Tuesday, April 3, 2018

పద్మపురాణం


పద్మపురాణం



సాహితీమిత్రులారా!



అష్టాదశపురాణాలలో రచనకు సంబంధించినంతవరకు
పద్మపురాణం మొదటి, సంఖ్యలో రెండవది. పద్మపురాణంలో
55వేల శ్లోకాలున్నాయి. ఇది సాత్వికపురాణం. ఇది విష్ణువుకు 
మిక్కిలి ప్రీతిపాత్రము, హృదయ స్థానం అని సాంప్రదాయం.
ఇందులో ఆరు ఖండాలున్నాయి. అవి ఆది, భూమి, బ్రహ్మ, 
పాతాళ, సృష్టి, ఉత్తర ఖండాలు. పద్మకల్పంలో ప్రవృత్తం 
కావడం చేత పద్మపురాణం అని, ఆ కల్పంలో విష్ణునాభినుంచి
క్షోణీలక్షణాలతో ఉద్భూతమైన పద్మమే భూమికావడం చేత దీనికి
పద్మపురాణం అని పేరు. శ్రీహరి తత్త్వాన్ని ప్రతిపాదించేది 
ఈ పురాణం.

                ఆది ఖండంలో సృష్టిక్రమం, భూమిపైని ప్రధాన  నదీతీర్థ పర్వతాలు 
మొదలైన వాటి వర్ణన, కింపురుషాది వర్షవర్ణన ఉన్నాయి. ఇందులో శైవతీర్థాలే 
ఎక్కువగా వర్ణించబడ్డాయి. భూమి ఖండంలో ఎక్కువగా విష్ణపారమ్య 
ప్రతిపాదికాలైన కథలున్నాయి. పద్మావతి(కంసుని తల్లి) చరిత్రం, 
భార్యా తీర్థాధిక్యాన్ని తెలిపే సుకలాచరిత్రం, గురుతీర్థ, పితృతీర్థ 
మహిమలు,  అశోకసుందరీ నహుషుల కథలు ఇందులో చేరి ఉన్నాయి. 
అనేక వ్రతకథలు, వాసుదేవస్తోత్ర, రామనామ, విష్ణుసహస్రనామ 
మహిమలు కూడా ఇందులో వివరించబడ్డాయి. ఇందులోని ముఖ్యాంశం 
అష్టాదశ పురాణాత్మక విష్ణు స్వరూప వర్ణన. పాతాళఖండంలో పూర్వకల్ప
రామాయణం ఒక విశేషం. 

            పద్మపురాణం ఉపాఖ్యానాలకు ప్రసిద్ధి చెందినది.
తెలుగులో దీనిని పద్యరూకంగా అనువదించిన వారిలో మడికి
సింగన(15వ శతాబ్దం) మొదటివాడు. ఇతడు ఉత్తర ఖండం
మాత్రమే అనువదించాడు. తరువాత కామినేని మల్లారెడ్డి
(1550-1610), త్రిపురాన తమ్మయదొర(1849-90), పిశుపాటి
చిదంబర శాస్త్రి(1892--1951), వేటూరి శివరామశాస్త్రి(1892-1967)
కూడా అనువదించారు.

No comments:

Post a Comment