Saturday, April 7, 2018

శివసాయుజ్యము


శివసాయుజ్యము




సాహితీమిత్రులారా!


"మహాకవి ధూర్జటి" కృత "కాళహస్తీశ్వర మాహత్మ్యం"లో
ఏనుగుపై కోపంతో పాము ఏనుగు తొండంలో దూరగా
ఏనుగు ఎలాంటి అగచాట్లు పడిందో వర్ణించిన తీరు
గురించిన పద్యాలు కొన్ని ఇక్కడ చూద్దాం-

శుండాలంబు కరంబు సాఁప, ఫణిరాజు న్మెచ్చి "నాపూజ భ
ర్గుండీవేళ ననుగ్రహించె"నని, ముక్కుం గూండ్లలో నెక్కి, యు
ద్దండక్రీడఁ దదీయ కుంభ కుహర స్థానంబునం ద్రిమ్మరన్,
గొండ ల్గూలగ నెత్తి మొత్తుకొని, దిక్కుల్ముట్ట గీఁపెట్టుచున్

(ఏనుగు శివనిర్మాల్యాన్ని ఊడ్చటానికి తొండం సాపగా, పాము
మనసులో శివుడు ఈ రోజు నాపూజను అనుగ్రహించి దీన్ని
ఎదుట నిలిపాడు, అనుకొంటూ ఏనుగు ముక్కు గూడ్లలో దూరి
దాని తలలో విపరీతంగా తిరగడం మొదలు పెట్టింది దానితో
బాధ భరించలేక ఏనుగు కొండలు కూలేట్లు అరవడం చేసింది
దిక్కులు గీపెట్టెలా అరచింది.)

మొగలేటి మడుఁగున మునిఁగి తుండమ్మున
         నుదక మాకర్షించి యూఁది యూఁది
కడుఁగపాలము దాఁకి కలఁగంగఁ జక్కఁగాఁ
         జేసాచి జిఱ్ఱునఁ జీఁది చీఁది,
యిలమీఁదఁ దలదాఁక నీ ప్రక్క నా ప్రక్కఁ
         బెడమర్లుగాఁ బొడ పెట్టి పెట్టి,
యుడివోని వేదన నున్నచో నుండక
         పనిలేని పరువులు పాఱిపాఱి,
పెద్ద మ్రాకులతోఁ గుంభపీఠ యుగముఁ
దోముకొనుచును జెట్టులు దూఱి తూఱి,
పాము సేసిన దుఃఖంబు సామజంబు
దీర్చుకొను వెరవెఱుఁగక, ధీబుద్ధి.

(మొగలేటి మడుగులో మునిగి తుండంతో
నీళ్ళు తీసుకొని బయటకు ఊదుతూ,
కపాలం కదిలేట్లు చీత్తూ, తల నేలను
తాకే విధంగా పెద్దగా పొర్లుతూ
కలిగే బాధతో ఒక చోట ఉండక
అటూ ఇటూ పరుగెత్తుతూ
పెద్ద చెట్లతో తలను రుద్దుకుంటూ
చెట్లలో దూరుతూ పాము పెట్టే బాధలకు
భయపడకుండా బాధను భరిస్తూవుంది.)

"ఏనా చచ్చుట తప్పదిప్పుడు, నుమాధీశోపకంఠంబునన్
దానుం జావక చంపనోప దురగేంద్రం, బెక్కు డీ దుఃఖ మే
లానాకు? న్సరి చంపి చచ్చుట జనాహ్లాందంబు గాదా? యవా
చీన స్థాణునగంబె వధ్యశిలగా సేవింతు గా కింతటన్"

(నేను ఈ పాము చేత చచ్చిపోడం తప్పదు కాని దాన్ని
చంపకుండా నేను చావడం ఎందుకు ఇంత బాధ
కలిగించిన దాన్ని చంపి చస్తేనే జనులు మెచ్చుకుంటారు
కాబట్టి ఈ కొండనే వధ్యశిలగా భావిస్తాను.)

అని మత్తేభము, చిత్తజాహితుని దిక్కై మ్రొక్కి "యిక్కాళమే
కనుమం బోవునొ?" యంచుఁ దుండ మఱియంగాఁ జుట్టి, వక్రస్థలం
బునఁ గీలించి, పిఱిందికింజని, శిరంబు న్వంచి యక్కొండ భ
గ్గునఁ దాఁకె, న్వడిఁ గుంభముల్వగులఁ దత్కూటంబు లూటాడఁగన్
(అని ఏనుగు మనసులో అనుకొని శివునే దిక్కుగా మ్రొక్కి,
ఈ పాము బయటికి పోతుందేమోనని తొండాన్ని చుట్టి,
వెనక్కు వచ్చి తలను వంచి ఆ కొండను తల పగిలే విధంగా
ఢీకొట్టడం మొదలు పెట్టింది.)

కొండ కొండ తోడ గుండులుఁ గూలంగఁ
దాఁకినట్లు దోచె, దళిత కుంభ
సీమ నున్న పాము చిదిసె, నేనుంగును
బడియె, నెత్తురచటఁ బడియ కట్టె

(కొండ కొండతో పాటున్న గుండ్లు కూలినట్లు
తాకిందనిపించే విధంగా అనిపించింది.
లోపలున్న పాము  చితిపోయింది.
ఏనుగూ నెత్తుటి మడుగులో పడిపోయింది.)


No comments:

Post a Comment