Sunday, March 4, 2018

శివధనుర్భంగము


శివధనుర్భంగము



సాహితీమిత్రులారా!

సీతాస్వయంవరం గురించి
శివధనుర్భంగం గురించి
రకరకాలైన కథాకథనాలున్నాయి.
అందులో వాల్మీకి రామాయణంలో
లేనిది దేశాధిపతులందరి ముందర
రాముడు ధనుస్సును ఎక్కుపెట్టడం
ఇది కథలో రక్తికోసమో ఏమో
మన కవులు కల్పించారు.
ఇక్కడ కరుణశ్రీ వారి కలంనుండి
జాలువారిన ధనుర్భంగ పద్యాలను
చూద్దాం-

అది మహాసభ సీతా స్వయంవరార్ధ
మచట గూడెను తళతళలాడు భూష
ణాలతో ఖండ ఖండాంతరాల దొరలు
శివ ధనుర్భంగమునకు విచ్చేసినారు

బారులు తీర్చి భూపతులు
             బంగరు గద్దెలమీఁద గూరుచు
న్నారు - వెలుంగుచుండె నయ
             మ్ముల ముందొక పెద్దవిల్లు, శృం
గార మధూక మాలికను
              గైకొని జానకి చూచువారి నో
రూరగ తండ్రిప్రక్క నిలు
              చున్నది ముద్దుల పెండ్లికూతురై.

ఆ కనుదోయిలో తొణుకు
             లాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకములేలు రాజసము
             లోగొనగా - రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరస
             మట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియ
             సోదరుతో అభిరామమూర్తియై

'స్వాగత! మో స్వయంవర స
            మాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే హృది ప్ర
            హర్ష పరిప్లుతమయ్యె - ఈ ధను
ర్యాగమునందు శంకర శ
            రాసన మెక్కిడు నెవ్వఁ; డామహా
భాగు వరించు నా యనుఁగు
            పట్టి సమస్త సభాముఖమ్మునన్'

అని జనకుండు మెల్లన ని
             జాసనమం దుపవిష్టుఁడయ్యె - మ్రో
గెను కరతాళముల్; నత ము
             ఖీ ముఖపద్మము వైపు పర్వులె
త్తినవి నరేంద్రపుత్రుల స
             తృష్ణ విలోకన భృంగపంక్తు; ల
ల్లన పులకించె మేను మిథి
             లాపురనాథుని ముద్దు బిడ్డకున్

బిగువునిండారు కొమ్ము టేనుఁగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు;
శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్యసమక్షమందు

ముని చిఱునవ్వుతోడ తన
                ముద్దుల శిష్యుని మోము జూచె - త
మ్మునకు ధనుస్సు నిచ్చి రఘు
                ముఖ్యుఁడు జానకి నోరకంటితో
గనుచు వినమ్రుడై గురువు
                గారికి - సింహ కిశోర మట్లు ముం
దున కరుదెంచె నచ్చెరువు
                తో నృపతుల్ తలలెత్తి చూడగన్!

"ఫెళ్లు"మనె విల్లు - గంటలు "ఘల్లు" మనె - "గు
భీల్లు" మనె గుండె నృపులకు - "ఝల్లు" మనియె
జానకీదేహ - మొకనిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర

సిగ్గు బరువున శిరము వంచినది ఒక్క
సీతయేగాదు - సభలోని క్షితిపతులును
ముదముమెయి పూలు వర్షించినది సతీ శి
రోమణులెగాదు - దేవతా గ్రామణులును

చెల్లరే విల్లు విఱుచునే నల్లవాడు
పది పాదారేండ్ల యెలరాచ పడుచువాడు
"సిగ్గు సి" గ్గంచు లేచి గర్జించినారు
కనులగుట్టిన తెల్లమొగాలవారు.

లక్ష్మివంటి సీతామహగాలక్ష్మి విజయ
లక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి యయ్యె;
భరత జనయిత్రి ప్రేమభాష్పాలలోన
అయ్యె నతివైభవముగ సీతమ్మ పెండ్లి

(శృంగార మధూక మాలిక - అమదమైన ఇప్పపూవులదండ,
ప్రహర్ష పరిప్లుతమయ్యె - గొప్ప సంతోషంతో తడుపబడెను)

No comments:

Post a Comment