Wednesday, March 28, 2018

వసంతాన్వేషణ


వసంతాన్వేషణ



సాహితీమిత్రులారా!



"దాశరథి"గారి "జ్వాలాలేఖి"ని
నుండి ఈ కవిత చూడండి-


వసంతం వచ్చేసిందని ప్రకటించేశారు;
వసంతానికి స్వాగతం చెప్పటానికి ఎదురేగాను

వనాంతాలకు వచ్చిందని అటు వెళ్ళాను
వనాలు నరికిపారేశారు, జనాలు బసచేశారు!

వసంతం, కవుల కవితల్లోనైనా వుంటుందనుకున్నాను
ప్రళయార్భటులు, ప్రభంజనాలు దర్శించుకున్నాను!

విషాదాంత వివాదాంత రచనలు 
విప్పితే పత్రికా ప్రపంచంలో కోకొల్లలు!

ఇంతకీ, వచ్చింది, వచ్చింది అన్న వసంతం యెటుపోయినట్లు?
గొంతెత్తి తీయతీయగా కోయిలలు యెక్కడ పాడినట్లు?

మండిపోయే ఈ యెండల్లో  వసంత సుకుమారి 
గుండె పగిలి మండి మసిబొగ్గయిపోయిందా మరి?

కాళిదాస రుతుసంహారంలోని కమనీయ వసంతం 
కాలం మార్పుకి భయపడి రావడం మానేసిందేమో! పాపం!

వనితా హృదయాల్లో వసంతంకోసం గవేషించాను
ప్రణయానికి బదులు ప్రళయాన్నే సాక్షాత్కరించుకున్నాను

అభినవ్య చిత్రకారుడి చిత్రాల్లో అన్వేషించుకున్నాను
అయోమయ వికృతరూపాలు చూసి భయపడ్డాను

నవగాయకుడి గళంలో ప్రశాంత వసంతరాగం వెదికాను
నన్ను జడిపించే హాలాహల కోలాహలరాగం విన్నాను!

మండిపోయే గుండెలతో మహీమండలం అంతా గాలించాను
మోడుపడిన లోకంలో నలుమూలలా సంచరించాను

ఆఖరుకి యెవరికీ పట్టని పంచాంగం విప్పిచూచాను
అదుగో! "వైశాఖమాసః వసంతరుతుః" అని చదివాను

పంచాంగంలో దాక్కున్న వసంత రుతువును
పంచమ ప్రాణంగా లాక్కుని గుండెల్లో దాచుకున్నాను!

No comments:

Post a Comment