Thursday, April 12, 2018

హనుమంతుని నీతిబోధ


హనుమంతుని నీతిబోధ
సాహితీమిత్రలారా!


భాస్కరరామాయణంలోని
ఈ పద్యానికి చీమలమర్రి బృందావనరావుగారి
వివరణ చూడండి. ఇది ఈమాటలో సెప్టెంబర్ 2011న
ప్రచురించ బడింది.

శా.
నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్ఘాంత పాతంబు లం
కోకస్సంచయ కాళరాత్రి గళ బద్ధోదగ్ర కాలాహి క
న్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ యొప్పించి లో
కైక త్రాణుని రామునిం గనుము నీకీ బుద్ధి గాకుండినన్

పై పద్యం భాస్కర రామాయణంలో మల్లికార్జున భట్టు వ్రాసినది. ప్రసిద్ధమైన పద్యం.
హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్షకుమారాది దైత్యులను చంపి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి ఐచ్ఛికంగా లొంగిపోయి, రావణుని సభలోనికి తీసుకురాబడి – అక్కడ అవకాశం దొరికే సరికి రావణునికి హితబోధ చేసే సందర్భం లోనిది ఈ పద్యం.
నీవు ఒక సాధారణ స్త్రీని తీసుకు వచ్చానని భ్రమ పడుతున్నావు. ఆమె భర్త కేవలం మానవుడనీ, సముద్రాన్ని దాటి రాలేడనీ, వచ్చినా ఒక మానవుడు నన్నేమి చేయగలడని అనుకుంటున్నావేమో. సీత సామాన్యురాలు కాదు. నీ కంఠానికి బిగుసుకున్న యమపాశం ఆమె. నీ తల మీద పడబోతున్న పిడుగు. నీ లంకా నగరం పాలిట కాళ రాత్రి. నీ కుతికెకు చుట్టుకును వున్న భయంకర కాల సర్పం. నీ ముంగిట్లోకి స్త్రీ ఆకారంతో ప్రవేశించిన మృత్యు దేవత. ఆమెను వెంటనే శ్రీరామునకు అప్పగించి నిన్ను నీవు కాపాడుకో. నీ దుష్టబుద్ధిని మానుకో – అని హనుమంతుడు రావణునికి హితబోధ చేస్తాడు.
ఇందులో సూచింపబడ్డ ఆపదలన్నీ అప్పటికే స్థిరమైపోయినవి. ఇక తప్పించుకునే అవకాశం లేనివి. కాలపాశం కంఠానికి బిగుసుకునే వున్నది. ప్రాణాలు లాగేయడం ఇప్పుడో, మరుక్షణమో. పిడుగు తల మీద పడబోతున్నది. ఇంక దానిని ఆపే ప్రసక్తే లేదు. లంకానగరి లోని ఇళ్ళన్నిట్లోకీ కాళరాత్రి ప్రవేశించే వున్నది (లంకోకస్సంచయము: ఓకము అంటే ఇల్లు, స్థానము. ఓకస్సంచయమంటే ఇండ్ల వరుస). హనుమంతుడు ఆ సభలోంచి పక్కకు రావడమే ఆలస్యం, లంకలోని ఇళ్ళలోకి కాళరాత్రి వచ్చేసినట్లే. భయంకరమైన కాల సర్పం మెడకు చుట్టుకునే వుంది. ఇక కాటు వేయడమే తరువాయి. కన్యాకారంతో, సీత అనే స్త్రీ రూపంలో మృత్యుదేవత నీ ముంగిట్లోకి ప్రవేశించే వుంది. ఇక వీటిని వేటినీ నిరోధించగల సమర్ధత ఎవరికీ లేదు, ఒక్క రామచంద్రునకు తప్ప. నీవు నీ బుద్ధి మార్చుకొని, జానకిని రామునకు అప్పజెప్పు. నీవు కాపాడబడతావు. ఇది వినా నీకు వేరొక దారి లేదు. హనుమంతుడు ఎంతో స్పష్టంగా జరగబోయేదాన్ని కండ్లక్కట్టినట్టు వివరించి, మార్గం సూచించిన సందర్భం.
మల్లిఖార్జున భట్టు తత్సమ పదాలు ఎక్కువగా వాడుతాడు. చక్కని తత్సమ పదాల పొందికతో, హాయిగా సాగే ధారతో, పదాలు, భావము, ఛందస్సూ ఈ పద్యంలో పోటాపోటీగా నడిచాయి. శార్దూలం ఉల్లంఘిస్తున్నట్లుగా వున్న ఈ పద్యం కష్టం లేకుండా కంఠస్థం చేసుకోగల సౌలభ్యంతో నడిచింది.

No comments:

Post a Comment