Saturday, March 17, 2018

జలధివిలోల వీచి విలసత్కల


జలధివిలోల వీచి విలసత్కల



సాహితీమిత్రులారా!



యయాతి చరిత్ర
శ్రీమదాంధ్రమహాభారతం
ఆదిపర్వం తృతీయాశ్వాసంలో ఉంది.
దీనిలో శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి
వృషపర్వుడనే దానవరాజు కుమార్తె
శర్మిష్ఠకు జరిగిన వివాదంలో దేవయానిని
శర్మిష్ఠ బావిలో త్రోసివేసి వెళ్ళింది.
అక్కడకు వేటకై వచ్చిన యయాతి
దాహంతో బావిలోని నీరు త్రాటానికి
ఆ ప్రాంతం వచ్చి బావిలో చూడగా
అక్కడ దేవయాని బావిలో కనిపించింది.
అప్పుడు యయాతి దేవయానిని
బావినుండి బయటకులాగిన సందర్బములోని
పద్యాలు గమనిద్దాం-

బావిలోని దేవయానిని ఎవరివి నీవు
ఈ బావిలో ఎలా పడ్డావని అడగ్గా
అంతకుమునుపు వేటకు వచ్చిన సమయంలో
యయాతిని చూచి వున్నందున తనగురించి ఇలా చెప్పింది-

అమరసన్నిభ యేను ఘోర సురాసురావహభూమి న
య్యమరవీరులచేత మర్దితులైన దానవులన్ గత
భ్రములఁగా దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య
త్యమిత శక్తి మెయిన్ వెలింగిన యట్టి భార్గవు కూతురన్

(దేవతలతో సమానుడైన యయాతీ నేను భయంకరమైన
దేవాసుర సంగ్రామమున వీరులైన దేవతలచే చంపబడిన
రాక్షసులను తన మృతసంజీవనీ విద్యతో మళ్ళీ బ్రతికించే
గొప్ప శక్తితో ప్రకాశించే శుక్రాచార్యుని కుమార్తెను)

దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతంబడి వెలువడ
నేరకున్న దానను నన్నుద్ధరించి రక్షింపుమనిన నవ్విప్రకన్యక
యందుఁదద్దయు దయాళుండై

(నేను దేవయాని అనే పేరు గలదాన్ని. ఏమరుపాటున ఈ
నూతిలోపడి పైకి రాలేకున్నాను నన్ను పైకితీసి రక్షించుమని
పలుకగా ఆ బ్రాహ్మణకన్య అయిన దేవయాని ఎడల మిక్కిలి దయగలవాడై.)

జలధివలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీ
తలవహన క్షమంబయిన దక్షిణహస్తమునం దదున్నమ
ద్గళదురు ఘర్మవారి కణకమ్రకరాబ్జమువట్టి నూతిలో
వెలువడఁ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్

(ప్రసిద్ధికెక్కిన కీర్తికలవాడగు యయాతి సముద్రమందలి చలించు
అలల ప్రకాశముయొక్క లావణ్యముకల మొలనూలుతో ఒప్పుచున్న
భూతలమును భరించుటకు యుక్తమైన తనయొక్క కుడిచేతితో
దేవయానియొక్క పైకెత్తబడినదియు స్రవించు పెద్ద చెమటనీటి బిందువులతో మనోహరమైనదియు అయిన హస్తపద్మమును పట్టి నూతిలోనుండి వెలికి వచ్చునట్లు సంతోషముతో లాగెను.)

No comments:

Post a Comment