చీకటింటికి దీపమిడినట్లు
సాహితీమిత్రులారా!
కాసుల పురుషోత్తమకవి అనగానే
మనకు ఆంధ్రనాయక శతకం
గుర్తురావడం పరిపాటి. కాని
ఆయన కూర్చిన వాటిలో
"హంసలదీవి వేణుగోపాల శతకం" కూడ
ప్రాచుర్యం పొందిందే. అందులోని
ఒక పద్యం ఇక్కడ-
ఒకవేళ చీకటింటికి దీప మిడినట్లు
తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
గతి బోల్పదగి మందమతిగనుండు
నొకవేళ ద్విరదమూరక త్రొక్కిన కొలంకు
పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తవీటికి మీను బ్రాకిన
కరణి మహాశలఁ దిరుగుచుండు
గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసల దీవివాస!
లలిత కృష్ణాబ్ది సంగమస్థల విహార!
పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!
(హంసలదీవి గోపాలశతకము-88)
స్వామీ నామనస్సు ఏనాడు నిశ్చలంగా ఉండదయ్యా
ఒకసారి చీకటింట్లో దీపం పెట్టినట్టుగా, అంతా సుస్పష్ట
మౌతుంది. ఒక సమయంలో మంచుతో కూడిన పద్మంలా
మందమతిగా ఉంటుంది. ఒక్కోసారి ఏనుగు త్రొక్కిన
సరస్సులా కలుషితమైపోతుంది. ఒక్కొక్కొప్పుడు క్రొత్తనీటికి
ఎదురు ప్రాకే చేపలా గొప్ప ఆశలతో తిరుగుతూ ఉంటుంది.
మన్మథాకారా కృష్ణా సముద్ర సంగమ స్థలమైన హంసలదీవిలో
విహరించువాడా దయాస్వభావా గోపాలదేవా - అని భావం
ఈ శతకంలో మకుటం మూడుపాదాలు గమనించగలరు.
No comments:
Post a Comment