగో ఆ సైట్ చూసేవా, ఇల్లిది చూసేవా?’ అని నన్ను అడిగడిగి చాల నిరాశ పడిపోయేరు. ఆ తర్వాత అరగంటకే నాకు మళ్ళీ ‘హలో! కనకా…!!’ ఒచ్చింది. ఫోన్లో విజయగర్వంతో అరుస్తున్నారు. ఆ మాట తనంతట తనే వెదికి పోల్చుకున్నాననీ, అంత లావున్నావు నీకు కంప్యూటర్లూ, ఉద్యోగాలూ అవీ ఎందుకనీ, నా ఉద్యోగం తనకి ఇచ్చీమంటాననీ నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను ఓటమిని అంగీకరించి పెట్టెలు సద్దుకోడానికెళిపోయేను.

రెండేళ్ళ కిందట లక్డీకా పుల్ దగ్గర పాత పుస్తకాల షాపులోకెళ్ళి పుస్తకాలన్నీ చాల సేపు కెలికేము. ఏమీ కొనుక్కోలేదు. వాళ్ళింట్లో అందరికీ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూనే ఉండటం అలవాటని, బుక్స్ లేకపోతే మరింకేంటనీ అన్నారు. Martin Amis నవలలు తెప్పించుకున్నారు. చాల అల్లరిగా రాస్తాడు అని. తప్పకుండా రాయాలి. రాస్తుండాలి, పుస్తకాల్లో అచ్చులో వెయ్యాలి అని పదేపదే చెప్పేరు. ఒక చీకటిగా ఉండే కాఫీ హొటల్లోకి వెళ్ళేము. అక్కడ ‘లస్సీ కావాలా మిల్క్ షేక్ కావాలా?’ అని ఇలాగడుగుతుంటే ‘నువ్వు తాగవు కదూ..?’ అనడిగేరు. “ఉండాల్లే….అదుండాలి! For a writer .. కొంచెం మోతాదుగా Drink ఉంటేనే..!” అని ‘అదీ’ ‘ఇది’ కలిసి ఒకదాన్నొకటి ఎలా ఉద్దీపనం చేసుకుంటాయో మెట్టు మీద మెట్టులాగ చేతుల్తో గాల్లోకి ఎక్కించుతూ అభినయించి చూపించేరు. త్రిపురనేని శ్రీనివాస్‌ని, అజంతాని, మోహన ప్రసాద్‌ని గుర్తు తెచ్చుకున్నారు. ఒకరోజు బాగా పొద్దుపోయీ వరకు తాగున్నవాళ్ళు ముగ్గురికేసీ చూసి త్రిపురనేని శ్రీనివాస్ నాటకీయంగా “ఇదుగో ముగ్గురు మహాకవులు! ఇదుగో మీరొక మహాకవీ, మీరొక మహాకవీ, మీరొక మహాకవీ…! అదుగో ఆ డాబా మెట్లు!! వాటిమీద ఇప్పటికిప్పుడు… కవిత్వం చెప్పండి!” అని అల్లరి చేసేడు. అజంతా, మోహనప్రసాద్ ‘మెట్లు…మెట్లు…’ అని ఆశువుగా కవిత్వం చెప్పడానికి సమాయత్తం అయ్యేరని చెప్పేరు. అవేళా సాయంత్రం ఒక పెద్ద షాపింగ్ మాల్ – దాన్లోకెళ్దాం, చొక్కాలూ పెన్నులూ కొందాం అంటే అలాగేనని, తీరామోసి లోపళికెళ్ళి లిఫ్ట్లో నిలబడితే అంతమంది గుంపుతో అది కదల్లేక మొరాయించింది. వెంటనే బయటికొచ్చి ఇంక చాలు ఇంటికెళిపోదామని అన్నారు.

