Friday, October 5, 2018

కవితాపానశాల మద్యం


కవితాపానశాల మద్యం

సాహితీమిత్రులారా!

ఉ.
కాలమహర్నిశంబనెడు కత్తెరతో భవదాయుదంబర
శ్రీల హరించు, మోముపయిజిల్కును దుమ్ముదుమార మేలకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవువోదు; వీ
రేలుబవళ్లు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్

చం.
గతము గతంబె యెన్నటికి కన్నులగట్టదు; సంశయాంధసం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవస్య భాగ్యమగు సంపద; రమ్ము విషాదపాత్రకీ
మతమునఁదావులేదు క్షణమాత్రవహింపుము పానపాత్రికన్
ఈ పద్యాలు ఏవో మారుమూల గ్రంథాల్లోంచి తెచ్చి ఉదాహరిస్తున్న పద్యాలు కావు. దాదాపు 70, 75 ఏళ్ల నించీ కవిత్వ ప్రియుల రసనాగ్రాన సంచారం చేస్తున్న పద్యాలే. రసజ్ఞులు పదింపదిగా మననం చేసుకునే పద్యాలే.

ఈ పద్యాల గురించి ప్రత్యేకంగా వివరించుకోవలసినది ఏమైనా ఉంటుందనుకోను. ఎందుకంటే పద్యాలు చదువుకుంటూ పోతుంటేనే అర్థం అవగతమైపోతుంది. భావం కోసమో ఏవైనా పదాల తెలివిడి కోసమో ఒక్క క్షణం కూడా నిలవాల్సిన అవసరంలేదు. దీర్ఘ సమాసాలేమీ లేవు. చిన్నచిన్న వాక్యాలతో ఒక మిత్రుడు పక్కన నిల్చుని విశేషాలు వివరిస్తున్నట్లు నిమ్మళమూ, అప్రతిబంధితమూ ఐన ధార. పదాలన్నీ చాలా సహజంగా వచ్చి ఛందస్సులో ఒదిగిపోయిన సౌలభ్యం. ఉదాత్తమైన ఊహలను అలతి పదాల్లో అలవోకగా వింగడిస్తున్న చతురిమ. ఈ ధోరణులన్నీ కలసి పద్యాలను పరమ సుందరంగా తీర్చిదిద్దినవని చెప్పుకుంటే చాలు.

‘నిన్న రాబోదు, ఎల్లి రాలేదు, ఉన్ననాడే నీది భాయీ’ అనే భావాన్ని బలంగా వినిపిస్తూ బ్రతికుండగానే హాయిగా బ్రతుకు, నిన్న ఇట్లయిందే, రేపు ఎల్లా ఉంటుందో అనే తలపులు మనసులోకి రానీయకు– అనే బోధనలు వినగానే, ఈ భావాలు ఉమర్‌ఖయ్యామ్‌వి కాక మరెవరివి అని ప్రతివారూ గుర్తిస్తారు. ఉమర్‌ఖయ్యామ్ అనగానే తెలుగు సాహిత్యానికి ఆయన్ను పరిచయం చేసిన దువ్వూరి రామిరెడ్డిగారు తటాలున మదిలో మెదులుతారు. అవును, పైన పేర్కొన్న కమ్మని పద్యాలు రచించి గానం చేసిన ‘కవి కోకిల’ దువ్వూరి రామిరెడ్డిగారే! వారి ఖయ్యామ్ రుబాయతుల ఖండకావ్యం పానశాల లోనివి అవి. చాలా మంది కవులకు చాలా సార్థకమైన బిరుదులున్నాయిగాని ‘కవికోకిల’ అనే బిరుదు రామిరెడ్డిగారికి అన్వర్థమైనంతగా మరే బిరుదూ మరే కవికీ శతశాతం సరిపోతుందనేది సందేహమే. ఎంత అద్భుతంగా పద్యాలు రాస్తారు ఆయన! లాలిత్యమూ ప్రౌఢిమా సౌందర్యమూ సరళతా గాంభీర్యమూ స్పష్టతా అలవోకతనమూ అన్నీ ఒకచోట – ఆధునికుల్లో – చూడదలచుకుంటే రామిరెడ్డిగారి పద్యాలే ప్రథమ గణ్యాలు.

