Monday, March 19, 2018

హృదయ కోకిల


హృదయ కోకిల




సాహితీమిత్రులారా!

దాశరథి కృష్ణమాచార్యులవారి
జ్వాలాలేఖిని నుండి ఈ కవిత
చూడండి-

నవ వసంతోదయానంద సమయంలో
నా హృదయ కోకిల పలికే  గీతంలో
నిస్సహాయులలోని నిరాశను పోగొట్టే
నిస్సీమ శక్తిని కోరుకొంటున్నాను

అవని అనే ఆమ్రశాఖపై చిగిర్చిన
అతి కోమల మానవతా పల్లవాలు ఆరగించి
ప్రశాంత రాగాలాపనలతో ప్రజాళిని
పరవశింపజేసే శక్తిని కోరుకుంటున్నాను

నిరాశా మహాగ్ని తోరణ మాలికలతో 
నిరంతరం భీతిల్లజేసే ఈ ప్రపంచంలో
ఆశా వసంత వనాంత పవనాల వీచికలను
అవనికి అంచిగల శక్తిని కోరుకుంటున్నాను

అన్నమో రామచంద్రా! అనే మనిషి లేనినాడు
అసలైన ఉగాది ఆనంద రథంమీద వస్తుంది
ఆ నవరథ సారథినై  ప్రజాపథాల మీద
అనుగమించగల శక్తిని కోరుకుంటున్నాను

పండుగనాడు గుండె మంటలను మరచి 
ప్రజావళి సంతోషాతిరేకంతో
తరతమ భేదాలు విడిచి జీవించ గల 
తరణ సామ్యవాద సాధనశక్తిని కోరుకుంటున్నాను

నవ హృదయ కోకిలాగళం పలికే శబ్దం
చెవిని పడగానే పరుగెత్తుకొని వస్తుంది నవాబ్దం
అనంతకాలంలో అవనిలో వసంతాన్ని ఆపి ఉంచగల
ఆ ఉగాదిని తేగల శక్తిని కోరుకొంటున్నాను

No comments:

Post a Comment