డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?
సాహితీమిత్రులారా!
ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండి
శ్రీనాథునిచే వాదంలో ఓడింపబడిన
"డిండిమ భట్టు" ఒకరుకాదని వారివంశ
వివరాల్లోకెళితే తెలుస్తుంది.
విజయనగరరాజుల ఆస్థానం అలంకరించిన
సంస్కృత కవులు డిండిమ కవులు.
వీరి చరిత్ర విభాగరత్నమాల అనే గ్రంథంలో
వివరింపబడింది. గంగాతీరంలో మందార
గ్రామంలో నివసించే ఎనిమిదిమంది శైవ
బ్రాహ్మణులను ఒక చోళరాజు కాశీనుండి
దక్షిణానికి తీసుకొచ్చాడని, వారికి ఉత్తర
ఆర్కాడు జిల్లాలోని మెట్టుపడిని(తల్పగిరి)
అగ్రహారాన్ని ఇచ్చారని, అఇక్కడే ఆ
వంశంవారు క్రమంగా 70 కుటుంబాలుగా
వృద్ధిచెందారని ఆ గ్రంథంలో చెప్పబడింది.
ఆ వంశంలోని అరుణగిరినాథుడు అనే
పండితుని ప్రౌఢదేవరాయలు(1422-48)
ఒక ఆరామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.
అప్పటి నుండి ఆ వంశం వారు విజయ
నగరరాజుల కొలువులో ఆస్థానపండితులుగా
కవులుగా ఉన్నారని ఈ గ్రంథం ద్వారా
తెలుస్తుంది.
మొదటి అరుణగిరినాథుడు మొదటి రాజనాధుని
కుమారుడు. ఇతని మాతామహుడైన అభిరాముడు
శ్రీకంఠాగమమున పండితుడై డిండిమ ప్రభువు
(డిండిమ - 1) అనే పేరుతో వ్యాప్తిచెందాడు.
అరుణగిరినాథుని యశస్సు డిండిమవాద్య ధ్వనిచే
ఘోషించబడుతున్నందువల్ల ఇతనికి డిండిమ
కవిసార్వభౌముడు (డిండిమ - 2) అనే బిరుదు
కలిగింది. ఇతడు ప్రౌఢదేవరాయల కొలువులో
ఉండి ప్రతివాది భయంకరుడై విలసిల్లాడు.
శ్రీనాథుడు వాదంలో ఇతనిని ఓడించి, ఇతని
కంచు ఢక్కను పగులగొట్టించి, ఇతని
కవిసార్వభౌమబిరుదాన్ని తాను గ్రహించాడు.
ఇతడు యోగానంద ప్రహసనం అనే ప్రహసనాన్ని
వ్రాశాడు. అరుణగిరినాథుని కుమారుడైన రెండవ
రాజనాథునికి కూడ డిండిమకవి సార్వభౌముడు
(డిండిమ - 3) అమే బిరుదు ఉంది. ఇతడు
నాట్య, తత్త్వశాస్త్రాల్లోనూ, పలు భాషల్లోనూ
పండితుడై తండ్రికంటే కూడా ఎక్కువ కీర్తిని
గడించాడు. ఇతడు విజయనగరరాజుల సేనాని
అయిన సాళ్వనరసింగుని ఆదరాన్ని సంపాదించి
సాళువాభ్యుదయం(1480) అనే 13 ఆశ్వాశాల
కావ్యాన్ని, దండయాత్రలను, పరాక్రమాన్ని
వర్ణించాడు.
రెండవ రాజనాథుని కుమారుడు రెండవ అరుణగిరినాథుడు.
ఇతడు వారేంద్ర అగ్రహార నివాసి. ఇతడు వీరనరసింహ,
శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండి, వారిచే పోషించబడిన
వాడు. ఇతనికి పలుభాషలలో పాండిత్యం ఉంది.
ఇతడు వీరభద్రవిజయం అనే డిమ రూపకాన్ని రచించాడు.
ఇది రాజనాథదేవుని ఉత్సవ సందర్భంలో ప్రదర్శించబడింది.
ఇతనికి కవిరాజరాజు, డిండిమ కవిసార్వభౌముడు, కుమార
డిండిముడు(డిండిమ - 4) అనే బిరుదులున్నాయి.
కుమార డిండిముని తరువాత ఆ వంశంవారు గొప్ప పండితులై,
ఆ వంశగౌరవాన్ని నిలబెట్టారు. ఇతని కుమారుడు మూడవ
రాజనాథుడు భాగవతచంపువును, అచ్యుతరామాభ్యుదయం రచించి
పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
(ఆధారం - విజ్ఞాన సర్వస్వం - 6(భారతభారతి))
No comments:
Post a Comment