Monday, April 16, 2018

జాషువా పిరదౌసి


జాషువా పిరదౌసి


సాహితీమిత్రకులారా!




జాషువా కథాకావ్యాల్లో ప్రసిద్ధమైంది పిరదౌసి. అద్భుతమైన కవిత్వాన్నిరాసి అందుకు తగిన గుర్తింపునూ ప్రతిఫలాన్నీ పొందలేక పోవటం ఈ ఇద్దరు కవులవిషయంలోనూ ఉన్న సామ్యం. ఐతే జాషువా కథనంలో పిరదౌసి మరణానంతరం మాత్రమే సత్రశాల రూపంలో గుర్తింపు దొరుకుతుంది.తన పరిస్థితీ అలాటిదేనని జాషువా భావించారని నాకనిపిస్తుంది. కాని గుడ్డిలో మెల్లగా జాషువాకిచరమదశలో నైనా రసహృదయుల సన్మానాలూ స్వాగతపత్రాలూ లభించాయి.

భారతీయ సంపదల్ని పదిహేడు సార్లు దోచుకుపోయి సంతుష్టుడైన గజనీమహమ్మద్‌తన వంశీయుల చరిత్రను రాయమని పిరదౌసిని కోరి అందులో ఒక్కొక్క పద్యానికి ఒక బంగారునాణెం బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు. పిరదౌసి ముప్ఫై ఏళ్ళ పాటు శ్రమించి రాసిన అరవైవేలపద్యాల “షానామా” ని విన్న తర్వాత ఎందువల్లనో బంగారం బదులుగా వెండి నాణాలు పంపుతాడు.అందుకు పరితపించి పిరదౌసి తనని నిందిస్తే అది పరాభవంగా భావించి పిరదౌసిని చంపిరమ్మని సైన్యాన్నిపురమాయిస్తాడు.పిరదౌసి తప్పించుకుని పారసీకానికి పారిపోయి అక్కడ శేషజీవితం గడపటం,మహమ్మద్‌చివరకు పశ్చాత్తాపపడి అతనికి బంగారు నాణాలు పంపించేసరికే అతను చనిపోవటం,అతని కూతురు ఆ ధనాన్ని తిరస్కరించటంతో కథ ముగుస్తుంది.

పాత్రచిత్రణ
కథలో ముఖ్య పాత్రలు పిరదౌసి, మహమ్మద్‌లవైతే పిరదౌసి కూతురు కూడాచివరిఘట్టంలో ఒక ఉన్నత వ్యక్తిగా దర్శనమిస్తుంది. పిరదౌసిలో తనని, తనలో పిరదౌసినిచూసుకున్న జాషువా, పిరదౌసి వ్యథని, వేదనని, మానసిక స్థితిని, అద్భుతంగా కరుణరసార్ద్రంగాచిత్రించాడు. భగవంతుని మీద అతనికున్న విశ్వాసం, అత్యంత దయనీయమైన స్థితిలో కూడా ఉబికివచ్చేఊహాప్రవాహం, జాషువా హృదయస్థితికి ప్రతిబింబాలు. ఐతే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించేది ఆయన మహమ్మద్‌ను చిత్రించిన విధానం. పిరదౌసికి మహమ్మద్‌ చేసిన దురన్యాయానికి బహుశః జాషువాకాక మరే కవైనా మహమ్మద్‌ను దుష్టుడిగా, హృదయం లేని వాడిగా చిత్రించేవాడేమో! జాషువా మహమ్మద్‌చాలాసంక్లిష్టమైన వ్యక్తి. లలితకళాపోషకుడు. దానశీలి. సాహితీలోలుడు. పిరదౌసి విషయంలో కఠినంగాప్రవర్తించినా మసీదు గోడమీద అతను రాసిన పద్యాల్ని చదివి కన్నీరు కార్చగలిగినసున్నితహృదయుడు. ఆలోచించిచూస్తే ఒకవేళ కొంతవరకు రావణాసురుడి ఛాయల్లో అతన్ని తీర్చిదిద్దాడా అనిపిస్తుంటూంది!జాషువాలోని అచంచలమైన గాంధేయ భావాలు, అహింసాప్రవృత్తి, అణగదొక్కిన వారిని కూడా ప్రేమించగలిగేదయార్ద్రత కలిసి మహమ్మద్‌ను అలా చిత్రించేట్లు చేశాయని నా విశ్వాసం.

భావనాపటిమ
జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ. సుప్రసిద్ధమైన ఈ కింది పద్యాల్లో ఈ గుణాలన్నీ విస్పష్టంగా కనిపిస్తాయి. ఆస్వాదించి ఆనందించండి.

ఓ సుల్తాను మహమ్మదూ! కృతక విద్యుద్దీపముల్‌నమ్మి ఆ
శాసౌధమ్ముల కట్టికొంటి అది నిస్సారంపు టాకాశమై
నా సర్వస్వము దొంగిలించి నరకానన్‌కూల్చిపోయెన్‌వృథా
యాస ప్రాప్తిగ నిల్చినాడ నొక దుఃఖాక్రాంత లోకంబునన్‌

పూని కరాసికిన్‌మనుజ భుక్తి నొసంగెడు రాతిగుండె సు
ల్తానుల కస్మదీయ కవితాసుధ చిందిన పాతకంబు నా
పై నటనంబొనర్చినది వాస్తవ మిట్టి స్వయంకృతైక దో
షానల దగ్ధమై చనిన అర్థము నాకు లభింపబోవునే

ఇంక విషాద గీతములకే మిగిలెన్‌రసహీనమై మషీ
పంకము నా కలమ్మున; అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్‌
క్రుంకె; శరీరమం దలముకొన్నది వార్థకభూత; మీ నిరా
శాంకిత బాష్పముల్‌ఫలములైనవి ముప్పది ఏండ్ల సేవకున్‌

చిరముగ బానిసేని నభిషేక మొనర్చితి మల్లెపూవు ట
త్తరు లొలికించి; మాయ జలతారున రాదు కదా పసిండి? ఓ
కరుకు తురుష్క భూపతి, అఖండ మహీవలయంబు నందు? నా
శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్నిఖండముల్‌

కృతి యొక బెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప శే
షితమగు అస్థిపంజరము జీవలవంబున ఊగులాడగా
బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మదు గారి ఖడ్గ దే
వతకు రుచించునా? పరిభవవ్యథ ఇంతట అంతరించునా?

ప్రకృతి పదార్థజాలములపై ఉదయాస్తమయంబులందు నీ
అకలుష పాణి పద్మము రహస్యముగా లిఖియించి పోవుటొ
క్కొక సమయాన నేను కనుగొందును గాని గ్రహింపజాల నెం
దుకు సృజియించినాడవొ ననున్‌ఘనుడా అసమగ్ర బుద్ధితోన్‌

ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయెనో
రాతిరి; తూర్పు కొండ లభిరామము లైనవి; దీని వక్రపుం
కూతల మర్మమేమి? కనుగొమ్మని అల్లన హెచ్చరించి ప్రా
భాత సమీర పోతములు పైకొనియెన్‌తొలిసంజ కానుపుల్‌

ఏమిటి కెక్కువెట్టితివొ ఇంద్రధనుస్సును మింటిచాయ నా
సామి! పయోదమాలికల చాటున సూర్యుడు నక్కినాడు తా
నేమపచారమున్‌సలిపి ఇట్టి విపత్తును తెచ్చిపెట్టె? ఈ
భూములు నిల్చునా భువనమోహన నీవు పరాక్రమించినన్‌

“ఇది నా తండ్రిని కష్టపెట్టిన శరం; బీ స్వాపతేయంబు ము
ట్టుదునా? నా జనకుండు కంట తడి బెట్టున్‌స్వర్గమందుండి; నా
ముది తండ్రిన్‌దయతోడ ఏలిన నవాబుండైన మీ స్వామికిన్‌
పదివేలంజలు” లంచు పల్కుడని బాష్పస్విన్న దుఃఖాస్యయై

ఓయి కృతఘ్నుడా! భవమహోదధిలో నిక తేలియాడు; మా
హా! అఫఘన్‌ధరాతలము నంతయు కావ్యసుధా స్రవంతిలో
హాయిగ ఓలలార్చిన మహామహుడౌ పిరదౌసి తోడ స్వ
ర్గీయ సుఖంబు నీకు తొలగెన్‌మనుపీనుగువై చరింపుమా!



జాషువా గురించి ఆయన మాటల్లోనే

తమ్మిచూలి కేలు తమ్మిని కల నేర్పు
కవి కలంబునందు కలదు కాన
ఈశ్వరత్వ మతనికే చలామణి అయ్యె
నిక్కువముగ పూజనీయుడతడు
----------------------------------------
ఈ - మాట, (జనవరి1999) లోనిది ఈ వ్యాసం

No comments:

Post a Comment