Wednesday, April 4, 2018

అమరకోశం - అమరసింహుడు


అమరకోశం - అమరసింహుడు
సాహితీమిత్రులారా!ఒకనాడు మన తెలుగునాట అమరకోశం పేరు విననివారు
అరుదని చెప్పవచ్చు. కానీ నేడు అమరకోశం పేరు 
వినినవారు ఉన్నారంటే వాళ్ళు నేటివారు కాదని అర్థమౌతుంది.
దీన్ని గురించి చెప్పుకునే ముందు కొంత నాగురించి చెప్పుకోవాలి.
నేను ఇంగువకు కట్టిన గుడ్డలాంటివాణ్ణి అయినా నాగురించి కొంత
ముచ్చటిస్తాను. నా తాతగారు(మాతామహులు) తంగెళ్ల నారాయణరాజు గారు 
ఆయన వీధిబడి నడిపేవారు. నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు
నిద్రపోతుంటే వేకువజామునే పిల్లలందరూ లాంతర్లు తెచ్చుకొని
అమరం, త్రికాండ శేషం, ఆంధ్రనామసంగ్రహం, ఆంధ్రనామశేషం
కృష్ణశతకం, రామరామశతకం, రుక్మణీకల్యాణం, గజేంద్రమోక్షం మొదలైన 
వాటిలోని శ్లోకాలు పద్యాలు ఒకరు చెబుతుంటే మిగిలినవారు
ఆ లాంతరు వెలుతురులో చూస్తూ పలికి కంఠస్థం చేసేవారు వారు
అలా పలుకుతుండగా అవే సుప్రభాతంగా ఎప్పుడో మెళుకువ వచ్చినపుడు 
లేచేవాణ్ణి. అప్పటిలో ఏదో కొంత అంటిన వాసన 
కలవాణ్ణి అందుకే అమరకోశం అంటూనే నాకు గుర్తువచ్చే
అపురూప దృశ్యం అది నాకు. అందుకే మీతో నా అనుభవాన్ని 
పంచుకున్నాను.  మన దేశంలో తప్ప మరే దేశంలో నిఘంటువును
కంఠతాపట్టేవారు లేరంటే అతిశయోక్తి కాదనవచ్చు. ఈ వసతి
తెలుగు సంస్కృత భాషలకే బహుశావుందని విన్నాను.

అమరకోశం కూర్చిన వారు అమరసింహుడు. ఈయన
4వ శతాబ్దానికి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని
నవరత్నాల్లోనివాడు.  ఈ గ్రంథానికి మొదట్లో ఉన్న శ్లోకం 
"యస్యజ్ఞాన దయాసింధోః" అనేది. ఇది అమరసింహుడు 
బౌద్ధమతావలంబియని తెలుపుతుందంటారు. 
అమరకోశానికి నామలింగాను శాసనము 
అనే పేరుకూడా ఉంది. ఈ సంస్కృత నిఘంటువులో మూడు
కాండలున్నాయి. మూడు కాండల్లో 32 వర్గాలున్నాయి. 
మొదటి కాండలో - భూలోకానికి సంబంధించినవి కాక
స్వర్గ, దిక్, కాల, వాక్, శబ్ద, నాట్య, పాటాళ, నరక,
వారి మొదలైన విషయాలకు సంబంధించిన వివిధ 
పదజాలం వివరింపబడింది.
రెండవ కాండలో - భూమిపై కనిపించే భూ, పుర, శైల, 
వనౌషధీ, జంతు, మనుష్య, చాతుర్వర్ణ్య విషయికాలయిన 
శబ్దాలు వివరింప బడ్డాయి. 
మూడో కాండలో విశేష్యనిఘ్య, సంకీర్ణ, నానార్థ, అవ్యయ,
లింగాది విశేషాలను తెలిపి వున్నాడు.

ఈ గ్రంథానికి 50కిపైగా ముద్రితాముద్రితవ్యాఖ్యలున్నాయి. 
తాళ్ళపాక అన్నమయ్య కుమారుడైన తిరువేంకటాచార్యులు,
గురుబాలప్రబోధిని వ్యాఖ్యను చదివి, తన్మయుడై అమరకోశానికి
ఆంధ్రభాషలో బాలప్రబోధిక అనే పేరున ఒక వ్యాఖ్య వ్రాశారు. 
దీని వ్యాఖ్యానాల గురించిన వివరాల్లో కెళితే ఒక చిన్న 
వ్యాసమంతౌతుందని వాటి వివరాలు ఇక్కడ మనం 
ప్రస్తావించుకోవడం లేదు. దీనిలోలేని పదాలను అందించడానికి
పురుషోత్తమదేవుడను ఆయన త్రికాండ శేషం పేరుతో కూర్చడంతో
అది అమరకోశానికి అనుబంధంగా మారింది.

No comments:

Post a Comment