Tuesday, March 6, 2018

బాలచంద్రుని వీరవాక్కులు


బాలచంద్రుని వీరవాక్కులు




సాహితీమిత్రులారా!





"పలనాటి వీరచరిత్ర"లో బ్రహ్మనాయుని
కుమారుడు బాలచంద్రుడు నాయకురాలు
నాగమ్మ మంత్రాంగంతో అన్నదమ్ముల మధ్య
వైరం పెరిగి చివరికి భారత యుద్ధంలో వలెనే
యుద్ధం ఆరంభమైంది అందులో పాల్గొనటానికి
ప్రయాణమైన బాలచంద్రుని నీవు పసివానివి
యుద్ధానికి పోవద్దని వారించినారు వీరులు
వారిని చూచి చెప్పిన వాక్యాలను
శ్రీనాథ మహాకవి "పలనాటివీరచరిత్ర"లో
బాలచంద్రుని నోట పలికించిన వాక్యాలు
ఇక్కడ చూడండి -
(ఇది ద్విపదలో వ్రాయబడిన కావ్యం)

"బాలుఁడీతండని పలుకఁగ రాదు
నాపూర్వమంత విన్నప మొనరింతు
వీరనాయకులారా; విఖ్యాతులార!
వినుఁడు చెవుల నొగ్గి విశదముగాఁగ
నురుతరనగర మయోధ్యఁ బాలించి
చనినట్టి యా హరిశ్చంద్ర భూపతికిఁ
జంద్రమతికి నేను జనియించి మించి
లోహితాస్యుఁడనైతి లోకము లెఱుఁగ
నాఁడు బాలుఁడగానె నాయకులార;
కిష్కింధ నేలెడు కీశాధిపతికిఁ
దార కంగదుండనై ధరబుట్టునాఁడ
రామచోదితుఁడనై రావణుకడకు
రాయబారిగా నేఁగి, రక్షసుల్ గ్రమ్మ
వారిని ఖండించి వడి చూపినాఁడ
నాఁడు బాలుఁగానె నాయకులార;
రఘువంశమందున రామచంద్రునకుఁ
గుశుఁడనై పుట్టితి గురుశూరుఁడైతి
నాఁడు బాలుడఁగాదె నాయకులార;
పాండు భూవరునకుఁ బౌత్రుఁడనగుచు
నభిమన్యుఁడనుపేర నవని జన్మించి
వీర ధర్మము చూపి వెలసి వాఁడ
నాఁడు బాలుడఁగానె నాయకులార;
ఇటువంటి జన్మంబు లెన్నియొ కలవు
చెప్పశక్యముగాదు చెన్నునియాన
ప్రతిజన్మమందైన ప్రౌఢవిక్రమము
శ్రీపురాణంబులు చెప్పుచునుండు
గలియుగంబున నిప్డు కడసారి నేను
కుంతాలవారింట గూరిమిమీఱ
బ్రహ్మనాయనికినిఁ బడఁతి యైతమకు
బాలునిపేరిటఁ బల్నాటిలోన
జనన మొందినవాఁడ సమరశూరుండఁ
బేరె బాలుఁడుగాని బిరుదు మగండఁ
బగవారిఁ గొట్టని బ్రదుకదియేల!
తలిదండ్రులను బ్రోవఁ దనయుండె కర్త
మానాభిమానముల్ మగటిమిమించఁ
బ్రబలింపఁ గలవారు బాలురె సుమ్ము
బాలురె పెద్దలు; బల్లిదుల్ వారు
బాలురకే వృద్ధి పరికించి చూడఁ
బెద్దలు మతిచెడి పిరికిపాఱుదురు
పాంచ భౌతిక దేహపటిమ క్షీణించు
మనసు చలించును మాటిమాటికిని
ధైర్యంబు తగ్గు నుత్సాహంబు లుడుగు
వయసు మీఱినవేళ వచ్చునా; బలిమి?
కీర్తి కైనను నపకీర్తికినైన
బాలురపైనుండు భారమంతయును
మైలమకాముని మడియంగఁ జేసి
నాయకురాలిని నయహీనఁజేసి
పరదళంబులఁ జంపి పంతంబు తీర్తుఁ
బడుదును రణభూమిఁ బవరంబుచేసి
చూచి యాస్వర్గంబు చూఱలుగొందు."

ఈ విధంగా వారిని ఒప్పింప
ప్రయత్నించినాడు బాలచంద్రుడు.

(ఉరుతరము - మిక్కిలిగొప్పది, దుర్ఘట చేష్టలు - గొప్పపనులు,
కీశ - అధిపతి - వానరులకు రాజు(వాలి), తార - వాలి భార్య,
చోదితుడు - ప్రేరేపింపబడినవాడు, ప్రౌఢవిక్రమము - గొప్ప పరాక్రమము, సమరశూరుడు - యుద్ధవీరుడు, బిరుదుమగఁడు - మేటివీరుడు, మానాభిమానములు - గౌరవము, పరువు,
మగటిమి - శౌర్యము, బల్లిదులు - బలవంతులు, నయహీన - నీటిమాలినది,  పరదళంబులులన్ - శత్రుసేనలను, బవరంబు - యుద్ధం, చూఱలుగొనుట - కొల్లగొట్టుట(వశపఱచుకొనుట))

No comments:

Post a Comment