పురాణాలంటే ఏమిటి దాన్లో ఏముంటాయి
సాహితీమిత్రులారా!
పురాణం అంటే ప్రాచీన కథాగుచ్ఛం అనే అర్థం స్ఫురిస్తుంది.
వేదవాఙ్మయంలోో ఇతిహాసం, ఆఖ్యానం మొదలైన శబ్దాలతోపాటు
పురాణశబ్దం కూడ కనిపిస్తుంది. ప్రపంచోత్పత్తి, వీరుల, ఋషుల
జీవితాలు మొదలైన వృత్తాంతాలు వేదయుగంలోనే రచించి ఉండవచ్చు.
వాటికే పురాణాలని పేరు. సాధారణంగా వాటిని రచించినవారి పేర్లు తెలియవు.
హరివంశంలో పురాణాల సంఖ్య గురించిన ప్రస్తావన ఉంది. గౌతమ, ఆపస్తంబుల
ధర్మశాస్త్రాలు (క్రీ.పూ.500) కూడా పురాణాలను పేరొంటున్నాయి. పురాణాల
కాలం ఇది అని తేల్చడానికి వీలు లేదు. వీటిలో అతిప్రాచీనమై
నవి, ప్రాచీనము కాని కూడ ఉన్నాయి. రాజవంశాలను వివరించే
పురాణాలలో హర్షుడు మొదలైన వారి వంశవివరణం లేనందువల్ల
పురాణాలు క్రీ.పూ. 500 సంవత్సరాలకు పూర్వమే వ్రాయబడినట్లు
విమర్శకుల అభిప్రాయం.
పురాణాలలో సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశావతారవర్ణన
అనే అయిదు లక్షణాలు అన్నిటిలో కనిపించటం
వల్ల వీటికి పంచలక్షణాలు అనే పేరు వచ్చింది. వేదాల్లో చెప్పబడిన
నీతి ధర్మతత్త్వాది విషయాలను పురాణాలు కథలు, ఉపాఖ్యానాల
ద్వారా వివరిస్తున్నాయి. లాక్షిణికులు వీటిని మిత్ర సమ్మతములుగా
పరిగణించారు. చారిత్రకంగా కూడా పురాణాలకు ప్రాముఖ్యత ఉంది.
వీటిలో శుంగ, నంద, మౌర్య, గుప్త, ఆంధ్ర మొదలైన రాజవంశా చరిత్రలు
సమగ్రంగా ఉన్నాయి. విమర్శ దృష్టితో వీటిని కొంచెం సవరించి చూస్తే
ఇవి చారిత్రక వృత్తాంతాలతో కూడ సరిపోతున్నాయి. 18 మహాపురాణాలను,
18 ఉపపురాణాలను వ్యాసుడే రచించాడని ప్రతీతి. కానీ వ్యాసుడు
ఒక్క బ్రహ్మపురాణం మాత్రమే వ్రాశాడని, మగిలినవి అతని శిష్యులు
రచించారనీ మరొక అభిప్రాయం. వ్యాసునికి ముందే పురాణాలున్నాయని
వాటి సారాంశం వివరించి వాటికి ప్రచారం కలిగించాడని మరొక అభిప్రాయం.
No comments:
Post a Comment