బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో
సాహితీమిత్రులారా!
ఈ చాటువు చూడండి దాతలను గురించి
చెప్పినది. రాయనమంత్రి భాస్కరునితో
ఏ కవి చెప్పాడొ ఈ చాటువు తెలియదుకాని
ఈ చాటువు గొప్పదనమేందో మీకే తెలుస్తుంది
చదవండి-
ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱొక్కరుడస్థినిచ్చె నిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్కొక పట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరొ కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా!
ఓ రాయని మంత్రి భాస్కరా!
ఒకరు శరీరంలో నుండి మాంసం కోసి ఇచ్చారు
ఒకరు చర్మం కోసి ఇచ్చారు. మరొకరు వెన్నెముక
ఇచ్చారు. ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు. వీళ్లంతా
బతుక లేక ఈ పనులు చేశారా కీర్తికోసం చేశారా
బాగా ఆలోచించి చూడు - అని భావం
ఇందులో కవి చెప్పిన మహాదాతలు -
మాంసంకోసి ఇచ్చినవాడు - శిబి చక్రవర్తి
(పావురాన్ని కాపాడటానికి)
చర్మం (సహజసిద్ధమైన కవచ కుండలాలు
ఇంద్రుడు అడగ్గా) కోసి ఇచ్చినది - కర్ణుడు
వెన్నెముక ఇచ్చినది - దధీచి (రాక్షస సంహారానికి
ఇంద్రుని ఆయుధంగా)
ప్రాణం ఇచ్చినవాడు - బలిచక్రవర్తి
(వామనుడు అడిగితే ప్రాణమే ఇచ్చాడు)
వీళ్లంతా త్యాగధనులు, మహాదాతలు.
No comments:
Post a Comment