Thursday, October 25, 2018

అభయారణ్యంలో ఏంబర్


అభయారణ్యంలో ఏంబర్సాహితీమిత్రులారా!

కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంతారం. ఇదీ వర్షారణ్యం అంటే!! ఆస్ట్రేలియాలో వర్షారణ్యం అన్న పేరుతో పర్యాటకులకి చూపించే అడవి దీని ముందు బలాదూర్‌! మెక్సికో దేశంలో యూకటాన్‌ లోని అయనరేఖా మండలంలో ఉన్న అడవులలో చెట్ల కంటె కూడ ఇక్కడ ఇంకా దట్టంగా పెరిగిన వృక్ష సంపద లోని అందం వర్ణనాతీతం! అంబరచుంబితాలుగా ఎదిగిన చెట్ల కొమ్మలు ఆకాశమంత పందిరి వేసినట్లు నాలుగు దిక్కులా పరివ్యాప్తి చెంది సూర్యరశ్మి భూమిని తాకకుండా చేస్తున్నాయి. ప్రాణ ప్రదాత అయిన వెచ్చని సూర్యకిరణాల తాకిడి కోసం గుయ్యారంలా ఉన్న అడవి నేల నుండి లతావల్లికలు చెట్లని ఆసరా చేసుకుని ఆకాశం వైపు ఎగబాకుతున్నాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగే. లేతాకు పచ్చ ముదరాకు పచ్చల మధ్యలో ఉన్న రకరకాల చాయలలో రకరకాల పచ్చలు! ఇదొక పచ్చ సముద్రం.

నొప్పి పెట్టే వరకూ మెడని సారించి చూసే ఓపిక ఉండాలే తప్ప చూసిన వారికి నేత్రానందం కలుగజేసే విధంగా చెట్టు కొమ్మలని వేలాడుతూ గబ్బిలాలు! పచ్చటి చెట్ల కొమ్మల మీద రంగు రంగుల రామ చిలుకలు, పెద్ద చిలుకలు, ఇంకా పెద్ద టూకాన్‌ చిలుకలు. మెడ దించి కిందకి చూస్తే చిత్తడిగా ఉన్న నేల మీద ఒత్తు ఒత్తుగా అంగుళం దట్టంగా ఉండి ఎండి కుళ్ళుతూన్న ఆకులు, అలములు. చెట్ల ఆకుల నుండి టపటప చుక్కలు చుక్కలుగా రాలుతూన్న నీటి బిందువులు పల్లపు ప్రదేశాలకు చేరి, నీటి గుంటలుగా మారి, అవి నిండినప్పుడు పొంగి, పొర్లి చిన్న చిన్న పిల్ల కాలువలలా ప్రవహిస్తున్నాయి. ఈ నీటి గుంటలలో ముదరాకు పచ్చ చర్మపు రంగు మీద లేతాకుపచ్చ మచ్చలుతో అలరారే పెద్ద పెద్ద బోదురు కప్పలు. వాటి బెకబెకలు సింహ గర్జనలా ఉన్నాయి కాని టర్టరాయణంలా లేనే లేవు. ఈ కప్పలు అరచేయంత పొడుగున్న మిడతలని పట్టి తింటూ ఉంటే చూడడానికి ఒక పక్క కుతూహలం, మరొక పక్క ఏహ్యభావం, మరొక పక్క పక్కా భయం. అక్కడ నేల మీద ఉన్న తుప్పలలో పిడికిలి ప్రమాణంలో ఉన్న సాలీళ్ళని చూస్తూ ఉంటే గుండె నిబ్బరం లేని వాళ్ళకి భయమే వేస్తుంది.

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, ప్రకృతి సౌరభాలని ఆఘ్రాణించి, ప్రకృతి మాత ఒడిలో నిదురించి, ప్రకృతిశక్తి గర్జించినప్పుడు సాహసంగా ఎదుర్కొని ఆనందించాలనే తృష్ణ ఉన్న సాహసికులకి ఈ అరణ్యం గంతవ్యం.

ఎవరెస్టు శిఖరం ఎక్కేసరికి అక్కడ కాఫీ, ఇడ్లీలతో అరవ అయ్యరు హాజరైతే ఎంత బాగుంటుందో అని మనలో కొంతమంది కలలు కన్న రోజులు లేకపోలేదు. ఎవరెస్టు శిఖరం మీద అయ్యరు హొటేలు లేదని మనందరికీ తెలుసు. కాని ఈ అమెజాన్‌ అరణ్యం మధ్యలో, నాగరికత మప్పిన కనీస అవసరాలు కూడ అందుబాటులో లేని దూరంలో అరవ అయ్యరు హొటేలుని పోలిన సదుపాయం ఒకటి ఉంది. దాని పేరే “అమెజాన్‌ యూత్‌ హాస్టల్‌”.
ఆకుపచ్చటి అమెజాన్‌ అఖాతంలో కాలు మోపుకునే సావకాశాన్ని ప్రసాదించిన దీవి ఈ అమెజాన్‌ యూత్‌ హాస్టల్‌. బ్రెజీల్‌ దేశంలో, కొన్ని వేల హెక్టర్లు వైశాల్యం ఉండే సతతహరితారణ్యపు నడిబొడ్డులో, యువతీ యువకుల వసతి సౌకర్యం కోసం, ఈ యూత్‌ హాస్టల్‌ దరిదాపు 700 హెక్టర్ల వైశాల్యపు మేరలో ఉన్న చెట్లని కొట్టి కట్టబడింది. ఇలా తెరిపి చేయబడ్డ మేరలో  చిన్న చిన్న కర్ర, కంపలతో కట్టిన కట్టడాలు నాలుగే నాలుగు ఉన్నాయి. చుట్టూ అడవి అవడం వల్ల, బాడవ నేల చిత్తడిగా ఉండడం వల్లా నేల మట్టంగా కాకుండా పొడుగాటి రాటలు పాతి, వాటి మీద ఈ కుటీరాలని లేవనెత్తి ఎత్తుగా కట్టేరు. ఈ నాలుగు కుటీరాలలో నలుగురేసి మనుష్యులు చొప్పున మొత్తం పదహారు మంది తల దాచుకోవచ్చు. ఈ కుటీరాలు కాకుండా పెద్ద బంగళా వంటి కట్టడం మరొకటి ఉంది. చుట్టూ పంచపాళీలలా ఉన్న వరండాలలో ఉన్న కుర్చీలలో కూర్చుని అడవిని చూసి ఆనందించవచ్చు.

ఈ బంగళా లోపల ఒక విశాలమైన వంట గది, చిన్న పుస్తకాల బీరువా! రెండంతస్తుల మంచాల వరస. మంచాలు లేని వారికి నులక తాడుతో నేసిన ఊయల వంటి “హేమక్‌లు” రాటలకి ఇటూ అటూ కట్టినవి ఉన్నాయి. వాటిలో పడుక్కోవచ్చు. హాస్టల్‌ సిబ్బందితో కలుపుకుని ఇక్కడ జనాభా పాతిక ముప్ఫై మందిని దాటి ఉండదు ఏ సమయంలోనైనా సరే. ఇవీ ఇక్కడ ఉన్న కనీస సదుపాయాలు. హాస్టల్‌ లో విద్యుత్తు కాని, టెలిఫోను సౌకర్యాలు కాని లేవు. టెలివిజన్‌ లేదన్న సంగతి వేరే చెప్పనక్కరనే లేదు. బయట ప్రపంచం నుండి హాస్టలుకి వెళ్ళాలన్నా, హాస్టలు నుండి నాగరిక లోకంలోకి వచ్చి పడాలన్నా రోడ్లు లేవు, విమానాశ్రయాలు లేవు; కమేరావ్‌ గ్రాండే నది మీద పడవలో ప్రయాణమే శరణ్యం.

ఎంతో కష్టపడి ఎవ్వరైనా ఇక్కడకి వచ్చేరంటే వారు ఒకటి రెండు రోజులు చుట్టపు చూపుగా రావడం దండగ. కనీసం రెండు మూడు వారాలైనా ఉండకపోతే పడ్డ కష్టానికి ఫలితం కిట్టదు; ఆయాసం తప్ప ఆనందించడానికి అవకాశం మిగలదు. అందుకని ఇక్కడకి వచ్చే వారు సాహస యాత్రీకులు, ప్రకృతి సౌందర్య ఉపాసకులు, లేదా ఏ విశ్వవిద్యాలయాల్లోనో పరిశోధన చేసే ఆచార్యులు, వారి విద్యార్ధులు. సుకుమారులకి, పిరికి వారికి చేరవలసిన గమ్యం కాదిది. ఇటువంటి మైత్రీభావం నిండుకున్న వాతావరణం లోనికి ఏరి కోరి వచ్చారు రాజ్‌, అతని స్నేహితురాలు, సహాధ్యాయిని అయిన ఏంబర్‌.

అది జూన్‌ నెల. మొదటి వారం. ఏంబరు, రాజు ఈ కీకారణ్యపు నడిబొడ్డులోకి వచ్చి రెండు రోజులు అయింది. “పీత కష్టాలు పీతవి ” అన్నట్లు, ఎంత అడవి అయినా అక్కడ బతికే వారి నిబంధనలు వారికి ఉంటాయి కదా. హాస్టల్‌ సిబ్బంది నిబంధ నియమావళి ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే మొదటి రెండు రోజులు హాస్టల్‌ పరిధి దాటి పోరాదు. ఈ రెండు రోజులూ చెయ్య వలసిన పనులు   కొత్త చోటుకీ వాతావరణానికీ అలవాటు పడడం, అక్కడ బతకడానికి కావలసిన సాధన సంపత్తి ఉందో లేదో చూసుకోవడం, ప్రయాణపు బడలిక తీర్చుకోవడం, సిబ్బందితో పరిచయం చేసుకోవడం, వరండాలో కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి ఆనందించడం. ఎవరి పరుపు చుట్టలు, ఎవరి తిండి సామానులు, ఎవరికి ఏమిటి కావాలో అవన్నీ ఎవరికి వారే సమకూర్చుకోవాలి. హాస్టలు వాళ్ళు సమకూర్చేదల్లా రాత్రి తలదాచుకుందికి చోటు, కాలకృత్యాలు తీర్చుకుందికి మరుగు, సేద తీర్చుకుందికి సదుపాయం, మాట సహాయం. ఏమి కావలసినా పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరు పడవలో వెళ్ళాలి. దానికి రాను, పోను ప్రయాణంలో ఒక రోజు ఖర్చు అయిపోతుంది.

రాజ్‌, ఏంబర్‌లు వచ్చి వారం రోజులు అయింది. పరిసరాలకి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. అక్కడ నది లోనూ, చుట్టు పక్కల ఉన్న పిల్ల పాయలలోనూ తెడ్డు పడవలు వేసుకుని ఇటూ అటూ తిరుగాడడం, సాయంత్రం హాస్టల్‌కి తిరిగి రావడం ఇలా ఒక గాడిలో పడి రోజులు దొర్లి పోతున్నాయి!

ఆ రోజు మంగళవారం. సమయం ఉదయం. యూత్‌ హాస్టల్‌ ప్రాంగణం నుండి అడవిలోనికి నడవడానికి ఉన్న కాలి బాటలని అన్వేషించడానికి ఇద్దరూ ఆయత్త పడుతున్నారు. బాట పొడుగునా గుర్తులు వేసి ఉంటాయి కనుక కాలిబాటలని అన్వేషించడం అనేది పిరికివారు కూడ చెయ్యగలిగిన సాహస యాత్ర! కేలిఫోర్నియా లో ఉన్న కొండలలో ఇటువంటి “హైకింగు ” చెయ్యడంలో రాజు, ఏంబరు,  ఇద్దరూ సిద్ధహస్తులే! పొద్దు కూకే లోగా తిరిగి వచ్చేసే చిన్న నడకే కనుక, కేంపింగు సామాగ్రి వగైరాల అవసరం లేదు. దారిలో ఆకలేస్తే ఉంటాయని చిన్న చిన్న బిస్కట్‌ పేకెట్లు, కేండీ బార్లు, ప్రోటీన్‌ బార్లు, గ్రనోలా బార్లు వగైరాలు తన “బేక్‌పేక్‌” లో సర్దింది ఏంబరు. అవి కాకుండా రెండు లీటర్ల నీటి సంచి, ఇద్దరికీ చెరొక మంచినీళ్ళ సీసా, ఒక గొట్టం దోమల మందు, ఒక స్విస్‌ ఆర్మీ చాకుల గుత్తి, ఒక కెమేరా … ఇవన్నీ రాజు తన వీపు సంచిలో సర్దుకున్నాడు. చేతికి వాచీతో పాటు ఒక దిక్సూచిని కూడ తగిలించుకున్నాడు.

ఏంబరు, రాజు ఒకరికొకరు సమమైన ఉజ్జీయే! వయస్సు లోనూ, ఒడ్డూ, పొడుగులలోనూ ఏంబర్‌ రాజ్‌ కంటె ఒక్క వాసి చిన్నదే. క్రీడాకారులు కాకపోయినా, వ్యాయామం ఎడల శ్రద్ధ చూపే వ్యక్తులే కనుక ఇద్దరూ ఆరోగ్యవంతమైన, దృఢమైన శరీరం కలవారే. ఇద్దరూ పాదాల వరకూ దిగజారిన పంట్లాలు వేసుకున్నారు. మోకాలిని అంటే వరకూ ఉండే పొడుగాటి గొట్టాలున్న రబ్బరు బూట్లు పాదాలకి తొడిగేరు. జొన్న పొత్తు జుత్తులా మెరుస్తూన్న బంగారు రంగు జటాజూటాన్ని పైకెత్తి, ముడి వేసి, ఆ ముడి ఒదులైపోకుండా ఒక “ఎలేస్టిక్‌ బేండ్‌` ని పెన్సిల్తో బిగించింది ఏంబర్‌. జూన్‌ నెల కావడం వల్ల వాతావరణం ఉదయానికే వేడిగా ఉంది. అందుకని ఇద్దరూ పల్చటి పొట్టి చేతి చొక్కాలు తొడుక్కున్నారు. బయలుదేరే ముందు కాసింత తిండి తిని మరీ వెళ్ళమని హాస్టల్‌ సిబ్బంది సలహా చెబితే వేడివేడిగా కోడిగుడ్డు పొరటు, కాల్చిన రొట్టె తిని, కాఫీ తాగి ఉరకలు వేస్తూన్న ఉత్సాహంతో ఇద్దరూ బయలుదేరేరు.

దారి పొడుగునా ఉన్న తెల్లటి బాణం గుర్తులు చూసుకుంటూ వెళితే రెండు గంటలలో ఒక “నది ” కనిపిస్తుందనీ, దారిలో ఎన్ని పక్క పెత్తనాలు చేసినా, నది వరకు వెళ్ళి తిరిగి రావడం అనేది నాలుగైదు గంటలలో తెమిలిపోయే పని అనీ, ఎంత ఆలస్యం అయినా లంచి వేళకి తిరిగి హాస్టల్‌కి వచ్చెయ్య వచ్చనీ హాస్టల్‌ సిబ్బంది చెప్పి పంపేరు. రాజుకీ, ఏంబరుకీ వచ్చిన పోర్చుగీసు భాష అంతంత మాత్రమే. ఆ మాట కొస్తే హాస్టల్‌ సిబ్బందికి వచ్చిన ఇంగ్లీషే నయం. వారి ఉద్దేశం ఏమిటో గాని వీరికి మాత్రం వారన్న మాట “నది ” అనే అర్ధంలోనే అర్ధం అయింది.  కబుర్లు చెప్పుకుంటూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇరువురూ దరిదాపు రెండు, మూడు గంటల సేపు ఆ అడవిలో నడిచేరు. పోను, పోను అడవి చిక్కబడి అందాలు చిందుతోంది. కాని ఎంత దూరం నడచినా ఎక్కడా “నది ” కనిపించలేదు.

