కృతజ్ఞత
సాహితీమిత్రులారా!
శ్రీమదాంధ్రమహాభారతంలో
"అనుశాసనిక పర్వం"
మొదటి ఆశ్వాసంలో ధర్మరాజు భీష్ముని
ఈ విధంగా అడిగాడు -
తమ జీవితాలకు ఆధారమైన యజమాని యెడల
అతని దగ్గర బతికే వారెట్లా నడచుకోవాలో చెప్పుమని
అడగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు.
విను కాశీశశ్వరు దేశం
బున నొక లుబ్ధకుఁడు వేఁట పోయిన చోటన్
ఘనతర విషదిగ్ధ శరం
బున నేసిన మృగము ద్పి భూజము దాఁకెన్
(కాశీదేశంలో ఒక వేటగాడున్నాడు.
వాడొక రోజు వేటకు పోయి విషంపూసిన బాణాన్ని
ఒక జింకపై వేయగా అది తప్పిపోయి ఒక చెట్టుకు
తగిలింది.)
పూవులఁ గాయలఁ బెరిగిన
యా వృక్షము శుష్కమయ్యె నవ్విషమున ధా
త్రీవర తదీయ కోటర
మావాసము గాఁగ నొక మహాశుకముండున్
(పూలతో కాయలతో ఏపుగా పెరిగిన చెట్టి
ఆ విషపుబాణమువల్ల నిలువునా ఎండిపోయింది
ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద చిలుక వుండేది.)
అది తరువు విడిచి పోవక,
హృదయంబున భక్తి పేర్మి నెండను గాలిన్
బెదరక, ధృతిమైనయ్యెడఁ
గదలక యుండె, ననుజీవిగౌరరవ మెసఁగన్
(అది ఆ చెట్టు ఎండిపోయినా ఎండకు గాలికి బెదరక
ఆ చెట్టును ఆశ్రయించే ఉన్నది. ఇన్నాళ్లు తనకాశ్రయ
మిచ్చిందన్న గొరవభావంతో ఎటూవెళ్లక అక్కడే వుంది.)
దాని యుదాత్తవృత్తము శ
తకిరతుఁ డాత్మ నెఱింగివచ్చి బెం
డైనది యిమ్మహీజము మ
హా తరువుల్ ఫలవృద్ధినొంది యి
క్కాన ననేకముల్ గలుగఁ
గా నిటు లేటికి నిందు నిల్వ నో
మానిత కీరమా యనియు
మానుష భంగిక రూపమొప్పఁగన్
(ఇంద్రుడు చిలుక వృత్తాంతమంతా తెలిసి అక్కడి వచ్చి
ఓ చిలుకా ఈ అడవిలో ఇన్ని రకాల ఫలించిన వృక్షాలుండగా
ఎండిపోయిన దీన్నే ఆశ్రయించున్నావెందుకు అన్నాడు)
అనిన విని యాశుకంబు
(అనగా చిలుక విని)
అనయము పండుచుండు నెడ
నాశ్రయమొప్పిన నిల్చి, యెండి పో
యిన తఱిఁ బాసిపోక తగ
వెట్లు కృతఘ్నతకాదె యివ్విధం
బనిమిషనాథ యన్న నతఁ
డచ్చెరువంది పురాకృతోప సం
జనిత విశేషమీ ఖగము,
జానుగ నున్న నెఱింగె, దీనికిన్
(చెట్లు పండినపు ఉండి ఎండినపుడు విడిచి వెళ్లడం
కృతఘ్నతకాదా ఓ మహేంద్రా అన్నది. అరే దీనికి
పూర్వజన్మ వాసనవల్ల నన్ను గుర్తించగలిగింది.
కనుక ఈ గొప్ప పక్షికి....)
మేలొనర్చెదంగాక!
(మేలు చేస్తునుగాక)
అని తలఁచి, నీదు పలుకులు
విని మెచ్చితి, వరముగోరు విహంగోత్తమ నీ
వనిన శుకంబు మహీజం
బునకున్ బేరెలమివేఁడె, భూపవరేణ్యా!
(రాజా ఇంద్రుడా విధంగా మనసులో భావించుకొని
చిలుకతో ఓ మహాశుకమా నీమాటలు నాకు ఆనందాన్ని
కలిగించాయి కనుక నీవేదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
వెంటనే ఆ చిలుక స్వామీ ఈ చెట్టుకు పూర్వవైభవం కలిగించు
అని అన్నది(చూచావా ఆ చిలుక ఎంత గొప్పదో తనకు ఏ మేలు
కోరకుండానే చెట్టుమేలు కోరుకుంది.))
అమర వల్లభుండు నమృత సేచనమున
భూజమునకుఁ దొంటి పొలుపుకంటె
మిగుల నెలమిసేసె మేలి యాశ్రితులట్ల
మనుతు రధిపుఁ గురు కుమారవర్య!
(కురు వంశంలో ఉత్తమమైనవాడా ఇంద్రుడు అమృతం చల్లి
చెట్టుకు పూర్వ వైభవం కలిగించాడు. తనను కాపాడిన వారికి
మంచి ఆశ్రితులు ఇట్లాగే రక్షిస్తారు అని అన్నాడు.)
No comments:
Post a Comment