ముందు కొద్దిగా ఖయ్యామ్ గురించి. పదకొండో శతాబ్దపు ద్వితీయార్ధభాగంలో జన్మించి, పన్నెండో శతాబ్దపు ప్రథమార్ధభాగంలో మరణించిన ఖయ్యామ్ పూర్ణాయుర్దాయ జీవి. ఈయన పారశీకములో తన కవితలను రుబాయత్ ఛందస్సులో వ్రాశాడు. 1859వ సంవత్సరంలో ఎడ్వర్డ్ ఫిడ్జరాల్డ్ అనే ఆంగ్ల కవి కొన్ని ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషులోకి అనువదించి ప్రకటించాడు గాని, వాటిని తొలుత జనం పట్టించుకోలేదు. ఆ మరుసటేడాది మరికొన్ని రుబాయీలను అనువదించి, అన్నిటినీ మరో సంపుటిగా తెచ్చిన తర్వాత ఆంగ్ల పాఠకులు ఎగబడి ఖయ్యామ్‌ను సొంతం చేసుకున్నారు. దరిమిలా చాలామంది ఆంగ్లీకరణం కావించారు గాని, ఫిట్జరాల్డును చదివిన పాఠకులు మరెవరినీ మన్నించలేదు.

ఖయ్యామ్ రుబాయతుల అందాన్ని పారశీకంలోనూ, ఫిట్జరాల్డు భాషాంతరీకరించిన ఆంగ్లంలోనూ చూచి ముగ్ధులైన తెలుగు కవులు అనేకులు ఆయా భాషల మాధ్యమం ద్వారా తెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. పద్య కావ్యాలుగా తీసుకొచ్చారు. వారిలో కొందరు లబ్ధప్రతిష్ఠులూ, కొందరు ఔత్సాహికులూ. అవీ బాగానే వున్నాయి కాని దువ్వూరివారి పద్యాలను ఆప్యాయంగా అక్కునజేర్చుకున్న తెలుగు పాఠకజనం ఇతరుల పద్యాలను అంతగా ఆదరించలేదు. అబ్బూరి వరదరాజేశ్వరరావుగారైతే (వారేనని గుర్తు) రామిరెడ్డిగారి పానశాల వచ్చింతర్వాత ఇతరులు ఖయ్యామ్ జోలికి ఎందుకుపోతారో అని ఆశ్చర్యపోయారు. అలాంటి అభిప్రాయం ఎవరు వెలిబుచ్చినా అది పానశాల ఎడ ఉండే గౌరవభావం వల్లనే కాని, కవిత్వం వచ్చినవారు అందమైన పరభాషా కావ్యాన్ని తెలుగులోనికి తెద్దామనుకోవడం చాలా సహజమూ, ఆహ్వాన యోగ్యమూ అనేది అందరూ ఒప్పుకుంటారు. పైగా ఫలానివారు వ్రాశారు గదా, మీరెందుకు మళ్లీ వ్రాయడం అని ఆంక్ష పెట్టడం సమంజసం కాదు గూడా. కొన్ని కొన్ని రచనలకు అలాంటి పేరు వస్తుంది. ఏనుగు లక్ష్మణ కవి భర్తృహరిని అనువదించిన తర్వాత ఆ ప్రయత్నానికి పూనుకొన్న ఇతరుల కృషికి ఆదిలోనే పెదవి విరిచినవారు ఎందరో! ఇటీవల ఖయ్యామ్ మీద చేయి చేసుకున్నవారిలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఒకరు. వారు అమర్ ఖయ్యామ్ పేర అనువదించిన కావ్యమూ బాగా ప్రజాదరణ పొందింది. ఆ పద్యాలన్నీ పాపయ్యశాస్త్రిగారి సహజ లాలిత్యంతో బాగుంటాయి.

ఖయ్యామ్‌ను మన వేమనతో కొంతవరకూ పోల్చుకోవచ్చు. వేమన కొంతకాలం రక్తిలో ఉండి విరక్తిలోకి వస్తే ఖయ్యామ్ మాత్రం పూర్తిగా రక్తికే అంకితమైనాడు. ఆయన జీవితపు నశ్వరత్వాన్ని గురించి చెప్పినా, విరక్తుడు మాత్రం కాదు. వేమన దేవుడినీ ఆయన పేరుతో జరిగే ఆచారాలనూ కూడా నిరసించాడు. ‘తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా’ అనీ ‘పాల సంద్రము మీద పవ్వళించినవాడు గొల్ల యిండ్ల పాలు కోరనేల – ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి’ అంటూ దేవుణ్ణి అపహసించాడు గాని ఖయ్యామ్ నాస్తికుడు కాడు. ‘సృష్టికాద్యంతములు నీవె స్రష్ట నీవె, పాల ముంచ నీటను ముంచ ప్రభువు వీవె’ అని అంటాడుగాని దేవునితో నాకేమి నిమిత్తం అనే భావాలూ చాలా చోట్ల వెలిబుచ్చాడు. ‘రెండు దినములకొకతూరి ఎండురొట్టె బోసిముంతెడు చలినీళ్లు పుట్టెనేని ఏల నిను బోలువానికి కేలుమోడ్చ’ అంటాడు. దేవుని అస్తిత్వాన్ని అంగీకరించినా ఆయన పేరుతో జరిగే నమాజులూ పూజాదికాలను నిరసించాడు. ‘దేవ! నీవు లేని గుడిని ప్రార్థించుకంటె పానశాలను సత్యమ్ము పలుక మేలు’ అంటాడు. ప్రార్థన అంటే అసత్యమైనట్లు ఆయన మసీదుకు పోయేది నమాజు కోసం కాదు. ఈ పద్యం చూడండి.

మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతవై
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ. నె
మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపఁగ రాను; నీవు చ
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులువోలె నమాజుసైతమున్.

నమాజుతో నెమ్మనము చెడుతుందట! చిత్రం.

ఇంకో తమాషా భావం, ఇదుగో చూడండి. ‘ఎవ్వరున్ పాపము సేయకున్న తన మన్నన ఎందుకు?’ అని దేవుని ప్రశ్నిస్తాడు. అంతేకాదు, ‘నీ బిరుదున్నిల్పుటకే నొనర్చితిని నిర్భీతిన్ సమస్తాఘముల్ – నరకంబంటక యున్న వీలగునె పశ్చాత్తాపముం బొందగన్’– ఇదీ ఖయ్యామ్ ధోరణి.

రామిరెడ్డిగారి పానశాల అనువాదమే అయినా భావానువాదమే కాని ముక్కస్యముక్కానువాదం కాదు. ఆయన స్వతంత్ర కావ్యాలు గూడా వ్రాశాడు. అవీ చాలా గొప్పగా ఉంటాయి. కృషీవలుడు, నలజారమ్మ, ఆయన స్వతంత్ర కావ్యాలు. ఏమైనా రామిరెడ్డి అనగానే తటాలున పానశాల గుర్తొచ్చేది నిజమే కాని, ఒక్క నిమిషం ఆగిన పిమ్మట ఆయన ఇతర కృతులనూ గుర్తుచేసుకుంటాడు తెలుగువాడు.

రామిరెడ్డిగారు ఖయ్యామ్ రుబాయీలను పారశీకం నుంచే అనువదించారు. దానికోసం పారశీ భాషను స్వయంకృషితో నేర్చుకుని నిష్ణాతుడై అనువాదానికి పూనుకున్నాడు. అదీ ఆయన అంతస్సత్వం. ఖయ్యామ్ రుబాయీల మౌలిక సౌందర్యాన్ని తెలుగులోకి దించేశాడు. ‘బహరాము, బాగ్దాదు, బల్ఖ, వజీరు, మునాది, గోరి, కౌసరు’ లాంటి పదాలు అనువాద సందర్భం కోసం వాడాడుగాని, ఆ పదాలే లేకుంటే పానశాలను ఎవరూ అనువాద కావ్యం అనుకోరు. పారశీక వాతావరణాన్ని తెలుగుదేశంలో ప్రతిష్ఠించడానికి తెలుగు తీపినీ, తెలుగు పద్యానికి పార్శీ శృంగార సౌందర్యాన్నీ అద్దారు.

కేవలం ద్రాక్షాసవపు గిండి మాత్రమే అయితే అది అసంపూర్ణమే. ఆ చషకాన్ని సాకీ ఒయ్యారంగా అందిస్తుంటేనే సందర్భానికి సార్థకత- ‘రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురపు విడెమ్ము’లాగా. అయితే అక్కడ రమణికీ స్వీకర్తకూ మధ్య ప్రియ దూతిక వుంది గాని, సాకీ స్వయంగానే రమణిలాంటిది. దూతిక కాదు. ఖయ్యామ్ ‘మదిరాతపస్వి’ మరి.

శృంగారానికి సంబంధించినంతవరకూ పారశీక కవి చూపులూ, సౌందర్యాన్వేషణా వనిత ముఖం దాటి ఈవలకు రాలేదు. ముద్దు ముంగురులు, బిత్తరి కన్బొమలు, తేమ రాగిల్లిన రాగవతీ కపోలములు, చెలియ నిగారపుం దళుకు చెక్కులనేలిన పుట్టుమచ్చ, సరసాస్యబింబము- ఇంతవరకే. మన తెలుగు సంస్కృత కవులైతే- వారి ఊహలు సుందరి మెడమీది నుంచి పయోధరాల మీదికి దూకి, నూగారు మీది నుంచి జారి పొక్కిలి దాకా ప్రయాణిస్తాయి అనేది మనం ఎరిగిందే. రామిరెడ్డిగారు సీరియస్‌గానే అన్నారో చమత్కరించారోగాని పార్శీ యువతులు గాగ్రాలూ, కుర్తీలూ ధరించడం అందుకు కారణం కాబోలు అన్నారు!

పానశాలలోని చాలా పద్యాలు సాహితీ మిత్రుల సంభాషణల్లో ఉటంకింపబడుతూవుంటాయి. చాలా పద్యాలు రసికుల నాలుకల మీద నర్తిస్తుంటాయి. సహృదయ పాఠకుల పిపఠిషను ఎగదొసేందుకు కొన్ని ఉదహరిస్తాను, చిత్తగించండి.

అయయో! ఎందఱి మానవోత్తముల కంఠాకూరముల్ ద్రెంచె నిర్దయమౌ కాలము!
నీవూనేనను తారతమ్యమిహమందేగాని, భూగర్భ రత్నావాసంబున లేదు
పారదమట్లు జీవితము పట్టిన నిల్వదు శీఘ్రగామి
వాదులుమాని నా సరసవారుణినానుము, దానితో మహమ్మూదు సమస్త రాజ్యరమ బోలదు
అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల, విశ్రాంతి గృహంబు, అందునిరుసంజలు రంగుల వాకిళుల్
మానవులైన వారెపుడొ మ్రందుట నిశ్చితమౌట బాగదాదైనను, బల్ఖయైన సమమౌను
జీవిత సార్థవాహము విచిత్రగతింబయనించు నందులో నీవొక ఱెప్పపాటయిన నెయ్యరతో సుఖముందువేని మోదావహమంతకన్నగలదా
పరమొ, గిరమ్మొ, దాని తలపైనొక దోసెడు మన్ను చల్లి సుందరి మెరుగుం గపోలముల దాచిన ముద్దులు దొంగిలించి
ఇల చదరంగ, మందు జనులెల్లరు పావుల, హస్సులున్నిశల్ తెలుపును నల్పుగళ్ళు కదిలించును రాజును బంటు దక్కు పావుల విధియాటకాడు
పైన ఉదాహరించిన పద్యపాదాల తొలిపాదాలంత హార్దికంగా మలిపాదాలూ ఉంటాయి. అన్ని పద్యాలనూ పూర్తిగా ఇవ్వటం ఒక కేటలాగును చేర్చడమే అవుతుంది గనకా ‘గ్రంథ విస్తర భీతి’తోనూ కుదించాను. సహృదయ పాఠకులు అర్థంచేసుకోగలరు.

ఖయ్యామ్ తొంబది ఏళ్ళు పైనే జీవించినట్లున్నాడు. ఆయన జీవితపు ద్వితీయార్ధం అంత సుఖంగా సాగినట్లు లేదు. అయినా తన ముదిమిని ఆసవపానంతో ‘లేతగించు’కున్నాడు. అందుకే ఆయన కవితలు లేబ్రాయపు మార్దవంతో ఉంటాయి. రెడ్డిగారి భాషాంతరీకరణం ఇంకా నునులేత.

రామిరెడ్డిగారు తన యాభైయవ ఏటనే మరణించారు. అదేమంత పెద్ద వయస్సు కాదు. కావ్యాలేగాక కొన్ని పద్య ఖండికలూ ఆయన వ్రాశాడు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మరణించాడు. ఆయన వ్రాసిన స్వాతంత్ర్య రథము అనే ఖండిక, మరికొన్ని పద్యాలూ, కొన్ని ముత్యాలసరాలూ సామినేని ముద్దుకృష్ణ సంకలించిన వైతాళికులులో చోటుచేసుకున్నాయి.

రెడ్డిగారు ఖయ్యామ్‌ను సంబోధిస్తూ క్రింది పద్యం చెప్పారు.

పారసికన్న శ్రావ్యమయి, పల్లవ కోమలమై సుధారసం
బూరెడు మా తెనుంగు నుడి నొప్పిద మౌనటు, నీదు భావముల్
ఏరిచి చేర్చికూరిచితి నింపగు కావ్యము నో ఖయామ! నీ
పేరిక యావదాంధ్ర పృథివీస్థలి శాశ్వతమై తనర్చుతన్.

కవిగారి ఆశంస పూర్తిగా నెరవేరినట్లే. ఐనా నిజాన్ని సగమే చెప్పాడు వినయం మూలకంగా. ఖయ్యామ్‌తోపాటు దువ్వూరి రామిరెడ్డిగారి యశస్సు కూడా యావదాంధ్ర పృథివీస్థలిలో చిరస్థాయి అయిందనే రెండో సగం నిజాన్ని కూడా ఆహ్లాదంగా చెప్పుకుని, పానశాల పద్యాలను మళ్ళీమళ్ళీ మననం చేసుకుందాం.
-----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment