యజ్ఞవరాహావతార వర్ణన
సాహితీమిత్రులారా!
"పోతన" కృత "శ్రీమదాంధ్రమహాభాగవతం"
లోని తృతీయస్కంధంలో శ్రీయజ్ఞవరాహ
అవతార వర్ణన వుంది. దానిలోని కొన్ని
పద్యాలను ఇక్కడ చూద్దాం-
సృష్టివిషయమై బ్రహ్మదేవుడు శ్రీహరిని తలంచగానే
ఆయన నాసికా రంధ్రం నుండి ఎదుట అంగుష్ఠ
మాత్రంతో పుట్టి అప్పటికప్పుడే పెద్ద ఏనుగంత
స్వరూపంతో నిలబడ్డాడు శ్రీయజ్ఞవరాహమూర్తి.
నామనసులో ఉన్న విచారాన్ని పోగొట్టటానికి
యజ్ఞవరాహరూపంలో శ్రీమహావిష్ణువు ఈ విధంగా
పుట్టడం చాల చిత్రంగా ఉందని బ్రహ్మ వితర్కించు
సమయంలో
ప్రళయ జీమూత సంఘాత భయద భూరి
గర్జనాటోపభిన్నదిగ్ఘన గభీర
రావ మడరింప నపుడు రాజీవభవుఁడు
మునులు నానందమును బొంది రనఘచరిత
(యజ్ఞవరాహమూర్తి చేసిన గుర గుర మనే గర్జన
ప్రళయకాలంనాటి మేఘంసమూహం చేసే ఉరుములాగా
దిక్కులను పిక్కటిల్లేట్లు చేసింది. ఆ శబ్దం విని బ్రహ్మ
మరియు అక్కడ మూగిన యతీశ్వరులు ఆనందించారు.)
కఠినసటాచ్ఛటోత్కట జాతవాత ని
ర్ధూత జీమూత సంఘాతముగను
క్షురనిభ సునిసిత ఖురపుటాహతచల
త్ఫణిరాజ దిగ్గజ ప్రచయముగను
జండదంష్ట్రోత్థ వైశ్వాన రార్చి స్స్రవ
ద్రజత హేమాద్రి విస్రంభముగను
ఘోర గంభీర ఘుర్ఘుర భూరి నిస్వన
పంకిలాఖిలవార్ధి సంకులముగఁ
బొరలు గెరలు నటించు నంబరము దెరల/దెసల
రొప్పు నుప్పర మెగయును గొప్పరించు
ముట్టె బిగియించు ముసముస మూరుకొనుచు
నడరు సంరక్షితక్షోణి యజ్ఞ ఘోణి
(భూమిని ఉద్ధరించటాని ఉద్భవించిన వరాహమూర్తి
సంరంభం ఇలావుంది. అది తనజూలును విదల్చినపుడు
ఏర్పడిన పెద్దగాలికి మబ్బులన్నీ చెల్లాచెదరయ్యాయి.
చురకత్తులవలె వాడియైన కాలిగిట్టలు సోకి ఆదిశేషుడు మరియు
దిగ్గజాలు వణికిపోయాయి. దాని తీక్ష్ణమైన కోరలనుండి ఎగసిన
మంటలకు వెండికొండ బంగారుకొండ కరిగిపోయాయి. అతి
భయంకరమైన దాని ఘురఘురల అరుపులకు
సప్తసముద్రాలనీరు ఇంకి బురదయింది. అది అటు
ఇటు భూమిపై పొర్లుతూ, ఎగసి చిందులేస్తూ, నింగి
బద్దలయేట్లు శబ్దిస్తూ, ఆకాశ మంత ఎత్తు ఎగిరిదూకుతూ,
కోపంతో మూతి బిగిస్తూ, చిరచిర లాడుతూ అతిశయించింది.)
మఱియు నయ్యజ్ఞవరాహంబు,
(ఇంకా ఆ వరాహం చేష్టలిలా వున్నాయి.)
తివిరి చతుర్దశభువనంబులను దొంతు
లొరగఁ గొమ్ములఁ జిమ్ము నొక్కమాటు
పుత్తడికొండ మూఁపురమను నొరగంట
నుఱుముగా రాపాడు నొక్కమాటు
ఖురముల సప్తసాగరముల రొంపిగా
నుంకించి మట్టాఁడు నొక్కమాటు
నాభీల వాల వాతాహతిచే మింటి
నొరసి బ్రద్దలుసేయు నొక్కమాటు
గన్నుఁగోనల విస్ఫులింగములు సెదర
నురుభయంకరగతిఁదోచు నొక్కమాటు
పరమయోగీంద్రజనసేవ్య భవ్య విభవ
యోగ్యమై గానఁగా నగు నొక్కమాటు
(ఆ వరాహం తన కొమ్ములతో పదునాల్గు లోకాలను
వరుసగా కుప్పకూలి పడునట్లు చిమ్ముతుంది.
కనకాద్రిని తన రొమ్ముతో కుమ్ముతుంది.
ఏడు సముద్రాల్ని తన గిట్టలతో రొంపి చేసి
దాని పై విజృంభించి తిరిగింది.
తన తోకతో విసరిన గాలితాకిడి చేత
ఆకాశాన్ని బద్దలు చేస్తుంది. కన్నుల్లో
నిప్పులు కరిపిస్తూ భీకరంగా కనిపిస్తుంది.
ఒక్కొక్క పర్యాయం మహర్షులు భక్తితో
సేవలందించటానికి అనువైన ఆకారంతో
సాక్షాత్కరిస్తుంది.)
No comments:
Post a Comment