ఆర్నెల్ల కిందట త్రిపుర వాళ్ళింట్లో రెండు రోజులున్నాను. ఎప్పుడొస్తావు? ఎప్పుడొస్తావని పంతం పట్టేరు. నాతో ఆయన కవితల పుస్తకాలు మూడూ ప్రతీ కవితా బిగ్గరగా చదివించుకుని విన్నారు. కవిత కవితకీ వెనకాలున్న కధలు చెప్పేరు. కాఫ్కా కవితల పుస్తకంలో ‘ఎడారిలో కాఫ్కా కాపలా..’ అనుంటుంది. వాళ్ళమ్మగారు పోయినప్పుడు రాసింది. అది చదవొద్దు, ఆయన్ని నొప్పించొద్దు అనుకుని దాన్ని మినహాయించి ఆ మీదటిది చదవబోతుంటే, “అక్కడ కాఫ్కా కాపలా ఉండాలి, మా అమ్మ పోయినప్పుడు రాసేను, అది చదువు!” అని ఆజ్ఞాపించేరు. పుస్తకం చివార “నిశ్శబ్దపు పిలుపు వినగలవు నువ్వు, నిశ్శబ్దపు గర్జనను వినగలవు, ఈ ప్రపంచం కంటే లోతైన ప్రపంచాల్లోంచీ…” అని నేను చివర్లో చదివితే “ఇది నీకు ఇష్టం! You like this…” అని నన్ను చూసి నవ్వేరు. ఆ మర్నాడు నేను త్రిపుర ఎదురుగా మఠం వేసుక్కూచుని అవధారు రఘుపతి అందరినీ చిత్తగించు… అని ఖమాస్ రాగంలో కీర్తన పాడితే తలూపుకుంటూ విన్నారు.

కందువ కౌసల్య గర్భ రత్నాకరా
చెందిన శ్రీ వేంకటాద్రి శ్రీనివాసా
సందడి కుశలవులు చదివేరు ఒక వంక
చెంది నీ రాజసము చెప్ప రాదు రామా!

అన్న చరణాల్లోన ‘రా….జసము‘ అని మళ్ళీ మళ్ళీ ఒచ్చిన దగ్గర కుర్చీలో బిగదీసుకుని రాజు లాగ కటింగ్ కొట్టి నవ్వుతున్నారు. వాళ్ళింటి పేరు రాయసం. త్రిపుర నవ్వినప్పుడు పెదాలు ముడి పడి Sean Connery నవ్వినట్టుంటుంది.

ఆ రెండ్రోజులూ తన ఆత్మకధను శకలాలు, జ్ఞాపకాలుగా నాతో వివరంగా పంచుకున్నారు. “I am childlike, and also childish ..” అని చెప్పుకున్నారు. ఆయన, సుధాకర్, నేను ఇట్నుంచొచ్చీ అట్నుంచొచ్చీ ఏవేవో మాటాడుతూనే ఉన్నాము. వెళిపోతుంటే తను మామూలుగా ఏమీ మాటే మాటాడ్ననీ, ఆ రెండ్రోజులూ ఎన్నెన్ని మాటాడేననీ అన్నారు. “మాటాడుతున్నదేమో తెలుగు లిటరెచర్ గురించి, మాటలన్నీ ఇంగ్లిష్ లోనా?!” అని ఇగటాలాడేరు. త్రిపుర ఏనాడూ పట్టుదలగా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇలాక్కాదు అలాగ! ఆని నొక్కి చెప్పడం చూళ్ళేదు నేను. అవేళ మాత్రం మాకిద్దరికీ ఒక టకాఫోర్ వచ్చింది. మాటల్లోన బాలగోపాల్ గారి ప్రసక్తి వచ్చింది. నేను ఆయన “సాహిత్యం జీవితంలో ఖాళీల్ని పూరించాలి” అని అన్నారని అభ్యంతరం చెపుతున్నాను. “బాలగోపాల్‌కి సాహిత్యంతో ఏం పని?” (”What business did Bala Gopal have with Literature?”) అన్నాను. ఆ మాటకి త్రిపుర అంతెత్తున లేచేరు. “ఆ మాటంటావేంటి? అలాగంటావేంటి?? He had EVERY business to do with Literature!!” అని గట్టిగా తగులుకున్నారు. నేను నా మాట మీదే నిలబడిపోయేను. బాలగోపాల్ గారి కార్య రంగం సాహిత్యం కానే కాదు కదా, ఆయనకు అలాగ సాహిత్యం సమాజానికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ప్రకటనలు ఇవ్వవలసిన పనేం వచ్చింది? అని. త్రిపుర బంకనకడికాయ లాగ పట్టుకుని ఒదల్లేదు. ‘నీకు ఆ మాట నచ్చలేదని అనొచ్చు, నీకు వేరే అభిప్రాయం ఉన్నాదని అనొచ్చు! ‘What business did he …?’ అంటావా? అలాగనటం బావులేదు…?’ అని ఒదల్లేదు. నేను అంటున్న సందర్భం చూడండి.. అంటుంటే ”No, No! Whatever be the context..! అని. త్రిపుర ఏదైనా విషయాన్ని గురించి పంతం పట్టి చెప్పే పద్ధతి మాటల్లో చెప్పడానికి రాదు, అభినయించి చూపించాలి. నా అదృష్టం బాగుండి అన్నాలకి లేచిపోయేము.

ఈ జనవరిలో Martin Figura అని ఒక బ్రిటిష్ పొయెట్ హైదరాబాద్ వచ్చేరు, Poetry Workshop కోసం. అందులో చేరాలంటే దరఖాస్తుతో పాటు ఒక ఇంగ్లిష్ కవిత జత చెయ్యాలి. అందుకోసమని నేను త్రిపుర కవిత వ్యధ ఒక కధ ఇంగ్లిష్ లోకి చేసేను. మార్టిన్ బ్రిటిష్ లైబ్రరీలో ఒక పదిహేను మందితో వర్క్షాప్ చేసేడు. ఉపమ (Metaphor), ధ్వని ప్రధానంగా కవిత చదివేవాళ్ళకి ఎలా ఆవిష్కృతమౌతుందో పొడుపు కధలు, సామెతలతో మొదలుపెట్టి ఓపిగ్గా పాఠం అల్లుకుంటూ వొచ్చేడు. ఆయన చెప్పిన పాఠాలు త్రిపురకి చెప్తే చాల నచ్చుకున్నారు. కవిత్వంలో విశేషణాన్ని (Adjective) ఎలా వాడాలో, ఎలా వాడకూడదో మార్టిన్ చెప్పింది ఎంతో పనికొస్తుందనీ, Eliot ఆ మాటే చెప్పేరనీ నాకు మళ్ళీ పాఠం చెప్పేరు. అదేంటంటే కవిత పాదాల్లో అడుగడుగునా వాడేద్దామని ఉబలాటంగా ఉన్న విశేషణాలని విచ్చలవిడిగా వాడీకుండా నిగ్రహించుకొని, ఆ విశేషాన్ని పాఠకుడి ఊహకే విడిచిపెడితే కవిత సాంద్రతరమౌతుంది – Less is more అన్నట్టుగ. లేదు విశేషంగా వర్ణించడం తప్పనిసరి అనిపిస్తే వాక్యం నిర్మించేటప్పుడు విశేషణాన్ని కాకుండా ఉపమ వంటి సదృశ రూపాన్నో, సమాస రూపాన్నో ఎంచుకొని ఆ అనుభవాన్ని విలక్షణంగా సాధించుకోవడం. ఉదాహరణకు ‘కాలు చల్లదనాలొ కనలు తీయదనాలొ’, ‘పాము వంటి పగలు, పడగ వంటి రేయి’ వంటి ప్రయోగాలు కొన్ని గుర్తొస్తాయి.

నేను అప్పట్లో మార్టిన్, త్రిపురతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మెళుకువలు రకరకాలుగా ప్రయత్నించి చూస్తూ ఆగలేకుండా త్రిపుర కవితలు చాలా ఇంగ్లిష్‌లోకి చేసేను. అవి మార్టిన్‌కి, నా ఫ్రెండ్స్ Mark, Jeff, Bipin కి పంపిస్తే వాళ్ళు చదివి వెనక్కి జవాబులు రాసేవారు. ఇలాగని త్రిపురతో చెప్తే ఆయన చాల సరదా పడ్డారు. త్రిపుర కవితలు ఇంగ్లిష్ మనుషులు చదివి ఏం అనుకున్నారో అని ఆసక్తిగా ఉందనీ, వాళ్ళు ఏం రాసేరో తనకీ చదవాలనుందని. పట్టుబట్టి తనకి పోష్ట్లో పంపమన్నారు, వాళ్ళందరు రాసిన వ్యాఖ్యలతో సహా. త్రిపురకి పోస్టల్ డిపార్ట్‌మెంటంటే చాల గౌరవం. ఎన్నో ఏళ్ళుగా కొంచెం ష్టాంపులు అంటిస్తే తప్పకుండా ఉత్తరాలు తెచ్చిచ్చెస్తారు చూడు? అని మెచ్చుకునేవారు. ఒకసారి పంపింది ఎన్నాళ్ళయినా పోస్ట్లో అందకపోతే మళ్ళీ అంతా ప్రింట్ తీయించి కొరియర్ చేసే దాకా ఒప్పుకోలేదు. త్రిపుర కాఫ్కా కవితల్లో, పేరులో కాఫ్కా ప్రస్తావన వస్తుంది. నేను ఇంగ్లిష్ చెసినవాటిలో కాఫ్కా ఊసు రాదు. ఒక రోజు యధాలాపంగా వాటిలో ఒక ఇంగ్లిష్ కవితని టైపు కొట్టి ఇంటర్నెట్లో వెతికేను. వెంటనే అ కవితదే కాఫ్కా మూలానికి ఇంగ్లిష్ అనువాదం ఒచ్చింది. ఆది చూస్తే చిత్రంగా నేను ఇంగ్లిష్‌లో ఎలా, ఏమేం మాటలు రాసేనో సుమారు అలాగే ఆ మాటల్లోనే ఉంది. గమ్మత్తుగా అనిపించింది – త్రిపుర తెలుగులో రాసిందాన్ని నేను ఇంగ్లిష్‌లోకి చేసుకుంటే అది మాటలతో సహా మూలంలో ఇంగ్లిష్ లాగే ఉన్నాదని. ఇలాగని అడిగితే త్రిపుర తన కాఫ్కా కవితలు అన్నీ చాలా వరకు కాఫ్కా డైరీల్లాంటి ఖండికల వలన ప్రభావితమైనవని, వాటిలో ప్రతి దాని పేరులోనూ కాఫ్కా ఒస్తాడనీ, పుస్తకం పేరే కాఫ్కా కవితలు కదా అనీ చెప్పేరు.

తన కధల్లో ఏదో ఒకటి తీసుకుని ఇంగ్లిష్‌లోకి చెయ్యమన్నారు. తనకి అదొక సరదా ఉండిపోయింది అని. త్రిపుర కవితల పుస్తకాలు కూడా మళ్ళీ వేసెద్దాం వేసెస్తాం అని, ఏదేనా రాయాల్రాయాలనీ రామయ్య గారు ఏడాదాయి వేపుకు తింటున్నారు. అలాగని మొదలుపెడితే అది త్రిపుర కవిత్వాన్ని, త్రిపుర Aestheticను ఆలంబనగా ఒక ఇరవైరెండు అధ్యాయాల పుస్తకం అవబోతుంది. దాని పేరు, అధ్యాయాల విషయ సూచిక మాత్రం ఒక ప్రణాళిక వేసుకున్నానని, రాస్తానో లేదో తెలీదనీ అన్నాను. “నీకు రాయాలి అనున్నాదా?” అనడిగేరు. ‘అవును నాకు రాయాల్నే ఉన్నాది. త్రిపుర కోసం కాదు, నా కోసం’ అని అన్నాను. అలాగయితే రాయి! అన్నారు.

ఆర్నెల్ల కిందట నేను వాళ్ళింటికెళ్ళి వెనక్కొచ్చీసిన రోజు సాయంత్రం పొద్దు పోయేక ఫోన్ చేసి ఆ మధ్యాన్నమంతా అక్కుళ్ళు బుక్కుళ్ళై ఏడుస్తూనే ఉన్నానని చెప్పేరు. త్రిపుర కోసం నేను అలాగే ఏడుస్తానని అంటే అప్పుడు “ఊఁ..ఊఁ…” అన్నారు. ఇప్పుడు మా అమ్మ చొక్కాల పేకట్టు పట్టుకుని వెనక్కొచ్చీసింది. “నాన్నా త్రిపురా గారు తత్వదర్శి?!” ఆని ఒక ప్రశ్నలాగ అడిగింది. నాకు ఒళ్ళుష్టమొచ్చినట్టుగయింది. నా ఒక్కగానొక్క స్నేహితుడు. అర్ధంతరంగా అసందర్భంగా నేనూ ఇలాగెళ్ళిన అదును చూసుకుని అలాగ పెద్ద టికట్టు తీస్సేడు. దేశం కాని దేశం లోన, తనే లేని లోకంలోనా నేను ఇంకెవడితో చెప్పుకుని ఏడుస్తాను? త్రిపురకి ఒరిగిందేమీ లేదు. నా Tear ducts క్లీనవుతాయి. తత్వదర్శి అయితే అయ్యేడు. యెదవనాకొడుకు.
----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment