Monday, October 8, 2018

అయిదో కుర్చీ(అనువాదకథ)


అయిదో కుర్చీ(అనువాదకథ)
సాహితీమిత్రులారా!

గుడ్లగూబ పగటిపూట బయటకొచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. ఈ రోజు బంగార్రాజు పద్మావతిని బయటకి తీసుకురావడానికీ అలాంటి కారణమే ఉంది. పద్మావతిని ఏదో ఒకరకంగా మచ్చిక చేసుకోవాలతను. ఎటు చూసినా మైలు పొడుగుండే ఆ స్టోర్‌లో దొరకని వస్తువంటూ ఉండదు. పైగా బోల్డంత ఎంటర్టయిన్మెంటు. పద్మావతిని ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతిసారీ చిన్నపిల్లలా అయిపోతుంది.

అయితే కథ అనుకున్నట్టు సాగలేదు. తంటా అంతా ఒక కుర్చీతో చిన్నగా మొదలైంది. అది చిలికి చిలికి గాలివానయింది. ఈమె పట్టిన పట్టు వదలనంటూ కూర్చుంది. పోనీలే అని ఊరుకుంటే అతడ్ని ఇక పైసాక్కూడా మతించదని అతని భయం.

సదరు కుర్చీ కాశ్మీర్‌లో తయారు చేయబడింది, కేవలం విదేశాల్లో అమ్మడం కోసం. కాశ్మీర్ ఊలు రగ్గుల తర్వాత ఈ అక్రోటు చెక్కతో చేసిన కుర్చీలు అంత ప్రసిద్ధి. కుర్చీ మీద చిక్కగా చెక్కిన ఆర్ట్ వర్క్, లేత నీలం రంగు వెల్వెట్ మెత్తలతో ఎంతో గంభీరంగా ఉంది. కూర్చుంటే కాళ్ళు నేల మీద ఆననంత ఎత్తుంది. రాజులు రాణీల కోసం చేసినట్టుగా ఉంది. పద్మావతికి ఆ కుర్చీ నచ్చింది. తను ఇప్పుడది కొనాలి.

ఇంట్లో ఖరీదైన సోఫాసెట్ వుంది. వానపాము రంగు కుషన్లు మాపు కనిపించనీయవు. ఒక సోఫా, ఒక లవ్‌సీట్, రెండు సింగిల్ సీటర్లు. ఇన్నేళ్ళయినా ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఒక అతిథి ఎక్కువొస్తే వంటగదినుండి మరో కుర్చీ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ అది అవమానంగా భావిస్తుంది పద్మావతి. అందుకే ఆమె ఈ కుర్చీ కొనాలని ఇంత ఉత్సాహం చూపుతోంది. ఖరీదు కూడా ఎక్కువేమీ కాదు. తన ఒక వారం జీతం కన్నా తక్కువే.

కానీ ఈసారి బంగార్రాజు కూడా మొండిగానే ఉన్నాడు. ప్రతి గొడవ లోను, పంతం లోనూ దిగొచ్చే గొప్పతనం ఆయనదే అయినప్పటికీ ఈ సారి మాత్రం పట్టు వదలదల్చుకోలేదు. ఎంతకు తెగించైనా తన మాట నెగ్గించుకోవాలనే నిర్ణయించుకున్నాడు. పట్టు కుర్చీ గురించి కాదు, ఇంట్లో తన అధికారం నిలుపుకోవడం గురించి. అయితే పద్మావతి ఇతనికంటే తెలివైనది. ఆమె తన దగ్గరున్న అతి శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించడానికి తగిన అవకాశం కోసం చూస్తోంది. అది ప్రయోగిస్తే అతను నిర్వీర్యమై పోవడం ఖాయమని అమెకి బాగా తెలుసు. ఆమె సమర్థురాలే! అనుకుంటే అంతపనీ చేస్తుంది.

ఆమెకప్పుడు పద్నాలుగేళ్ళుంటాయి. తెల్లటి యూనిఫామ్‌లో తన స్నేహితురాళ్ళతో కలిసి బడినుండి తిరిగొస్తోంది. అందరూ ఇంచుమించు ఒకే వయసున్న అమ్మాయిలు. గలగలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నడుస్తున్నారు గుంపుగా. ఒక బండివాడు బండి నిండా సిమెంట్ బస్తాలు ఎక్కించుకుని బండి లాగుతున్న ఎద్దుని ఒకటే బాదుతున్నాడు. ఆ ఎద్దు అంతబరువు లాగలేక గస పోసుకుంటూ, సొంగ కారుస్తూ తూలిపోతోంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయిల గుంపులోనుండి పద్మావతి హఠాత్తుగా బండి దగ్గరకొచ్చి, వాడు ఆశ్చర్యంతో చూస్తుండగానే వాడి చేతిలోనున్న కందికర్రని లాక్కుంది. దాన్ని రెండు ముక్కలుగా విరిచి వాడి మొహాన పడేసి, ఏమీ జరగలేదన్నట్టు గుంపులో కలిసిపోయింది. ఇదంతా చెయ్యడానికి ఆమెకు సరిగ్గా ఇరవై సెకండ్లు కూడా పట్టలేదు. ఒక్కసారైనా ఆమె బండివాడికేసి తిరిగి చూడలేదు.

అదీ ఆమె స్వభావం. బంగార్రాజు ఆమె మీద మనసు పారేసుకున్నది ఈ ధైర్యసాహసాలను చూసే. శ్రీలంక నుండి శరణార్థిగా కెనడా రాగానే అతను చేసిన మొదటి పని ఏజెంట్ ద్వారా కాగితాలు తయారు చేసుకుని ఆమెను ఇక్కడకి రప్పించుకోవటమే.

వాళ్ల పెళ్ళి గుడిలో ఆర్భాటంగా జరిగింది. ప్లాస్టిక్ అరటిచెట్లు, నిజమైన సన్నికల్లు, సన్నాయి మేళం, ప్లాస్టర్ స్తంభాల పెండ్లిమండపం, ఫ్రీజ్ చేసి తెప్పించుకున్న మామిడాకులతో తోరణాలు, ఆకాశమార్గాన తెప్పించిన అరటాకుల్లో వడ్డన; అప్పాలు, అరిసెలు, బూరెలు వంటి అపురూపమైన భక్ష్యాలతో విందు. ప్రముఖుడైన జగన్నాథ పురోహితుల చేతుల మీదుగా పెళ్ళి తంతు.

ఆమెకు అప్పటికి చీర కట్టుకోడం అలవాటు లేదు. హడావిడిగా కట్టుకుని అశ్రద్ధగా పైట వేసుకున్నట్టు చుట్టేసుకుంది. కొంతమంది ఒంటి తీరుకి, చీరకట్టు అందాన్ని రెట్టింపుజేస్తుంది; మరికొందరికి ఉన్న సహజమైన అందం కూడా కనిపించకుండా పోతుంది. ఈమెది రెండో రకం. గోధుమ ఛాయ, నిగనిగలాడే అందమూ ఉన్నా చేతగాని చీరకట్టువల్ల మామూలు అమ్మాయిలా తేలిపోయింది. నటన లేకుండా సహజంగా ఉంది. చూడటానికి చాలా సాదాగా కనిపించింది. అయితే కళ్ళు మోసం చెయ్యగలవన్నది బంగార్రాజు మొట్టమొదటసారి తెలుసుకున్నది ఆ మొదటి రాత్రే. సిగ్గు, బిడియం అన్నవి ఆమెకి మచ్చుకైనా లేవు. ఇదే అతనికి మొదటగా నచ్చిన విషయం. రానురానూ నచ్చనిది కూడాను.

ఆ రాత్రి బంగార్రాజు ఆశ్చర్యానందాలతో పొంగిపోయాడు. పద్మావతి భుజాలు సాముగరిడీలు చేసినట్టు గుండ్రంగా గట్టిగా వన్నెదేఱి ఉన్నాయి. ఆమె చన్నులు గుండ్రంగా, ముత్యపు తెలుపుతో మెరుస్తున్నాయి. చెట్లెక్కేవాడి పొట్టలా చదునుగా ఉన్న పొట్ట. స్త్రీ గురించి ఎన్నో రాత్రులు ఊహించుకున్న రూపాలన్నీ చెరిగిపోయి ఈమె రూపమే అతని మనసులో నిండిపోయింది. అది అతనికి చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.