దూరాలు సంస్కృతిని బట్టి ఉంటాయి. అమెరికాలో రెండు గంటల దూరం అంటే ఏ వంద మైళ్ళో అయి ఉంటుంది. ఒక సారి ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ నుండి ఏదో బట్టల షాపుకి తీసుకెళ్ళమంది నా శ్రీమతి. అక్కడ ఎవ్వరిని అడిగినా అది “వాకింగ్‌ డిస్టెన్స్‌” అన్నారు కదా అని ఇద్దరం నడవడం మొదలు పెట్టేం. ఆ షాపు ఎప్పటికీ రాదు! ఆఖరికి కాళ్ళు నొప్పులు పెడుతూ ఉంటే ఆటో చేయించుకుని వెళ్ళేం. అది “వాకింగ్‌ డిస్టెన్స్‌” ఎలా అవుతుందని దరిమిలా వాకబు చేస్తే అది ఢిల్లీలో నడవగలిగే దూరమే అని ఆ షాపులో అంతా ఏకగ్రీవంగా తీర్మానించేరు. అలాగే బ్రెజీల్‌ లో “రెండు గంటల దూరం” అంటే అమెరికాలో దూరం కంటె దూరం కాదు కదా అని ఇద్దరికీ అనుమానం వచ్చింది. కాని ఆ అనుమానం తీర్చడానికి ఆ అడవిలో వీరిద్దరూ తప్ప మరొక నరమానవుడు లేడు. మరికొంత దూరం నడిచేరు, నది కనిపిస్తుందేమో అన్న ఆశతో. వీళ్ళ కబుర్లలో బాణం గుర్తులని  చూడడం ఎప్పుడో మరచి పోయేరు. ఇప్పుడు బాణం గుర్తులు లేవు. అనుకున్న రెండు గంటలూ రెండు గంటల క్రిందటే తెమిలి పోయాయి.

“వాళ్ళు “నది ” అన్నది నది కాదేమో” అన్నాది ఏంబరు.

“నది కాకపోతే కనీసం కాలువో, ఏరో, ఏ నీటి ప్రవాహమో కనిపించాలి కదా? మనకి ఏదీ కనిపించ లేదు.”

“కనిపించకపోవడం ఏమిటి? మనం మోకాలు బంటి నీటి లోంచి నడుచుకుంటూ వచ్చేము కదా!”

“అది పల్లంలో నిలకడగా ఉన్న నీరే కదా! అందులో నా అంత పొడుగు గడ్డి దుబ్బులు కూడా కనిపించేయి. అది నది ఎలా అవుతుంది?”

“ఈ అడవిలో నిలకడ నీరు చాల చోట్ల కనిపించింది. ఎక్కడ చూసినా నీటి గుంటలే. మనం గంట కిందట దాటిన మోకాటి లోతులో ఉన్న నిలకడ నీరే నదేమో? ఆ తర్వాత దారి అంతా పొడిగానే ఉంది కదా?”

ఇక ముందుకి వెళ్ళి లాభం లేదని ఇద్దరూ వెనక్కి తిరిగేరు. నడి సముద్రం లోనికి ఈదుకు వెళ్ళి ఒడ్డెక్కడుందో అని వెనక్కి తిరిగితే ఏమిటి కనబడుతుంది? ఉత్తుంగ తరంగ భీకరమైన మహా సముద్రం కనుచూపు మేర కనిపిస్తుంది! అలాగే ఆకుపచ్చటి అఖాతంలా ఎదురుగా అమెజాన్‌ వర్షారణ్యం వికటాట్టహాసం చేస్తూ కనబడింది! వారు ఏ దారి వెంబడి అక్కడవరకు వచ్చేరో అది కూడా మూసుకుపోయి ఎటు చూసినా పెట్టని గోడలా ఆకాశాన్ని అంటే చెట్లే! వారు వచ్చిన పాద ముద్రల కోసం వెతికేరు. ఫలితం శూన్యం. తెల్లటి బాణం గుర్తుల కోసం వెతికేరు. అవీ కనబడ లేదు. ఏ దిక్కు నుండి వచ్చేరో తెలియని దిక్కు లేని వారైపోయారు, ఇద్దరూ!

రాజ్‌ దిక్సూచి వైపు చూసేడు. ఇంతవరకూ ఉరమరగా వాళ్ళు వాయువ్య దిశలో వచ్చేరని అతనికి గట్టి నమ్మకం. కనుక ఇప్పుడు ఆగ్నేయ దిశలో వెళితే తిరుగుదారి అవుతుందని తీర్మానించేడు. కాని తిన్నటి రోడ్డు మీద ప్రయాణం చేసినట్లు ఈ అడవిలో ఎలా కుదురుతుంది? ఒకోసారి కుడి పక్కకి, ఒకోసారి ఎడం పక్కకి, ఒకోసారి వెనక్కి నడుచుకుంటూ పోయేసరికి దృగ్విన్యాసం పూర్తిగా నశించి పోవడంతో చీకటిలో తందనాలాడినట్లు యాతన పడ్డారు. “ఎవరక్కడ? మేం దారి తప్పిపోయేం, సహాయం చెయ్యండి!” అని ఎలుగెత్తి అరచేడు, రాజ్‌. అది అరణ్య రోదనే అయింది. ఏంబర్‌ వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విజ్ఞత ఉన్న వ్యక్తి కాబట్టి, “రాజ్‌! మనం ఈ రాత్రికి ఈ అడవిలోనే ఎక్కడో తల దాచుకుని రేపు వేకువ జామున లేచి మళ్ళా ప్రయత్నం చేద్దాం” అని సలహా ఇచ్చింది .

ఇద్దరూ తాటి కొబ్బరి వంటి తాళవృక్షాల మట్టలు కొన్ని సంపాదించేరు. ఆరేసి అడుగులు పొడుగున్న ఆ మట్టలని ఒక చట్టు కింద నేల మీద పరుపులా పరచేరు. మరి కొన్ని మట్టలని ఒంటిదూలం ఇంటి కప్పులా అమర్చేరు. రాతి యుగపు మానవుడు నిర్మించిన పర్ణశాల కూడ ఇంతకంటె మెరుగ్గా ఉండేదేమో. ఇద్దరికీ అనుభవం లేదు. వీరి వద్ద ఉపకరణాలు ఏమీ లేవు. ప్రయోగాలు చెయ్యడానికి వ్యవధి లేదు. చీకటి పడే లోగా చిన్న గుడిసె లాంటి కుటీరం అమర్చి అందులో తల దాచుకోవాలని వారి తాపత్రయం.

చీకటి పడింది. ఎక్కడి నుండి వచ్చేయో నీలాల మేఘమాలలా తండోపతండాలుగా దిగి వచ్చేయి దోమలు! కర్తవ్యం ఆలోచించే లోగా ఆ దోమలు వీళ్ళ శరీరాలని కుళ్ళబొడిచేసేయి. పల్చటి పై దుస్తులు ఆ దోమల ధాటి నుండి లేశమాత్రం రక్షణ కల్పించలేకపోయాయి. తాటి మట్టలతో వాటిని ఎంత పారద్రోలినా సముద్రపు కెరటాలని ఇసక గోడతో ఆపడానికి ప్రయత్నించినట్లే అయింది. రేపటి వరకు బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చన్న తర్కంతో తెచ్చుకున్న దోమలమందంతా ఇద్దరూ చెరి సగం పంచుకుని ఒళ్ళకి పట్టించుకున్నారు. అయినా దోమల ఉధృతం తగ్గ లేదు. ఇంక సభ్యతకీ, ఆలోచనకీ అవకాశం లేదు. ఇద్దరూ వారు నిర్మించుకున్న తాటికమ్మ గుడిసెలోకి దూరి ఆకులు మీద కప్పుకున్నారు. గుడిసె లోపల జాగా గట్టిగా దోసెడంత లేదు. చీకటి పడడంతో బయట తిరుగాడే వన్య మృగాల ధ్వనులు దూరంలో వినిపిస్తున్నాయి. ఇద్దరూ అలసి సొలసి ఉన్నారు. చీకటి, దోమలు, ధ్వనులు, చలి. ఇక ప్రత్యామ్నాయం లేకపోగా, అసంకల్పితంగా, ఒకరి పరిష్వంగంలో మరొకరు ఇరుక్కుని బితుకు బితుకు మంటూ పడుక్కున్నారు.

“ఈ వేళప్పుడు ఇంటి దగ్గర ఉండి ఉంటే బీరు తాగి, భోజనాలు చేసి కబుర్లు చెప్పుకునే సమయం” అన్నాడు రాజ్‌.

“ఇప్పుడేమి వచ్చింది? బీరు లేదు. భోజనం లేదు. కాని మన “బేక్‌పేక్‌” లో చిరుతిండి పొట్లాలు ఇంకా ఉన్నాయి. వాటిల్లో ఒకటి చెరిసగం పంచుకు తిందాం” అంటూ ఏంబరు ఒక “కేండీ బార్‌” ని తీసింది. ఆ ఒక్క దాన్నీ ఇద్దరూ పంచుకు తిన్నారు. తెచ్చుకున్న నీళ్ళు అప్పటికే చాలమట్ట్టుకు తాగేసేరేమో, ఉన్న నీళ్ళనే కొద్దిగా తాగి మర్నాటికి కొంత దాచుకున్నారు.

రాజుకీ ఏంబరుకీ మధ్య తొలి పరిచయం దరిదాపు ఏడాది కిందటే జరిగింది. అది కూడా కేవలం కాకతాళీయంగా జరిగింది. రాజ్‌ పని చేసే విశ్వవిద్యాలయపు ప్రాంగణంలో ఒక వృక్షవాటిక ఉంది. నిజానికి ఒక వృక్షవాటికలో విద్యాలయపు భవనాలున్నాయనడం సమంజసమేమో. ఎందుకంటే ఈ వృక్షవాటిక ఏదో వారసరిగా ఒక మూలకి విసిరేసినట్లు కాకుండా, పాఠశాల ప్రాంగణాన్ని ఆనుకుని పారుతూన్న చిన్న పిల్ల నది గట్టు వెంబడే మెలికలు తిరుగుతూ వ్యాపించి ఉంది. ఆ పిల్ల నదిలో నీళ్ళు పెళ్ళివారిలా పిల్లినడకలు నడుచుకుంటూ చిన్న తటాకంలో చేరిన బాతులతో జలకాలాడి, నెమ్మదిగా డెల్టా లోని మరొక పాయలో కలసి పోయేవి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ వృక్షవాటికలో తిరగడానికి వెళ్ళేవాడు రాజ్‌.

చెట్ల మధ్య తిరగడం అంటే రాజ్‌ కి చిన్నప్పటి నుండీ సరదా. చెట్ల నీడలలోని గాలిలో ఆమ్లజని పాలు ఎక్కువ వుంటుందనిన్నీ, అందుకని చెట్టు కిందకి వెళ్ళగానే మనస్సులో ఒక రకం ఉత్తేజం పుడుతుంది అనిన్నీ, అందుకే బుద్ధుడి వంటి మహర్షికి చెట్టు కింద కూర్చున్నప్పుడే జ్ఞానోదయం అయిందనిన్నీ అనేవాడు. చెప్పొచ్చేదేమిటంటే రాజ్‌ కి చెట్లంటే చచ్చేంత ఇష్టం. ఏ వూరు వెళ్ళినా బొటానికల్‌ గార్డెన్‌ అనీ, ఆర్బొరీటం అనీ, ట్రాపికల్‌ జంగిల్‌ అనీ ఏ పేరుతో కనిపించినా చెట్లని చూసి, పరామర్శ చేసి వచ్చేవాడు. అలాంటిది సొంత యూనివర్శిటీ కేంపస్‌లో ఉన్న ఆర్బొరీటం ని అనుభవించకుండా ఎలా ఉండ గలడు? ఆర్బొరీటం అనగానే ప్రతి చెట్టు దగ్గరా దాని పేరు, దాని జాతి, ఉప జాతి, స్వస్థలం, మొదలైన వివరాలు చిన్న రేకు మీద రాసి పెట్టి, దానిని చెట్టు కొమ్మకి వేలాడదీసి ఉంచుతారు. వెళ్ళినప్పుడల్లా ఈ వివరాలు చిన్న పుస్తకంలో రాసుకుంటూ ఉండే వాడు.

కళాశాలలో ఒక కొస నుండి మరొక కొసకి వెళ్ళడానికి అడ్డు దారి ఈ వృక్షవాటిక గుండా ఉంది కనుక అక్కడ జన సంచారం ఉండేది; కాకపోతే, కొంచెం పలచగా ఉండేది. పరిచయం ఉన్నా లేకపోయినా ఎదుట తారసపడ్డ వ్యక్తిని పలు విధాల పలకరింపులలో ఏదో ఒక విధంగా పలకరించడం ఇక్కడ ఆచారాలలో ఒకటి. కనుక ఎదుట పడ్డ వ్యక్తితో యాత్రికంగా “హాయ్‌” అన్నంత మాత్రాన్న అదేమీ స్నేహం అనిపించుకోదు. కాని ఆ రోజు రాజు చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకుని, వాలులో నిలబడి, చెట్లతో ఏవో సరసోక్తులాడుకూంటూ మరో లోకంలో ఉన్న తరుణంలో ఒక అపరచితమైన గొంతుక వెనక నుండి “హాయ్‌!” అని పలకరించింది, “ఐ సీ యు హియర్‌ ఎవ్విరి నౌ ఎండ్‌ దెన్‌. ఆర్‌ యు డూయింగ్‌ సం రిసెర్చ్‌?”

అప్పటికే చెట్ల లోకంలో తప్ప ఈ లోకంలో లేడేమో, అనుకోకుండా వెనక నుండి ఈ ప్రశ్న వచ్చేసరికి రాజు తుళ్ళిపడ్డాడేమో కాలు పట్టు తప్పగా కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు.

“డిడ్‌ ఐ స్టార్ట్‌ల్‌ యు? ఐ యాం సారీ!”

రాజ్‌ తేరుకుని ఎదురుగా ఉన్న వ్యక్తిని పరకాయించి చూసేడు. ఇంతకు పూర్వం ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

“ఐ యాం ద క్యూరేటర్‌ అఫ్‌ దిస్‌ ఆర్బొరీటం. మై నేం ఈజ్‌ ఏంబర్‌” అంటూ గట్టు మీద నుంచి దిగువనున్న రాజ్‌ వైపు చెయ్యి చాచింది, ఆమె.

వాలులో దిగువ నిలబడి ఉన్న రాజ్‌ పైనుండి ఏంబర్‌ అందించిన చెయ్యి పట్టుకుని, “హ్వాట్‌ ఎన్‌ ఎప్రోప్రియేట్‌ నేమ్‌ ఫర్‌ ఎ క్యూరేటర్‌ అఫ్‌ ఎన్‌ ఆర్బొరీటం” అంటూ గట్టెక్కి, “ఐ యామ్‌ రాజ్‌” అని పరిచయం చేసుకున్నాడు.

“హ్వాట్‌ ఎన్‌ ఎప్రోప్రియేట్‌ నేమ్‌” అని ఎందుకు అన్నాడో తన పేరుకీ తను చేసే ఉద్యోగానికీ ఉన్న బాదరాయణ సంబంధమేమిటో తనకి అర్ధం కాలేదంది, ఏంబర్‌.

“ఏంబర్‌ అనేది వజ్రాలనీ, రత్నాలనీ మించిన విలువ గల తృణస్ఫటికం. ఏ జురాసిక్‌ యుగంలోనో చెట్ల నుండి స్రవించిన జిగురు పాలు గడ్డ కట్టి శిలాజములుగా మారి ఇప్పుడు మనకి అపురూపంగా పారభాసకమైన స్ఫటికాల రూపంలో అక్కడక్కడ దొరుకుతున్నాయి. కనుక ఏంబర్‌ అనేది చెట్లు మనకి ప్రసాదించిన రత్నం. కనుక “యు ఆర్‌ ఎ జ్యూయల్‌. ఎ గిఫ్ట్‌ అఫ్‌ ద ట్రీస్‌ ” అని ఏంబర్‌ తో చెప్పేడు రాజ్‌. అప్పటి నుండి రాజు కుశాగ్ర బుద్ధి యెడల ఏంబరు మనోఫలకంపై మంచి భావముద్రే పడ్డట్టు ఉంది.

తన వంతుగా ఏంబర్‌ ఆ ఆర్బొరీటం చరిత్ర కొంత చెప్పుకొచ్చింది. ఈ కబుర్ల లోకం నుండి బయట పడే సరికి ఇద్దరూ ఏంబర్‌ పనిచేసే ఆఫీసు దగ్గరకి నడచి వచ్చేసేరు.

రాజ్‌ సెలవు తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఆఫీసు లోపలికి తీసుకెళ్ళి రాజుని నలుగురికీ పరిచయం చేసి, ప్రతి వారం వారి ఆఫీసులో జరిగే సదస్సులకి రమ్మని ఆహ్వానించింది.

ఇదంతా జరిగి రెండు వారాలు అయింది. ఎవరి పనులలో వారు పడిపోయేరు. వీలున్నప్పుడల్లా రాజ్‌ లంచి పట్టుకుని వెళ్ళి ఆర్బరీటంలో కూర్చుని తినే వాడు. అక్కడకి వెళ్ళినప్పుడల్లా ఏంబర్‌ గుర్తుకు వచ్చేది. వారి ఆఫీసులో జరిగే సదస్సులకి రమ్మనమని ఆమె అన్నా ఏదో మాటవరసకి అన్న మాటే అయ్యుంటుంది అని సర్ది చెప్పుకున్నాడు. తను కంప్యూటరు వాడు. చెట్లంటే అభిమానం ఉండొచ్చు గాక. కాని చెట్ల పెంపకం, వాటిని గురించిన విజ్ఞానం తనకి ఏముంటుందని? ఇలా సంజాయిషీ చెప్పుకుని అలసత్వంతో అటువైపు వెళ్ళనే లేదు.

రాజ్‌ బెంచీ మీద కూర్చుని లంచి తినే సమయంలో ఏంబర్‌ మళ్ళా ఆ ఆర్బరీటంలో తారస పడింది. బెంచీ మీద రాజ్‌ పక్కన పరిచయస్తురాలిలా కూర్చుని పిచ్చాపాటి మొదలు పెట్టింది. మాటల సందర్భంలో వారి సదస్సులకి రమ్మని మరొకసారి పిలిచింది.

ఇదీ రాజు, ఏంబరు కలుసుకున్న వైనం. పరిచయం క్రమేపీ శేముష్య స్నేహంగా పరిణమించింది. ఇలా పెన వేసుకుంటూన్న శేముష్య స్నేహాన్ని పురస్కరించుకుని ప్రపంచంలో సతతహరితాలైన అడవులు ఎలా నాశనం అయిపోతున్నాయో, వాటిని పరిరక్షించడానికి చెయ్యవలసిన కృషి ఏమిటో చర్చించుకునే వారు. ఆర్బరీటం సదస్సులకి వీలయినప్పుడల్లా వెళ్ళేవాడు, రాజ్‌. ప్రపంచం నలు మూలలనుండీ వచ్చి ప్రసంగాలు చేసే అతిథులని సదస్సు అయిన తర్వాత తన ఇంటికి రమ్మని పిలచేది, ఏంబర్‌. అక్కడ అందరూ ఒకటో, రెండో కాక్‌టెయిల్స్‌ తాగి ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళిపోవడం ఒక రివాజుగా జరిగే పని.

ఒక సారి దక్షిణ అమెరికా నుండి ఒక ఆచార్యుడు వచ్చిన సందర్భం. ఆయన అమెజాన్‌ నదీ లోయలో ఉన్న అరణ్యాల అంద చందాలని సినిమా తీసి చూపించేడు. ఆ రోజు అతిథులు పాన పాత్రలు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత, రాజుకి మరొక కాక్‌టెయిల్‌ ఇచ్చి మరి కొంత సేపు కూర్చో మంది ఏంబర్‌. అడవిలో కాసిన ఉసిరికాయ ఎక్కడ? సముద్రంలో పండిన ఉప్పు ఎక్కడ? అలా వీరిరువురి మధ్య శృంగార చింత చెంతన లేకుండానే, శుద్ధ శేముష్య భావంతోనే, స్నేహం దినదినాభివృద్ధి చెందింది. ఒకరి సహచర్యం మరొకరు ఆనందించేవారు.

“దక్షిణ అమెరికాలో అమెజాన్‌ పరీవాహంలో ఉన్న అడవులు నిజానికి ఒక పేద్ద ఆర్బొరీటం లాంటివి. ఇక్కడ చెట్లు నాటి, పెంచి పెద్ద చేస్తాం. అక్కడ సహజసిద్ధంగా పెరుగుతాయి. అంతే తేడా.”

“ఇక్కడ మన ఆర్బొరీటంలో బాతులు, ఉడతలుతో సరి. అక్కడ కోతులు, కొండ చిలువలు, పులులు,..”

“ఏంబర్‌ నువ్వు ఎప్పుడైనా అమెజాన్‌ అరణ్యాలు చూసేవా?”

“లేదు. ఆ సినిమా చూసిన తర్వాత చూడాలనే ఉంది. అవకాశం రావాలిగా.”

“అవకాశాలు స్వయంచోదితాలు కావు. వాటికి కాళ్ళూ చేతులూ లేవు. వాటిని మనమే కల్పించుకుని కథని నడిపించాలి.”

“రాజ్‌! నీకు వచ్చే ధైర్యం ఉందా?”

“నీతో వచ్చే ధైర్యమా? అమెజాన్‌ అడవులలో తిరిగే ధైర్యమా?”

“నాతో వస్తే నేనేమైనా కరుస్తానా ఏమిటి? అక్కడ అడవులలో ఏకాంతంగా తిరగ గలిగే ధైర్యం ఉండాలి మరి!”

“నువ్వు పక్కన ఉంటే అది ఏకాంతం ఎలా అవుతుంది?”

ఇలా మొదలైంది ఈ అమెజాన్‌ యాత్ర! ఇప్పుడు, ఇక్కడ, ఈ నిర్మానుష్యమైన అడవి మధ్యలో, భూమంత పరుపు మీద, ఆకాశమంత పందిరి కింద, రేపు ఏమవుతుందనే ప్రశ్నకి సమాధానం తెలియని అయోమయ పరిస్థితిలో, ఒకరి గుండె చప్పుడుని మరొకరు వింటూ ఆ రాత్రి గడిపే పరిస్థితిలోకి తీసుకు వచ్చింది!!

అర్ధరాత్రి అయ్యుంటుంది. తూర్పు దిశ నుండి మోటారు లాంచీ చప్పుడు వినిపించింది. దానిని బట్టి తూర్పు దిశలో ఏదో నది ఉండి ఉంటుందని తీర్మానించుకున్నారు. కాని వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అడవులలో శబ్దం ఎటునుండి వచ్చిందో చెప్పడం కష్టం. శబ్ద తరంగాలు చెట్ల మానులని తాకి, ప్రతిధ్వనించి, అవి మరొక దిశ నుండి వచ్చినట్లు మనని మభ్య పెడతాయి.

బుధవారం ఉదయం అరణ్యపు అంతరాళాలలోకి ఇంకా పూర్తిగా వెలుగు చొరబడక ముందే రాజు, ఏంబరు లేచేరు. తెచ్చుకున్న సరంజామాలో ఉడికించిన పండ్ల పూర్ణంతో ముడిచిన రొట్టె ముక్కని ఇద్దరూ చెరొకటీ తిన్నారు. సీసాలలో తెచ్చుకున్న నీళ్లు ఖర్చు అయిపోయాయి కనుక సంచిలో ఉన్న నీళ్ళని కొద్ది కొద్దిగా తాగేరు. తాగి, తూర్పు దిశగా ఉన్న నది వైపు బయలుదేరేరు. ఇహ ఎంత సేపు! నది కనబడితే అక్కడనుండి హాస్టలు కూత వేటు దూరం. “బ్రెక్‌ఫెస్ట్‌” వేళకల్లా హాస్టల్‌ లో ఉండొచ్చని ఇద్దరూ కొండంత ధైర్యంతో ఉన్నారు. మధ్యాన్నం అయింది. ఎండ జోరు పుంజుకుంది. సంచీలో నీళ్ళు ఇద్దరూ తాగేసేరు. కాని నది జాడ లేదు. గొంతుక పిడచ కట్టుకు పోతోంది. నీళ్ళు తాగకపోతే శరీరం ఎండి పోతుంది. అది ప్రాణాపాయం. పక్కన ఉన్న పిల్ల కాలవలో నీళ్ళు ఉన్నాయి. కాని చూడడానికి మంచి నీళ్ళల్లా లేవు. ఏదో నాచు వంటి పదార్ధం పైన తేలియాడుతోంది. వడబోసి తాగొచ్చేమో! వడబొయ్యడం ఎలా? ఏంబరు ఖాళీ నీళ్ళ సీసా అడుగు భాగాన్ని కత్తితో కోసింది. తన జాకెట్టు విప్పి లోపల ఉన్న “బ్రా” ని బయటకి తీసింది. ఆ బ్రా కప్పుని గరాటులా వాడి, నది నీళ్ళని ఆ గరాటులో పోసి, వడబోసి రెండో సీసా, నీటి సంచి నింపింది. ఆ నీళ్ళల్లో ఏ సూక్ష్మజీవులు ఉన్నాయో తెలియదు కాని, రుచికి మాత్రం సుద్ద నీళ్ళల్లా వెగటుగా ఉన్నాయి. వాటినే ఇద్దరూ తాగేరు, ప్రాణం నిలబెట్టుకొనేందుకు. ఏ వాంతులో విరేచనాలో పట్టుకుంటే ఆ అడవిలో హరీ మనిపోవడమేనని కలవరపడ్డారు. ఇద్దరూ పరి పరి విధాల భయ పడుతున్నారు. వేడి, ఉక్క, ఆకలి, నిద్ర లేమి, ఆందోళన ఇవన్నీ భయానికి కారణాలే. ఇవే కాకుండా రాజ్‌ కి తెలియని విషయం మరొకటి ఉంది. ఏంబర్‌ అప్పుడప్పుడు “డిప్రెషన్‌” లోకి దిగజారుకుంటుంది. ఒత్తిడి ఎక్కువైతే అది ప్రకోపించే ప్రమాదం ఉంది. దానిని అదుపులో పెట్టడానికి వాడే మందు హాస్టల్‌లో వదిలేసి వచ్చింది. కరవులో అధిక మాసంలా ఆ డిప్రెషన్‌ ఇప్పుడు ప్రకోపించిందంటే చెయ్యగలిగింది ఏమీ లేదు.

అగమ్యగోచరంగా ఆ అడవిలో తిరిగి తిరిగి ఒక బాడవ ప్రదేశాన్ని చేరుకున్నారు.  చిత్తడి నేల. వెతకగా వెతకగా కొంచెం పొడిగా ఉన్న మెరక ప్రదేశం ఒకటి కనిపించింది. అక్కడ కూడ తాటి మట్టల లాంటి మట్టలు దొరికేయి. తన దగ్గర ఉన్న చాకుతో వాటిని కోసి, గత రాత్రి అనుభవాన్ని పురస్కరించుకుని మరొక కుటీరం నిర్మించేడు, రాజ్‌. దోమల బాధ తప్పేది కాదని అనుభవం వల్ల తెలుసుకున్నారేమో, అక్కడ పుష్కలంగా దొరుకుతూన్న బెందడిలో నీళ్ళు కలపి, బురదని చేసి ఆ బురదని ఒళ్ళంతా ముఖం, కాళ్ళూ, చేతులు దట్టంగా పులుముకున్నారు. ఆకులు కప్పుకుని గుడిసెలో కూర్చున్నారు. హోరుమని లంకించుకున్న వర్షపు జోరునైనా ఆపగలిగింది కాని ఆ గుడిసె దోమల దండయాత్రని ఆపలేకపోయింది. ఎండి బీటలు వేస్తూన్న బురద తెరని తోసుకుని లోపలికి వెళ్ళి మరీ కుట్టడం మొదలు పెట్టేయి. ఇంతింత పెద్దవి, లోపల కండని కరచి పీక్కు తినేవి దోమలు ఎలా అవుతాయి? ఏ చిన్న సైజు రాబందులో అయ్యుంటాయి! భీతమనస్కులైన ఇరువురూ ఒకరినొకరు రక్షణగా ఆదుకుని ఒకరి ఒడిలో మరొకరు తలవాల్చి దఫ దఫాలుగా నిద్రపోయారు.

మూడవ రోజు. గురువారం. ఒక గ్రనోలా బార్‌ని మధ్యకి విరచి చెరి సగం తిన్నారు. ఉన్న నీటిని తాగేసి, మళ్ళా కాలువలో నీటిని పట్టి, బ్రాతో వడబోసి సీసాని, సంచీని నింపేరు. ఆగ్నేయ దిశలో వెళితే గమ్యం చేరుకోవచ్చనే నమ్మకం రాజులో చాల బలంగా ఉంది. అందుకని దిక్సూచిని సంప్రదించి ఆగ్నేయ దిశలో ప్రయాణం మొదలు పెట్టేరు. అంత దట్టంగా ఉన్న అడవిలో ఒకరి పక్క ఒకరు నడవడానికి కూడ జాగా లేదు. ఒకరి వెనుక ఒకరు. దండకారణ్యంలో రాముడి వెనక సీతలా రాజు ముందు, ఏంబరు వెనక. ముండ్ల చెట్ల కొమ్మలని వంచి రాజు పట్టుకుంటే ఆ సందులలో ఇరుక్కుని ఏంబరు నడుస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇద్దరి శరీరాలూ ముండ్లతో గీరుకు పోయి, రక్తం చిమ్ముతున్నాయి. పైపెచ్చు ఆ చెట్లలో ఉండే పులి చీమలు మీద నుండి వీరి మీద రాలి, బట్టలలో దూరి కరిచేస్తున్నాయ్‌!

ఈ నరకంలోంచి బయట పడే సరికి ఏంబర్‌ పూర్తిగా దిగజారి పోయింది. ఆకలి. నీరసం. చీమకాట్ల తోటీ, దోమ కాట్ల తోటీ ఆమె వక్షోజాలు ఎర్రటి దద్దుర్లతో నిండి వాచి పోయాయి. వాటి మీద బట్ట నిలప లేక పోతోంది ఆమె. ఇంకా సిగ్గేమిటని కొంతవరకూ ఉపశమనం దొరుకుతుందనే ఆశతో ఆమె పై బట్టలన్నీ తీసేసింది. రాజ్‌ కి ఏమీ పాలు పోలేదు. తన బనీను విప్పి, నీటిలో తడిపి ఆమె శరీరం అంతా ఉన్న దోమ కాట్లనీ చీమ కాట్లనీ ఆ గుడ్డతో నెమ్మదిగా తుడిచేడు. సాయం సంధ్య చుట్టూ పులుముకుంటోంది. మళ్ళా దోమల బాధ తప్పదు. కనుక ఆ చుట్టుపట్ల ఉన్న మట్టిని ఏంబరు శరీరం అంతా పులిమి, తన శరీరం మీద పులుముకున్నాడు. ఈ జంబాల లేపనం దోమలని ఏమాత్రం అడ్డడం లేదని రాజ్‌కి తెలుసు. కాని తనకి తెలిసిన మంత్రం అదొక్కటే.

రాత్రయింది. దోమలు మళ్ళా భీభత్సం చేసేయి. పులి మీద పుట్రలా పెద్దగా వర్షం పడడం మొదలయింది. ఆ వర్షంలో దోమల “మందు ” కొట్టుకు పోయింది. ఏదో గుడ్డిలో మెల్లలా దోమలు కూడా పోయాయి. అర్ధ నగ్నంగా ఉన్న ఏంబరు గజ గజ వణకిపోతోంది. చలి కొంత కారణం. భయం కొంత కారణం. నిరాశ, నిస్పృహ అన్నిటి కంటె పెద్ద కారణాలు. రాజ్‌ ఆమెని హృదయానికి హత్తుకుని, తన శరీరపు వేడితో ఆమె శరీరానికి వెచ్చదనం చేకూర్చాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.

నైలీ క్విరోజ్‌ మొల్డనాడో ముగ్గురు పిల్లల తల్లి. అడవిలో ఉన్న హాస్టల్‌ ఈమె ఆధ్వర్యంలో నడుస్తుంది. మంగళవారం లంచికి తిరిగి రావలసిన వ్యక్తులు సాయంకాలమైనా రాక పోయేసరికి ఆమె కంగారు పడి వీళ్ళని వెతికి తీసుకురమ్మని సిబ్బందిలో ఇద్దరిని పంపించింది. బుధవారం నాటికి ఇద్దరు పదిమంది అయేరు. గురువారం పది పాతిక అయేరు. శుక్రవారం నాటికి పొరుగున రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనావుస్‌ నుండి వచ్చిన వాళ్ళతో వెరసి ఏభై మంది అయేరు. అడవిని గాలించడం మొదలు పెట్టేరు. మనావుస్‌ నుండి ఎవరో బ్రెజీలియాలో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయానికి ఫోను చేసి చెప్పేరు. శుక్రవారం నాడు అమెరికన్‌ ఎంబసీ నుండి రాజ్‌ పని చేస్తూన్న డిపార్టుమెంటుకి ఫోను వచ్చింది. అప్పుడు వారు అడవిలో తప్పడిపోయిన రాజుని, ఏంబర్ని వెతికే నిమిత్తం విమానానికి అయే ఖర్చు భరిస్తామని క్రెడిట్‌ కార్డుతో సహా హామీ ఇచ్చేరు.

రాత్రల్లా తెరలు తెరలుగా వాన పడుతూనే ఉంది. వాన వెలిసే సరికి దూరంగా చెట్ల సందులలోంచి సూర్యరశ్మి నేలని తాకుతోంది. ఇద్దరూ ఆ ఎండ పొడలోకి చేరుకున్నారు. రాజుకి ఒంటిమీద చొక్కా లేదు. తన కోసం రాజ్‌ చేసిన త్యాగం ప్రత్యక్ష సాక్ష్యంగా ఏంబర్‌కి కనిపించింది అప్పుడు రాజ్‌ వీపు మీద! ఆ వీపంతా ఎర్రటి మాంసపు ముద్దే! రాజ్‌ తన శరీరాన్ని ఏంబర్‌ శరీరానికి అడ్డు పెట్టి దోమల బారి నుండి కొంత వరకు రక్షించి ఉండక పోతే ఏంబరు శరీరం కూడ ఒక మాంసపు ముద్ద అయి ఉండేది. ఇప్పుడంటే ఎర్రటి దద్దుర్లుతో సరిపోయింది. ఏంబర్‌ మనస్సంతా నిరాశావృతం అయిపోయింది.

“మరొక రోజు. మరొక ప్రయత్నం” అన్నాడు రాజ్‌, “కంఠంలో ప్రాణం ఉండగా ప్రాణం మీద ఆశని ఎలా వదలులుకుంటాం? ప్రాణం కంటె తీపి మరొకటి లేదుగా!”

ప్రత్యామ్నాయం లేక ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇద్దరూ నడక మొదలు పెట్టేరు. ఇంతలో చెట్ల ఆకుల మధ్య గలగలారావం వినిపించింది. ఇద్దరూ మెడ పైకి రిక్కించి చూసేరు. చెట్ల మీద, సుమారు డెబ్భై అడుగుల ఎత్తున, నల్లమూతి కోతులు కొమ్మచ్చిలు ఆడుకుంటూ దిగువనున్న వింత “జంతువుల “ని చూసి కిలకిలారావం చేస్తున్నాయ్‌! ఏంబర్‌కి అనుభవం మీద తెలుసు. ఈ రకం కోతులు అరణ్యపు అంతరాళాల్లో తప్ప జనావాసాల సమీపాలలో ఉండవని! అంటే రాజూ, ఏంబరూ దారీ తెన్నూ తెలియకుండా అడవి మధ్యలోకి వెళ్ళిపోతున్నారన్నమాట!

శనివారం తెల్లవారింది. ఇది ఐదవ రోజు. వాళ్ళ దగ్గర ఉన్న ఆఖరి గ్రనోలా బార్‌ పంచుకు తింటూ ఉండగా దూరాన్న మోటరు బోటు శబ్దం వినిపించింది. వినిపించిందే తడవుగా ఇద్దరూ ఆ శబ్దం వచ్చిన దిశలో “బతికిపోయాం భగవంతుడా!” అనుకుంటూ పరుగు లంకించుకున్నారు. పొదలు దాటి ఇసక పర్ర మీదకి వచ్చి పడ్డారు. మళ్ళా ఆ పైన అంతులేని అరణ్యమే. పడవా లేదు. నదీ లేదు. మోటరు బోటు శబ్దం అంతకంటే లేదు. పక్షుల కిలకిలారావం తప్ప.

ఈ పరుగులో ఏంబర్‌ పాదాల మీద ఏర్పడ్డ నీటి పొక్కుల లాంటి దద్దుర్లు పగిలి పోయాయి. అవి “ఇన్‌ఫెక్ట్‌” అయే ప్రమాదం ఉంది. ఆమె అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. కనిపించిన ఆకులని పాదాలకి, కాలి పిక్కలకి చుట్టబెట్టి తీగలతో కట్టు కట్టింది నొప్పి తగ్గుతుందనే భ్రమతో. మెక్కుతూ అడుగులు వేస్తోంది.

ఏంబర్‌లో ధైర్యం క్రమేపీ దిగజారిపోవడం రాజ్‌ గమనించేడు. ఆమె శరీరం వాడిపోయిన తోటకూర కాడలా వేలాడిపోతోంది. మనస్సుని ఏకాగ్రతతో నిలపలేక పోతోంది. తనూ అంత కంటె ఏమీ మెరుగైన పరిస్థితిలో లేడు. ఎంత దుర్దశ వచ్చినా నిరాశ పడిపోకుండా విధిని ఎదుర్కోవడమే మానవ కర్తవ్యం అని అతని నమ్మకం.

“ఏంబర్‌! దిగాలు పడిపోకు. ఈ ఒక్క రోజూ, నా కోసం బతుకు” అని ఆమెని బతిమాలుకున్నాడు. నొప్పులతో పాదాలు బరువెక్కి పోయాయి. అడుగు తీస్తే అడుగు పడడం లేదు. ఆ ఇసక పర్ర మీద డేకడం మొదలు పెట్టేరు. సాయంకాలం అయేసరికి ఛత్రం పట్టినట్లు ఉన్న “ఆకుల చాందినీ” దూరంగా జరిగిపోతోంది! ఆరు రోజులలో మొదటిసారి చెట్ల మధ్య నుండి బయట పడి నీలాకాశం కిందికి వచ్చేరు. దానికే పెద్ద పండగ జరుపుకున్నట్టు సంతోషించేరు. సూర్యుడు పశ్చిమాకాశంలో ఇలా కుంకేడో లేదో అలా నల్లటి ఆకాశం లోకి నక్షత్రాలు దూసుకు వచ్చేయి. ఆ నక్షత్రాల  కాంతిలో రాజు, అతని పొట్ట మీద తల వాల్చి ఏంబర్‌ ఆద మరచి నిద్ర పోయారు.

ఆదివారం తెల్లవారింది. ఇద్దరూ కొంచెం తేరుకున్నారు. చుట్టు పక్కల చూడగా వాళ్ళు ఉన్న ఇసక పర్ర ఒక నది యొక్క వెల్లువ తలం గట్టున ఉన్నట్లు తెలిసింది. నది గట్లు తెగి వెల్లువై ప్రవహించినప్పుడు ఇక్కడ మేట వేసి ఉంటుంది. ఇసక దిబ్బలు దిగి కొంచెం కిందికి వెళితే అక్కడ నిలకడగా నీరున్న చిన్న తటాకం లాంటిది ఒకటి కనిపించింది. ఆ నీటిలో ఉన్న చెట్ల మోడులని ఆసరాగా పట్టుకుని ఇద్దరూ ఆ తటాకం లోనికి దిగేరు. దద్దుర్లుతో వాచి చిటపటలాడుతూన్న ఒంటికి చల్లటి నీరు తగిలే సరికి కొంత ఉపశమనం కలిగింది. కాని ఆ నీళ్ళల్లోనూ ముళ్ళ తుప్పలే! నది పొంగి గట్టున ఉన్న తుప్పలని, దుబ్బులని ముంచెత్తి ఉంటుంది. దూరానికి చూస్తే ఇటూ అటూ ఆకుల చాందినీతో జుత్తు విరగబోసుకున్న దయ్యాలలా కనిపిస్తున్నాయి అడవి లోని చెట్లు. కాని ఆ జుత్తు మధ్యలో, తలలో పాపిడిలా, ఏ చెట్లూ లేకుండా ఆకాశం కనిపిస్తోంది. ఇక్కడ తప్పకుండా అడవి మధ్యలో ప్రవహిస్తూన్న నది ఏదో ఉండి ఉండాలి. ఈ ఆలోచనతో రాజు, ఏంబరు ఆ గట్టున ఉన్న తుప్పలని పట్టుకుని నీళ్ళల్లో తేలుతూ సేద తీర్చుకుంటున్నారు.

ఇంతలో దూరంలో  ఏదో చప్పుడు వినిపించింది. ఇలా మతిని భ్రమింపచేసే చప్పుళ్ళూ ఇంతకు ముందు రెండు సార్లు విన్నారు, రెండు సార్లూ మోస పోయారు. కాని ఈ చప్పుడు క్రమేపీ బిగ్గరగా వినిపిస్తోంది. ఇది మోటరు బోటు కాదు. విమానపు మోత! రాజు, ఏంబరు చేతికి దొరికిన కొమ్మలని జెండాలలా ఊపడం మొదలుపెట్టేరు. ఆ విమానం ముందుకు వెళ్ళి, వెనక్కి తిరిగి వీరున్న చోట చాల దిగువకి దిగి, వీరి మీదుగా ఎగురుతూ దూరంగా వెళ్ళి పోయింది.

ఈ ప్రాంతాలలో విమానాలు నదీలోయని అంటిపెట్టుకుని ఎగిరితేనే కిందని ఏదుందో కనిపించే సావకాశం. ఆకుల చాందినీ మీద ఎగిరితే ఆకులు కనిపిస్తాయి తప్ప నేల మీద ఉండేవారు కనిపించరు. కనుక ఈ విమానం ఎగిరి వెళ్ళిన దారి వెంబడే ఏదో నది ఉండి ఉండాలి. వీళ్ళని వెతికి రక్షించడం కోసమే ఎవ్వరో ఆ విమానాన్ని పంపి ఉంటారు. ఇలా తర్కించుకొని, ఆ విమానం వెళ్ళిన వైపు గట్టు వెంబడే తుప్పలని పట్టుకుని, నీళ్ళల్లో తేలుకుంటూ, రాజూ, ఏంబరూ ఈదుతున్నారు. ఏంబర్‌ ఒంట్లో వీసమెత్తు ఓపిక లేదు. మనస్సులో బతకాలనే కోరిక సన్నగిల్లి పోతోంది. ఆమెని వెల్లకిల్లా నీళ్ళ మీద పడుకోబెట్టి, మెడ కింద తన చెయ్యి పెట్టి రాజే ఆమెని ముందుకి లాగడం మొదలు పెట్టేడు. మీద నుంచి ఎండ ఒకటే బాదుడు. నీళ్ళల్లో ఉన్నారు కనుక బతికిపోయారు కానీ, లేకపోతే ఆ వేడికి చచ్చిపోయి ఉండేవారు.

పొద్దు కుంకే సమయానికి అడవి ముసుగు తెరచింది. ఎదురుగా విశాలమైన నది కనిపించింది. కనీసం బల్లకట్టు తయారు చేసుకుని ఆ నదిలో చొరబడితే ఎప్పటికైనా బయట ప్రపంచం, మనుష్యులు కనిపించకపోరు.

“అరుగో మనుష్యులు!!” ఏంబర్‌ సన్నగిల్లితూన్న గొంతుతో ఒక చిరుకేక పెట్టింది.

చిన్న దొన్నెలో ఇద్దరు నల్లటి మనుష్యులు కనిపించేరు. తనకి వచ్చీరాని పోర్చుగీసు భాషలో ఏంబర్‌ వారిని పిలచింది. వాళ్ళు వీళ్ళిద్దరినీ ఆ దొన్నెలోకి ఎక్కించుకున్నారు.

చీకటి పడే వేళకి అక్కడకి గంటన్నర దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో పూరిగుడిసెల దగ్గరకి చేరుకున్నారు. అక్కడి ఆడంగులు వీరిద్దరికీ చేతనైన శుశ్రూష చేసి, పొడి బట్టలు ఇచ్చి కాసిన్ని పళ్ళు, రొట్టెముక్కలు పెట్టేరు. మరొకరు ఒంటినిండా గుచ్చుకున్న ముళ్ళని నెమ్మదిగా తీసి కొంత ఉపశమనం కలిగించేరు. అక్కడ రెండు రాటల మధ్య కట్టిన హేమక్‌ల మీద పడుక్కుని ఇద్దరూ మైమరచి నిద్ర పోయేరు.

సోమవారం ఉదయం వీరిద్దరినీ మావూయెన్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళేరు. అక్కడ వైద్యుల పరిచర్యలో వీరిద్దరూ తేరుకుందికి రెండు రోజులు పట్టింది. రోజుకి ఏభై కేలరీల తిండి కూడ లేకుండా, వారం రోజుల పాటు బతకడం వల్ల ఇద్దరూ ఎముకల పోగులలా తయారయారు. నవనవలాడుతూ ఉండే ఏంబర్‌ గళ్ళెంలా తయారయింది. ఆ దృశ్యం చూసి రాజ్‌ దుఃంఖం ఆపుకోలేకపోయాడు.

మొగ్గతొడుగుతూన్న వీరి స్నేహానికి అమెజాన్‌ అడవి ఒక అగ్నిపరిక్ష పెట్టింది. వివాహ బంధం కూడ ఒనగూర్చలేని సాన్నిహిత్యాన్ని శేముష్య స్నేహంలోనే ఇద్దరూ చవి చూసేరు. ఒకరి మనుగడకి మరొకరు కారణభూతులయ్యారు.

వ్రతం చెడ్డా ఫలం దక్కాలి కదా. అందుకని అమెజాన్‌ యూత్‌ హాస్టల్‌కి తిరిగి వచ్చి, మరొక వారం రోజులు అక్కడే ఉండి, ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదించిన తర్వాతే ఇద్దరూ తిరుగు ముఖం పట్టేరు.

జూలై నెల. నాలుగో తారీఖు. ఆ రోజు స్వతంత్ర దినోత్సవం. భోజనానికీ, తర్వాత బాణసంచా చూడడానికీ తన ఇంటికి రమ్మని రాజ్‌ని ఏంబర్‌ ఆహ్వానించింది. ఏంబర్‌ పెరట్లో కూచుని పురపాలక సంఘం వారు జరిపే బాణసంచా ఉత్సవాలని చూడొచ్చు. రాజ్‌ వెళ్ళేడు. ఇద్దరూ చెరొక పానీయం తాగుతూ గతాన్ని సింహావలోకనం చేసుకున్నారు. రాజ్‌కి ఇష్టమైన వంటకాలు వండింది ఏంబర్‌. కొవ్వొత్తుల వెలుగులో భోజనాలు అయిన తర్వాత చీకటి పడే వరకు ఇద్దరూ సంగీతం వింటూ కబుర్లు చెప్పుకున్నారు.

“రాజ్‌! నేను రోజూ మందు వాడకపోతే నా మనస్సు కకలా వికలం అయేది. కాని నీ సన్నిధిలో ఉన్న వారం రోజులూ నా మందు వాడక పోయినా నేను బాగానే ఉన్నాను కదా!”

“కనీసం ఈ అమెజాన్‌ ప్రయాణం నీ యెడల షాక్‌ ట్రీట్మెంట్‌ లా పని చేసిందేమో!”

తొమ్మిది దాటాక ఏంబర్‌ రాజ్‌ని పెరట్లోకి తీసుకెళ్ళింది బాణసంచా చూడడానికి. తారాజువ్వలు ఆకాశంలోకి ఎగిరి కొన్ని గుండెలదిరేలా చప్పుడు చేస్తూ ఉంటే మరికొన్ని పంచరంగుల వెలుగులు విరజిమ్ముతూ నేత్రోత్సవం కలుగజేస్తున్నాయి. ఆ రంగుల వెలుగులో ఎప్పుడూ లేని ఒక వింత సోయగం ఏంబర్‌ ముఖంలో చూసేడు రాజ్‌.

రాత్రి పది కాబోతూంది. బాణసంచా హడావుడి, హోరు అయిపోయాయి. చిన్న చిరు చలి వేయడం మొదలైంది. తన స్వెట్టర్‌ని తీసి ఏంబర్‌ భుజాల మీద కప్పి, “లోపలికి పోదాం” అంటూ దారి తీసేడు రాజ్‌.

“అటు కాదు, ఇటు” అంటూ పెరట్లో మరో పక్కకి దారి తీసింది ఏంబర్‌. అక్కడ చెట్ల మధ్య ఉన్న గజీబోలో ఆకులు, గడ్డి వగైరాలతో కప్పబడ్డ చిన్న కుటీరం లాంటిది ఒకటి కట్టబడి ఉంది. రాజు ఆశ్చర్యంతో ఆమెని యాంత్రికంగా అనుసరించి నడుస్తున్నాడు.

“రాజ్‌! ఈ రోజు అమెరికాకే కాదు, నాకూ స్వతంత్ర దినోత్సవమే! ఈ కుటీరంలో అన్ని సదుపాయాలూ అమర్చేను. ఇక్కడ దోమలు లేవు. ఒంటికి పులుముకుందికి బురద లేదు; బురదకి బదులు పన్నీరు ఉంది. ఆ అమెజాన్‌ అడవిలో నీ సాన్నిధ్యాన్ని అనుభవించేను కాని, నీ సాంగత్యాన్ని అనుభవించే అవకాశం రాలేదు,” అంటూ ఆ కుటీరంలోనికి రాజ్‌ని తీసుకెళ్ళి కుటీరం ద్వారానికి ఉన్న తెరని జిప్పర్తో మూసేసింది.

(అమెజాన్ అడవిలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు నిజంగా జరిగినవే. మిగిలిన కథ మాత్రం కల్పితం.)
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment