Saturday, March 3, 2018

భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట


భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట




సాహితీమిత్రులారా!

శ్రీమదాంధ్రమహాభాగవతంలోని
ప్రథమస్కంధంలో అంపశయ్య మీదున్న
భీష్ముని చూడటానికి ధర్మరాజు శ్రీకృష్ణసమేతుడై
భీష్ముని వద్దకు వెళ్ళినపుడు భీష్ముడు శ్రీకృష్ణుని
స్తుతిస్తాడు ఆ స్తుతిలోని (218 నుండి 222)
కొన్ని పద్యాలు-

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ, బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
విజయుం జేరెడు వన్నెకాఁడు మది నావేశించు నెల్లప్పుడున్

(ముల్లోకాలనూ మోహింపజేసే నీలవర్ణకాంతులతో నిగనిగలాడే
దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభానుప్రభలతో ప్రకాశించే
బంగారుచేలంతో, ఒయ్యారం ఒలకబోస్తూ, నల్లని ముంగురులతో,
ముద్దులు మాటగట్టే ముఖారవిందంతో, అనురాగాలు చిందిస్తూ
మా అర్జునుణ్ణి సమీపించే అందగాడు నా అంతరంగంలో
నిరంతరం నిలిచిపోవాలి)

హయరింఖాముఖధూళిధూసరపరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావుమదిలోఁజింతింతు నశ్రాంతమున్

(గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకొని రంగుచెడి చెదిరిన
ముంగురులతోనూ, గమన వేగంవల్ల కందళించిన చెమట
బిందువులతోనూ కూడి ముచ్చట గొలిపే ముఖం కలవాడై
కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా బాణపు దెబ్బలకు బాగా
బాధపడుతూ కూడా అర్జునిని ప్రోత్సహించి యుద్ధంచేయించిన
మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతమూ ధ్యానిస్తున్నాను)

నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలోఁ
బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
బరభూపాయువు లెల్ల జూపులన శుంభత్కేలి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై

(అర్జునుని మాటలు వింటూ నవ్వుతూ పగవారు చూస్తుండగా
పాండవ కౌరవ సైన్యాల మధ్యప్రదేశంలో తేరునలిపి పేరుపేరునా
 వైరిపక్షంలోని వీరులను చేయెత్తి చూపిస్తూ తన చూపులతోనే
ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు
నా హృదయపద్మంలో పద్మాసనం పైన భాసిల్లుతున్నాడు)

తనవారిఁ జంపఁజాలక
వెనుకకుఁ బోనిచ్చగించు విజయునిశంకన్
ఘనయోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్

(రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి
ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనుంజయునికి గీతోపదేశం
చేసి సందేహాన్ని  పోగొట్టి ముందంజ వేయించిన మునిజన
వంద్యుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి)

కుప్పించి యెగసినఁ గుండలంబులకాంతి
              గగనభాగంబెల్లఁగ్పికొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న
         జగముల వ్రేగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
         బైనున్న పచ్చనిపటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటుసేయకు
         మన్నింపుమని క్రీడి మఱలఁ దిగువఁ
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
నేడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁగాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

(ఆనాడు యుద్ధంలో నాబాణవర్షాన్ని భరించలేక నామీదికి దుమికే
నా స్వామి వీరగంభీరస్వరూపం ఇప్పటికీ నాకు కన్నులకు కట్టినట్లు
కన్పిస్తున్నది. కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు
గగనమండలమంతా వ్యాపించాయి. ముందుకు దూకినప్పుడు
బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమి కంపించి పోయింది.
చేతిలో చక్రాన్ని ధరించివచ్చేవేగానికి పైనున్న బంగారు ఉత్తరీయం
జారిపోయింది. నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు
చేయొద్దు అని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయ
కుండా అర్జునా నన్ను వదులు ఈ భీష్ముని రూపుమాపి నిన్ను కాపాడతాను
- అని అంటూ ఏనుగుపైకి లంఘించే సింహంలా నాపైకి దూకే
గోపాలదేవుడే నాకు రక్ష)

No comments:

Post a Comment