ఆమె పడకగదిలో చాలా చురుగ్గా ఉండేది. కోరికతో నిండిపోయి ఆ సమయంలో ప్రపంచాన్ని మరచిపోయినట్టుండేది. ఇద్దరూ అలా ఎవరి కాళ్ళూ చేతులు ఎవరివో తెలీనంతగా కలిసిపోయేవారు. అలానే ఉండిపోయేవారు. ఆపైన కళ్ళు మూసుకుని ఆ మత్తుని ఆస్వాదిస్తూ ఉండిపోయేది. ఆ సమయాల్లో మనిషి శరీరం సంభోగానికి వీలుగా ఏర్పడింది కాదని అనిపించేది అతనికి. కాలు, చేయి అవసరంలేని చోట అడ్డొస్తున్నాయి అనిపించేది. సంభోగాన్ని ఉద్ధేశించి, దానికి అనువుగా సృష్టించబడిన ఏకైక శరీరం పాము శరీరం మాత్రమే కాబోలు – పెనవేసుకుని, అల్లుకుని, కావలసినట్టు ఒదిగి, పొదవుకుని సంభోగించడానికి తగినట్టుగా ఉండేదని అతను అనుకుంటుండేవాడు.

ఈ పెనవేతలో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్థ పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.

ఇదంతా పెళ్ళయిన కొత్తల్లో. తర్వాత్తర్వాత పద్మావతి కొంచం తెలివి తెచ్చుకుంది. వంటగది సర్దేసి పనులన్నీ ముగించుకుని పడకగదిలోకి వచ్చేప్పటికి తన పట్టీలను విప్పి పెట్టేసేది. ఒక్కోసారి పట్టీలు ముందే విప్పి పెట్టి నవ్వుతూ వచ్చేది. అతనికి అర్థం అయిపోయేది. సిద్ధంగా ఉండేవాడు. కొన్ని రోజులు పట్టీలు విప్పకుండా ఘల్ ఘల్ మంటూ నడిచొచ్చి ఢామ్మని పరుపు మీద వాలిపోయేది; అలా చేస్తే ఆ రోజు పస్తు అని అర్థం. అలా పట్టీలు సంకేత పదమైంది వాళ్ళకి.

పాప పుట్టాక కూడా ఇలానే కొనసాగింది.

మరికొన్నేళ్ళకి అది పాతకథై పోయింది. పద్మావతి ఇప్పుడు అసలు పట్టీలు విప్పటమే మానేసింది. ఆమె మనసులో ఏముందో, ఆలోచనల తీరెలా ఉందో ఎవరికి తెలుసు? ఉల్లిపాయలు తరిగేటప్పుడు ముఖం మరో పక్కకి తిప్పుకున్నట్టు తిప్పుకొని మాట్లాడుతుంది. అతనితో మాట్లాడటానికే చిరాకుపడుతుంది. ఇక అతణ్ణి పట్టించుకోవడం కూడానా? బంగార్రాజుకి ఇది తట్టుకోవడం కష్టమయింది.

కెనడాకి వచ్చాక ఆమె కాలిపగుళ్ళలో అంటుకుపోయున్న శ్రీలంక తాలూకు మట్టి పూర్తిగా పోవడానికి ఆరు నెలలు పట్టింది. అయితే ఆమె అలవాట్లు, ప్రవర్తన, కట్టు-బొట్టు మారడానికి ఆరువారాలైనా పట్టలేదు. కట్టు-బొట్టు ఎలా మారినా ఒక్క పట్టీలు పెట్టుకోడం మాత్రం మానలేదు. కెనడా ఆమెకి స్వర్గలోకంలా అనిపించింది. ఆ దేశపు చలిని కూడా లెక్కపెట్టకుండా ఇక్కడే పుట్టి పెరిగినట్టు వెస్టర్న్ కల్చర్‌లోకి ఇమిడిపోయింది. బంగార్రాజేమో ఇప్పటికీ అలవాటు దోషమా అన్నట్టు డ్రైక్లీన్డ్ షర్టుని కూడా దులిపి వేసుకుంటాడు. పురుగులుంటాయేమో అని షూ ఒకసారి బోర్లించి తట్టి చూసి మరీ తొడుక్కుంటాడు. మరి ఈ మధ్యే వచ్చిన పద్మావతి? జుట్టు పొట్టిగా బాబ్ కట్ చేయించింది. జీన్స్ టీషర్ట్ వేసి నైకీ లాంటి అథ్లెటిక్ షూస్‌లో మాత్రమే ఇంట్లోంచి బైట అడుగుపెడుతుంది. తానొక్కతే వెళ్ళి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసి, క్రెడిట్ కార్డ్ వాడి బిల్లు కట్టే స్థాయికి టకటకా ఎదిగిపోయింది.

కెనడా వచ్చాక, ఒక ఏడాది పాటు కోచింగ్ తీసుకుని కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు బంగార్రాజు. పనిలో గట్టివాడే. ఇతను రాసే కోడ్‌లో బగ్స్ వుండవు. ఒకసారి రాస్తే ఇక తిరిగి చూసుకోనక్కర్లేదు. అయితే మనిషికి కొంచం బద్దకం. ఒక్కోసారి ప్రాజెక్ట్ అంతా ఒక కొలిక్కొచ్చేసినా ఇతని మాడ్యూల్స్ మాత్రం ఇంకా నిదానంగా అవుతూ ఉండేవి. ఈ నిదానం భరించలేని అతని ఉద్యోగం తొందరగానే ఊడింది.

ఉద్యోగం పోయాక బంగార్రాజు ఇంట్లోనే కాలక్షేపం చేశాడు కొంతకాలం, ఇలాంటి విషయాల్లో నిదానస్తుడు కావటంతో. అంతవరకు చిన్న చిన్న తప్పులే చేసిన అతను ఒక అతి పెద్ద తప్పు చెయ్యవలసివచ్చింది ఈ రోజుల్లోనే. దగ్గర్లో ఫ్యాక్టరీలో ఒక ఖాళీ వచ్చింది. ఆ ఉద్యోగంలో పద్మావతి చేరతానంటే సరే అనేశాడు. అలా అన్న ఆ క్షణాన చేయిదాటిన పెత్తనం మళ్ళీ అతనికి దొరకలేదు, అతనికి మళ్ళీ ఉద్యోగం వచ్చాక కూడా. పెత్తనం ఆమె చేతిలోనే అలా ఉండిపోయింది.

పద్మావతి పనిచేసే చోట సౌత్ అమెరికా ఆడవాళ్ళు ఎక్కువమందే ఉన్నారు. వాళ్ళకీ పద్మావతికీ మంచి దోస్తీ కుదిరింది. ఈమెను చూస్తే వాళ్ళలానే ఉండేది. కట్టూ బట్ట, రంగు, ఆకారం, జుట్టు ఇవన్నీ చూస్తే ఈమెను ఏ కొలంబియనో కోస్టారికనో అని అనుకుంటారు. మాటతీరు కూడా వాళ్ళలానే ఇపుడు పద్మావతికి. బస్‌స్టాప్‌లో ఎవరైనా స్పానిష్‌లో పలకరిస్తే మురిసిపోతుంది.

ఆమెకి పద్నాలుగేళ్ళ కూతురుందంటే ఎవరూ నమ్మడం లేదు. ఒక రోజు పాలో డ్యాన్స్ క్లాసులో ఒకావిడ, ‘ఈ అమ్మాయి మీ చెల్లెలా?’ అని అడిగింది. పద్మావతి ఆ రోజంతా గాల్లో తేలిపోయింది. భర్తతో ఈ విషయం ఆమె పదేపదే చెప్పి మురిసిపోయింది. దాంతో అతని భయం ఇంకాస్త పెరిగింది.

సంకేత భాష బాగున్న రోజుల్లో వారి ఇరువురి మధ్య ఎంత అవగాహన ఉండేదో! పద్మావతీ అని పూర్తి పేరుతో పిలిస్తే అతను కోపంగా ఉన్నాడని అర్థం. పద్దూ అని గోముగా పిలిస్తే ప్రేమగా ఉన్నాడని. ఈల వేస్తూ పిలిస్తే జోరు మీదున్నాడని. వేరేవాళ్ళ సమక్షంలో పద్మా అని పిలిచేవాడు కానీ పడకటింట్లో మాత్రం ఆ పిలుపూ, ఆ గొంతే వేరు. పద్దూఊ, పద్దూఊ! అని లయబద్ధంగా, గారాబంగా పిలిచేవాడు.

ఇప్పుడా అవగాహనలూ లేవు, ఆ సంకేతాలూ లేవు. అవన్నీ మరుగునపడి కొన్నేళ్ళయింది. బంగార్రాజు పరిస్థితి ఇంకో మెట్టు దిగింది.

వంటింట్లో కూడా బంగార్రాజు మాట నెగ్గలేదు. కూతురు కూడా తల్లితో కుమ్మక్కయింది. నోటికి రుచిగా భోంచేసి ఎన్నేళ్ళయిందో! దోసె, ఇడ్లీ, వడ, పెసరట్టు, పునుగులు వంటివి పూర్తిగా మర్చిపోయినట్టే. బర్గర్ అనబడే భూతమూ, పీజ్జా అనబడే పిశాచమూ ఇంట్లో జుట్టు విరబోసుకుని ప్రతిరోజూ నాట్యం చేస్తుంటాయి. రోజూ ఇలాంటి రుచీ పచీ లేని తిండ్లే డైనింగ్ టేబిల్ మీద. అతనికి ఆ వాసనకే డోకొస్తుంటుంది ఒక్కోసారి. అప్పటికీ ధైర్యం చేసుకుని ఒకసారి ఇడ్లీ తినాలనుందని అన్నాడు. పద్మావతి గయ్యిమని లేచింది.

“పులిసిపోయిన పిండి ఇడ్లీలు, దోసెలు, గారెలు, పునుగులు తప్పితే మీకింకేమీ దొరకవా తినడానికి? అవి తినీ తినీ కదూ మీ బుర్ర కూడా పులిసిపోయింది పూర్తిగా? నేనేమైనా ఊరికే పడున్నానా ఇంట్లో? పొద్దున్నే నాలుక్కి లేస్తున్నాను, వంట చేస్తున్నాను, ఇల్లు సర్దుతున్నాను. మీతో సమానంగా నేనూ ఉద్యోగం చేసి ఈ ఇంటికోసం రెక్కలు ముక్కలు చేస్కుంటున్నాను. ఒక్కగానొక్క పిల్లను ఒంటిచేత్తో పెంచుతున్నాను. చేతనైనంత చేసి నోటిదాకా తెస్తున్నాను. మరి మీరు? ఆఫీస్ నుంచి రాగానే బీర్ క్యాన్ పట్టుకు సోఫాలో కాళ్ళు జాపుకుని పడుకుంటారు. ఆరు నెల్లయింది స్టవ్ పని చేయట్లేదండీ బాగు చేయించండీ అని. తమరికిప్పటికీ కుదరలేదు. అదే మరి టీవీ రిమోట్ పని చెయ్యకుంటే గంట ఆగరు. పోయి కొత్త రిమోట్ కొనుక్కొస్తారు. ఎంతకని సహించను? చూస్తూ ఉండండి ఒక రోజు నేనేం చేస్తానో!”

స్టవ్ నాలుగు బర్నర్లలో మూడు పని చెయ్యడం లేదు. ఒక్కదానితోనే సరిపెట్టుకుంటూ, నానా అవస్థలు పడుతోంది పద్మావతి. అది బాగు చేయించాలని ఎన్ని సార్లు చెప్పినా బంగార్రాజు పట్టించుకోలేదు. ఆమె కోపం ఆరోజు బద్దలయింది. ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఒక వీకెండ్ ఆమెను షాపింగ్ అని బైటకు తీస్కెళ్ళాడు. ఆమె ఇతని పక్కన నడవడానికి ఇష్టపడలేదు. మాల్‌లో ఆమె ముందు నడుస్తోంటే బంగార్రాజు వెనకాల నడుస్తున్నాడు ఆమెనే చూస్తూ. వెనుక నుండి చూస్తుంటే అచ్చు సౌత్ అమెరికన్‌లా ఉంది. బంగార్రాజులో కోరిక నిద్రలేచింది. కానీ ఆమెలో ఎంత ఆకర్షణ ఉందో అంత కర్కశత్వం తోడైంది ఇప్పుడు. ఇల్లు ఇద్దరి పేరిటా ఉంది. ఇంటి మార్ట్‌గేజ్ మంత్లీ పేమెంట్లు ఇతనే కడుతున్నాడు కానీ ఈ దేశంలో చట్టాలు భార్యలకి అనుకూలంగా ఉంటాయి. ముందుముందు ఈమెతో అతి జాగ్రత్తగా ఉండాలి అని మనసు ఎందుకనో హెచ్చరించింది.

ఎదురుగా వచ్చేవాళ్ళు ఒకటికి రెండుసార్లు ఈమెకేసి తిరిగి చూసి మరీ వెళ్తున్నారు. పద్మావతి జీన్సు, నడుము దగ్గర తాడు కట్టిన బ్లౌస్ వేసుకుంది. వారు బిగించిన మద్దెలలా బక్కచిక్కిన నడుము. ఇతనిని తప్పించుకుని వెళ్ళిపోవాలన్నట్టు నడకలో వేగం. ఎక్కడ విడిచి వెళ్ళిపోతుందో అన్నట్టు భయంతో పొట్ట చేతబట్టుకుని కుక్కపిల్లలా ఆమె వెంట తను.

ఇంతలో ఒక పార్లర్ ముందు ఒక చైనావాడు పచ్చబొట్టు పొడుస్తూ కనిపించాడు. ఎవరో కండలు తిరిగున్న ఒక తెల్లవాడి భుజమ్మీద డ్రాగన్ బొమ్మ గీస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె అలాగే ఆగిపోయింది అపురూపంగా చూస్తూ. బంగార్రాజు కూడా ఆమె పక్కనే నిలబడి కాసేపు చూశాడు. మెల్లిగా ఆమె భుజంపై చేయి వేసి నిమురుతూ ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతని ఉద్దేశ్యం ఆమెకు అర్థమయింది.

కాసేపు అలా చూసినాక, బంగార్రాజు ఆమెను కాస్మటిక్స్ షాప్‌కి తీసుకెళ్ళగానే పద్మావతి ముఖం వికసించింది. ఆమె తీస్కున్న మాస్కరా, ఐ-లైనర్, ఫౌండేషన్, నెయిల్ పాలిష్ అన్నిటికీ బిల్ కట్టాడు. వెతికీ వెతికీ చివరకు రాగినలుపు లాంటి రంగుతో ఉన్న ఒక లిప్‌స్టిక్ ఎంచుకుంది పద్మావతి. అక్కడే వేసుకుని, పెదవుల్ని ముద్దుగా బుంగమూతిలా పెట్టి పెదవులు రుద్దుకుంది. ఆ పెదవుల కవ్వింపు అతన్ని మరింత బాధించింది.

ఈ అవకాశం జారవిడుచుకోకూడదు. తనను అలానే సంతోషంగా ఉంచగలిగితే అతని ధ్యేయం నెరవేరుతుంది అనుకున్నాడు. దారిలో ఒక ఐస్‌క్రీమ్ పార్లర్ కనిపించింది. ఆమెకు చాక్లేట్ సాస్ సండే అంటే ఇష్టం. ‘కావాలా పద్దూ’ అనడిగాడు. కళ్ళు పెద్దవి చేసి మురిపెంగా తలూపింది. అంతే, ఎగురుకుంటూ హనుమంతుడిలా ఉత్సాహంగా లోపలికెళ్ళాడు. మూడు స్కూపుల ఐస్‌క్రీమ్, కరిగించి వాటిపై పోసిన చాక్లేట్, వేఫర్, క్రీమ్, వాటిపైన మకుటంలా అలంకరించిన చెర్రీ ఉన్న నిలువెత్తు కప్పుతో విజయవంతంగా తిరిగివచ్చాడు. తన చాక్లెట్ రంగు పెదవులని విడదీసి నాలుకతో ఆమె సుతారంగా ఐస్‌క్రీమ్ నాకసాగింది.

తిరిగి ఇంటికి బయల్దేరే సరికి చీకటి పడుతోంది. గాలిలో చలి పెరిగింది. ఊళ్ళోంచి బైటకు వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. కార్ల వెనక ట్రైలర్స్ మీద పడవలు, రూఫ్‌టాప్ మీద టెంట్‌హౌసులు కట్టుకుని వెళ్తున్నారు చాలామంది. వెనుక సైకిళ్ళు వేలాడదీసిన కార్లు మరికొన్ని. వీకెండ్ ఉత్సాహం వారి చుట్టూతా. బంగార్రాజు మనసులో ఆశ మరింత పెరిగింది.

ఇంత చేసీ కూడా ఆ రాత్రి అతనికి నిరాశే మిగిలింది. కేవలం లిప్‌స్టిక్ కొనిచ్చి, ఐస్‌క్రీమ్ తినిపించీ ఆమెను మచ్చిక చేసుకోలేడని అర్థమైంది. అప్పటికీ ప్రయత్నించాడు. బలంకొద్దీ దూరం నెట్టింది. అంటువ్యాధి ఉన్నవాడిలా ప్రవర్తించింది. చివరకు తప్పు చేసి బెత్తంతో కొట్టించుకున్నవాడిలా బంగార్రాజు టీవీ ముందు కూలబడ్డాడు. ఇక ఆ రాత్రి అతను పడగ్గదిలోకి వెళ్ళలేదు.

మరుసటిరోజు ఉదయం పద్మావతి హాలంతా పడి ఉన్న పద్నాలుగు బీర్ కేన్లను తీసి రీసైకిల్ బిన్‌లో పడేసింది.

రెండు వారాలు ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలింది. అధికారం చేజిక్కించుకోవడం కోసం కుట్ర పన్నుతున్న సామంత రాజుల్లా ప్రవర్తించారు ఇద్దరూ. బంగార్రాజు జీవితంలో మరిచిపోలేని ఒక పాఠాన్ని, ఎవ్వరితోనూ చెప్పుకోలేని ఒక అవమానాన్ని అతనికి కలిగించడానికి సరైన సమయం కోసం చూస్తోంది ఆమె. అతని మోచేతి విసురుకు గాయపడిన ఆమె పెదవిని సమర్థవంతంగా లిప్‌స్టిక్ రాసి తన కోపం లాగానే కనిపించకుండా దాచేసింది.

పద్మావతి, బంగార్రాజు ఇప్పుడు ఈ కుర్చీ పంతం దగ్గరకు వచ్చి ఆగారు. కుర్చీ విషయంలో ఇతను పట్టుదలగా ఉన్నాడు. అతనికి తెలియకుండా ఆమె కుర్చీ కొంటే దాన్ని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టేయాలని శపథం చేస్కున్నాడు తనలో తాను. ఇది చివరి పోరాటం. ఇందులో ఓడిపోతే ఆమె అతణ్ణి ఇక చేతగాని వాడికింద లెక్కగట్టేసి పనికి రాని పాతసామాన్లతో బాటు సెల్లార్‌లో పడేయడం ఖాయం!

ఇంగ్లీష్ వాసనైనా ఉండని సరస్వతి విద్యాలయంలో చదువుకుని, పొట్టబొడిచినా ఇంగ్లీష్ రాని, చందమామ కథలకంటే మరో పుస్తకం ఉందని ఎరగని ఆడది ఎలాంటి కంప్యూటర్ ప్రోగ్రామునైనా బగ్ లేకుండ రాయగల దిట్ట అయిన బంగార్రాజుకి సవాలుగా ఎదిగి కూర్చుంది.

బంగార్రాజుకు కోపంగా ఉంది. కానీ, ఏం చేయడం? పద్మావతి ఇంట్లో లేదు, పొద్దున్నే లేచి ఎటో వెళ్ళింది. ఇల్లు ప్రశాంతంగా ఉంది. బంగార్రాజు ఆలోచించాడు. యుద్ధం చేసి లాభం లేదు. దాని తర్వాత వచ్చే పర్యవసానాలు అతనికి అనుకూలంగా ఉండవని ఇప్పటికే అనుభవం అయింది. అందువల్ల ఏదో ఒకటి చేసి ఆమెను లోబరచుకుని దార్లోకి తెచ్చుకోవాలి. అందుకోసం పెళ్ళయిన కొత్తల్లో ఆమె శృంగార తీవ్రతను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఒక కాంప్లెక్స్ కంప్యూటర్ ప్రోగ్రాముకి అల్గారిథమ్ రాసినంత శ్రద్ధగా ఒక ప్రణాళిక రచించాడు. తన ప్రణాళికను అంతే చాకచక్యంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ రోజు రాత్రి భోజనం చేస్తుండగా తాననుకున్నది మొదలుపెట్టాడు. కూతురితో కుర్చీ గురించి, అది ఎంత బాగుందో చెప్పాడు పద్మావతి వినేట్టుగా. ఆపైన, పెళ్ళయిన కొత్తల్లో చేసిన సైగలు, పంచుకున్న సంకేతాలూ అతని చేతల్లో మాటల్లో దొర్లాయి. కూతురికి ఏమాత్రం అర్థం కాకుండా భార్య కోసం అతను ఒక మార్మికమైన ఏకాభినయం చేశాడు.

ఆమె సింక్ దగ్గర నిలబడి గిన్నెలు కడుగుతున్నప్పుడు ఇతను పిల్లిలా నడుచుకుంటూ ఆమె వెనక నిల్చున్నాడు. ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. ఆమె ఎటూ పోలేక ఇబ్బందిగా మెలికలు తిరిగింది చేసే పని ఆపకుండానే. బంగార్రాజుకి ఇంకేం చేయాలో తోచలేదు. అతని తొందర అతన్ని కుదురుగా ఉండనీయటం లేదు. ఎవరో తరుముతున్నట్టుగా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆమె తీరుబడిగా ఒక్కొక్క పని ముగిస్తోంది. కావాలనే కాలయాపన చేస్తున్నట్టు ఆమె ప్రవర్తనలో తెలిసిపోతోంది. ముందు ఫ్లోర్ డ్రైయర్ ఆన్ చేసింది. తర్వాత అన్ని తలుపులూ కిటికీలకీ గొళ్ళాలు సరిచూస్తున్న చప్పుడు. ఇప్పుడు మెట్లు. అన్ని తలుపులూ వేసి చూసుకుని అలారం సిస్టమ్‌లో పాస్‌వర్డ్ నొక్కుతున్న బీప్ బీప్ శబ్దం. లైట్లు ఆఫ్ అయ్యాయి. అమ్మయ్య, ఇదిగో వచ్చేసింది.

ఆమె మెల్లగా తలుపు తీసింది. మామూలుగానే ఈరోజూ కాళ్ళకున్న పట్టీలు తీసి పెట్టలేదు. చప్పుడు కాకూడదన్నట్టు అడుగులో అడుగేసుకుంటూ నడుస్తోంది. బెడ్ దగ్గరకొస్తోంది. అతను తపించిపోతున్నాడు. అటు పక్కన పడుకుంది. అటు తిరిగి ఆమె టాప్ పట్టుకుని మెల్లగా లాగబోయాడు. ‘వద్దు, ఈ రోజొద్దు. మీకు కోపమొస్తుంది,’ అంది గొంతు పెంచి. అతను వినేలా లేడు. అతని ఉద్వేగం కట్టలు తెంచుకుంది. మొరటుగా టాప్ లాగాడు. బటన్లు ఊడిపోయాయి. అప్పుడామె అపురూపమైన వస్తువును కాచుకునేలా తన టాప్ కొసలను బిగించి కప్పుకుని అడ్డగించింది. అతను ఎల్లలు దాటేస్తున్నాడు, ఆవేశం తెచ్చుకుని బలం కొద్దీ లాగాడు. టాప్ ఊడిపోయింది.

ఆపైన కనిపించిన దృశ్యం బంగార్రాజును దిగ్భ్రాంతుణ్ణి చేసింది.

పద్మావతి రెండు రొమ్ముల మీద చైనావాడి డ్రాగన్‌లు రెండు పాకుతూ నోరు తెరుచుకుని మంటలు కక్కుతున్నాయి. ఒక పెన్సిల్ పట్టే సందైనా లేనంత దగ్గరగా ఉండే రొమ్ములు, ఇన్నాళ్ళు అవి తన కోసమే సృష్టించబడ్డాయనుకున్నవి, ఇప్పుడు ఎవడో ఊరూ పేరూ తెలియని ప్లాట్‌ఫార్మ్ చిత్రకారుడు పొడిచిన పచ్చబొట్టు బొమ్మల బరువు తాకిడికి అదురుతున్నాయి.

చీకటి గుహలో దాక్కుని ఉన్న మృగమొకటి వెనకనుండి దాడి చేసినట్టు అనిపించింది. బంగార్రాజు బలం కోల్పోయి నిస్త్రాణగా నేలమీదికొరిగాడు.

ఆమె మళ్ళీ చేతులతో టాప్ బిగించి కప్పుకుంది. పెదవి అంచుల్లో నవ్వొకటి విరిసి క్షణంలో మాయమయ్యింది. ఇతను చూడలేదు.

ఇదే వారిద్దరి చివరి యుద్ధం. ఇదే ఆమె చివరి విజయం. ఆమె ఆ కుర్చీ కొనలేదు. ఆ తర్వాతెప్పుడూ ఆ ఇంట్లో కుర్చీ కొనాలన్న ప్రస్తావన రాలేదు. అతనే ఇప్పుడు ఆ ఇంట్లో అయిదో కుర్చీ.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: ఎ. ముత్తులింగం,
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment