Saturday, March 31, 2018

ఎవరి పాదచిహ్నములు లివి?


ఎవరి పాదచిహ్నములు లివి?




సాహితీమిత్రులారా!




"దాశరథి"గారి "అమృతాభిషేకము"
నుండి ఈ కవిత వీక్షించండి-


ఎవరి పాదచిహ్నము లివి?
ఎవరి పాదచిహ్నములు?

       ఆతని ప్రతిఅడుగు గురుతు 
       ఆలయమై తలయెత్తును
       ఆతని చేయి గొడుగు క్రింద
       అఖిల జగము శయనించును

దానవులను కరిగించిన 
మానవుడత డెవ్వడు?

         గుండెనొడ్డి తుపాకీల 
         గుండె పగులగొట్టె నతడు
         రాటంతో రణశూరుల
         ఈటెల నెదిరించె నతడు

హిమాలయముకన్న నెత్తు 
ఎవడాతం డెవ్వడు?

          ప్రతి మానవు హృదయమ్మున 
          నొదిగిపోవ జాలు నతడు
          విశ్వములో ప్రతిప్రాణిని
          ప్రేమించగ జాలు నతడు

కత్తికి కన్నీరుగూర్చు 
కరుణాకరు డెవ్వడు?

          విషమిచ్చిన వాని కమృత
          చషకమిచ్చె నాతడు
          కారాగారము స్వర్గము
          గా మారిచె నాతడు

తరతరాల మన సంస్కృతి 
తానై నిలిచిన దెవ్వడు?

          " ఓపిక" రూపం దిద్దుక 
           ఉరికి వచ్చు నతనిలో-
           "శాంతి" శరీరమ్ము బూని
           సాగి వచ్చు నతనితో-

"మంచి" మరాళము వోలిక
మసలు నతని మనసులో-

            "క్షమ" శిశుశశి నవరేఖా
            సదృశమయ్యె నతని శిరసి
            "ఔదార్యం" అతని నుండి
            అమరవాహినిగ దూకును

ఎవరిని తనువు గతాగతము
లేకమైన యటుల తోచు?
ఎవని చిన్ని నివాసము
అవనికి కైలాసము?

        గుండెలలో ఆతడున్న
        కొంచెము సేపాపుడీ
        కనులలో ఆతడున్న
        కాస్త నాకు చూపుడీ!

ఎవరి పాదచిహ్నము లివి
ఎవరి పాదచిహ్నములు?

No comments:

Post a Comment