Monday, March 5, 2018

శల్యసారథ్యం


శల్యసారథ్యం



సాహితీమిత్రులారా!

భారతంలో శల్యుని పేరు వస్తుంది.
పాండురాజు రెండవ భార్య మాద్రికి
సోదరుడు. దుర్యోధనుని మాయోపాయంలో
పడి కురుక్షేత్రయుద్ధంలో కొరవులవైపు
చేరతాడు. తరువాత విషయం అర్థమై
బాధతో ధర్మరాజుతో జరిగిన వృత్తాంతమంతా
చెబితే ధర్మరాజు మామా మీరు కౌరవులవైపే
ఉండి మాకు చేయగల సాయం చేయమంటాడు.
అదేమిటంటే కర్ణునికి సారథిగా నిన్ను నియోగిస్తారు
అప్పుడు కర్ణునికి యుద్ధంలో నిరుత్సాకరంగా మాట్లాడి
యుద్ధంలో బలహీన పరచమంటాడు. దానివల్లనే
శల్యుడు కర్ణునికి సారథ్యం వహించినపుడు నిరుత్సాహ
కరంగా మాట్లాడి బలహీన పరుస్తాడు. ఇదే లోకంలో
అనుకూలంగా ఉంటూ ఇబ్బంది పెట్టే సందర్భంలో
శల్యసారథ్యం పదాన్ని వాడటం పరిపాటయింది.
ఇక్కడ మనం మన జాషువాగారి ఖండకావ్యం నుండి
శల్యసారథ్యం పద్యాలను గమనిద్దాం-

అహిమస్తకములకు లొయ్యారంబు నేర్పించు
             వలపుఁ బిల్లనఁగ్రోవి పాటగాఁడు
పసితనంబునయందుఁ బడగపాముల నెక్కి
             చిందులాడిన గొల్ల చిన్నవాఁడు
పదియారు వేల గోపస్త్రీలతో నుండి
             యపకీర్తి నందని యందగాఁడు
లోకాంతమున మఱ్ఱియాకుఁ దెప్పం దేలి
             తలదాచుకొన్న చిత్రస్వరూపి
భాసురమున తన చారఁడేసి కనుల
మచ్చుఁజల్లెడు వేలుపు మాంత్రికుండు
తొడరి విజయుని యరదంబుఁ దోలుచుండె
కాంచి విల్లందుకొనుము భాస్కర కుమార!

ములుకులు నీ ధనుస్సును విముక్తములై చని కృష్ణమూర్తికిన్
వలఁగొని యావల న్నరునిపైఁ గసిబూనుట దుస్తరంబుగా
దలఁప విదేటి వెఱ్ఱి? భుజదర్పము వెన్నునిముందు సాగునే?
మలపుదు నారథంబు అనుమానము దోఁచె జయంబు కర్ణుడా?

వ్యయమైపోయిన యమ్ములన్మరలఁ గూర్పన్ దక్షమైయున్న య
క్షయతూణీరము విచ్చి పార్థుఁడు శరాసారంబు గుప్పించినన్
జయమా దేవలుఁడెఱుంగు గుఱ్ఱములపై నాపై భవత్సేనపై
దయజూపించుట కూపిరాడగలదా? దౌర్భాగ్యధానుష్కుఁడా?

తూలిన పందికై హరుఁడెదుర్తొని రేచిన గ్రద్దులాట కు
స్తీల బలిఁష్టుడై కఱకు దేలినవాఁడు మహేంద్రసూతి, యా
శూలికి గుండెలే దతనిఁ జూడ నెగాదిగ యుద్ధభూమిలో
రాలఁ దలంచితో పరుశురాముని శిష్యుడ నన్న బిఱ్ఱునన్

బలవంతుండగు శౌరి రోషము రగుల్పం బార్థుఁడున్ గెంపుఁజూ
పుల వేగంబునఁ దూపుల న్నడిపి నీ మూర్థంబు ఖండింపఁడా!
తలపై శాపములాడ నీకు నొక యుద్ధం బేల? నీ రక్తమున్
బొలయున్ గాకులుగ్రద్దలుం గుడుచునేమో! నేఁడు సూతాత్మజా!

ఖాండవము నర్జనుఁడు గాల్చు కాలమందుఁ
బరువులెత్తిన ముసలిసర్పమును వింటఁ
దొడిగినాడఁవు గాఁబోలు విడువ వలవ
దబ్జనాభుఁడు గరుడవాహనుఁడు సుమ్ము

ఇలకున్ గ్రుంగె రథంబు చక్ర మిపు డేదీ నీకు గత్యంతరం?
బలుక న్నీ ప్రతిపక్షి గాండివధరుండై, చెండు చున్నాఁడు నీ
బలమున్ గాలము లేదు స్యందనము లేవందీసుకొ మ్మేటికీ
తలపోఁతల్శరణంబు వేఁడుకొనరాదా కర్ణ? బీభత్సునిన్!

ఇవి నిజంగా శల్యుడు జాషువాకలంలో 
ఉండి జాలువారినవేమో అన్నట్లున్నవి కదా!


No comments:

Post a Comment