Saturday, March 24, 2018

కచ్చిపయప్పర్ - కందపురాణం


కచ్చిపయప్పర్ - కందపురాణం



సాహితీమిత్రులారా!

సంస్కృతంలో 18, తమిళంలో 9
పురాణాలసంగతి. పురాణాలు సంస్కృతంలో 
అష్టాదశపురాణాలనిపేరు కాని తమిళం వాఙ్మయంలో 
నవపురాణాలుగా ప్రసిద్ధి. వాటిలో మిక్కిలి ప్రసిద్ధిచెందినది 
కందపురాణం. స్కందుడు(సుబ్రహ్మణ్యుడు)తమిళులకు 
అత్యంత  ఇష్టమైన వేల్పు కావడమే దానికి కారణం. కచ్చియప్ప 
శివాచార్యార్ అనే భక్తుడు కంపురాణం తమిళంలో రచించారు.
ఇతన్ని గురించి తెలుసుకోడానికి ప్రత్యక్షచారిత్రకాధారాలు
లేకపోయినప్పటికి ఈయన జీవితాన్ని గురించి తెలియజేసే
గ్రంథాలు తమిళంలో కనిపిస్తాయి. "వామదేవ మురుగ 
భట్టారకుడు" 173 పద్యాల్లో కచ్చియప్పర్ జీవితాన్ని ఒక 
పురాణంగా రచించారు. ఇది 1917వ సంవత్సరంలో 
ముద్రించబడింది. "పురాణముదయార్" అనే మరో 
పండితుడు కూడ కచ్చియప్పర్ నుగురించిన ఒక
గ్రంథం రచించారు. 

కాంచీపురం కుమారకోట్టంలో కారత్తియప్ప శివాచార్యర్ అనే 
అర్చకుడు ఉండేవాడు. క్చియప్పర్ ఇతని కుమారునిగా 
జన్మించాడు. బాల్యంలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
మతసంబంధమైన విద్యల్ని కూడా క్షుణ్ణంగా అభ్యసించాడు.
వయసులోనూ, విద్యలోనూ ఇతనికి పరిపక్వత వచ్చింది.

      కచ్చియప్పర్ స్వప్నంలో కుమారస్వామి సాక్షాత్కరించి
సంస్కృతంలోని స్కందపురాణంలోని 6 సంహితలలోనూ 
శంకరసంహిత ప్రథమకాండ(శివరహస్యకాండ)లో ఉన్న తన
చరిత్రను తమిళంలో విశదంగా పాడమని ఆదేశించాడు. 
ఆశ్చర్యంతో దిక్కుతోచని కచ్చియర్ కు ఒక పద్యపాదాన్ని 
కూడా ఇచ్చి సుబ్రహ్మణ్యస్వామి అదృశ్యమయ్యాడు. మరుసటి 
రోజు కుమార కోట్టంలో పూజముగించుకొని కుమారస్వామి ఇచ్చిన 
పద్యపాదంతోనే కచ్చియప్పర్ కందపురాణ రచనకు శ్రీకారం చుట్టాడు.
రోజుకో వంద పద్యాలు వ్రాసేవాడు. వ్రాసిన పద్యాల్ని స్వామి ముందుంచి 
వాకిళ్ళు వేసుకొని వెళ్ళేవాడు. మరుసటిరోజు వచ్చి చూసేసరికి అవసరమైన 
చోట్ల స్వామి స్వహస్తాలతో చేసిన సవరణలు కనిపించేవి. ఈ విధంగా 
కందపురాణం 6 కాండలుగా,  10,345 పద్యాల్లో కూర్చబడింది.

                             ఒకరోజు స్కంధుని సన్నిధిలో గ్రంథావిష్కరణ ఏర్పాటైంది.
దిగడ సకరసెమ్ముగం అయిందులాన్ - అని కచ్చియప్పర్ చదవడం మొదలుపెట్టాడు. అసూయాగ్రస్తుడైన ఒక పండితుడు దాన్ని అధిక్షేపించాడు.  సంధివ్యాకరణ దోషముందన్నాడు. సశాస్త్రీయమైన ఆధారం చూపమన్నాడు. ఇది తన సొంతపద్యంకాదని స్కంధుడే స్వయంగా చెప్పాడు అని తన స్వప్నవృత్తాంతం చెప్పాడు. స్కంధుని సాక్ష్యమే, గ్రంథస్థ ఆధారమే కావాలని పండితుడు పట్టుపట్టడంతో కార్యక్రమం మరుసటిరోజుకు వాయిదా పడింది. సుబ్రహ్మణ్యస్వామి  కచ్చియర్ కు ఆ రాత్రి స్వప్నంలో మళ్ళీ కనిపించి దానికి "వీరసోళియం" అనే గ్రంథంలో ఆ సంధికి ఆధారం వుందని, ఒక చోళ దేశ పండితుడు మరుసటిరోజు దాన్ని సభకు తీసుకువస్తాడని చెప్పాడు. మరుసటిరోజు సభలో కచ్చియప్పర్ తాను గతరాత్రి కన్న కలను గూర్చి చెప్పాడు. ఒక పండితుడు వీరసోళియం అనే వ్యాకరణ గ్రంథాన్ని తెచ్చియిచ్చి మాయమయ్యాడు. కచ్చియప్ప శివాచార్యుని ఘనతను అందరూ వేనోళ్ల వినుతించారు. కచ్చియప్పర్ జనన మరణ తేదీలకు సంబంధించిన సమాచారమేదీ లభించడంలేదు. మొత్తానికి గొప్ప శైవునిగా, స్కంధభక్తుడుగా, స్కంధానుగ్రహ పాత్రుడుగా, గొప్ప కవిగా తమిళ సాహిత్య చరిత్రలోనూ, తమిళుల చరిత్రలోనూ కచ్చియప్ప శివాచార్యర్ కు ఒక ఉన్నతస్థానం ఉందనడం నిర్వివాదాంశం.


No comments:

Post a Comment