Saturday, April 28, 2018

భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?


భాగవతం శుకయోగి ఎందుకు చదివాడు?



సాహితీమిత్రులారా!



భాగతవతం గొప్పదనాన్ని వివరించే పద్యాలు
శ్రీమదాంధ్రమహాభాగవతం ప్రథమస్కంధంలో
చెప్పబడినవి చూడండి-

అవనీచక్రములోన నేపురుషుఁడేయామ్నాయమున్ విన్న మా
ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ
క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా
గవతామ్నాయముబాదరాయణుఁడు దాఁగల్పించెనేర్పొప్పఁగన్

భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోని విషయాన్ని
విన్నంత మాత్రం చేతనే శ్రీమహావిష్ణువుపై అచంచలమైన
భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో అలాంటి లోక
కల్యాణప్రదమైన భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి
నేర్పుతో రచించాడు.

ఇట్లు భాగవతంబు నిర్మించి, మోక్షార్థియయిన శుకునిచేఁజదివించె,
నని చెప్పిన విని శౌనకుడు నిర్వాణతత్పరుండును సర్వోపేక్షకుండు
నయిన శుకయోగి యేటికి భాగవతం బభ్యసించె ననపుఁడు సూతుండిట్లనియె.

వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే
చదివించాడు. అనగానే శౌనకుడు శుకుడు కేవలం స్వస్వరూప
జ్ఞానంకలవాడు కదా విశ్వంలోని సమస్తవిషయాలపైన ఉపేక్షభావం
కలవాడు కదా అలాంటివాడు భాగవతం మాత్రం ఎలా చదివాడు
ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు దానికి సూతుడు ఇలా చెప్పాడు.

ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁడట్టివాఁడు నవ్యచరిత్రా

నుతింపదగిన చరిత్రగలవాడా భగవంతుని యందే తప్ప మరే విషయంపై
 ఆసక్తి లేనివారు, ప్రాపంచిక విషయాలందు అనురక్తి లేనివారు, ఆత్మయందే
రమించువారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజమైన భక్తితో హరి సంకీర్తనం
చేస్తుంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యతకలవాడు.

హరిగుణవర్ణనరతుఁడై
హరితత్పరుఁడైన బాదరాయణి శుభత
త్పరతం బఠించెఁ ద్రిజగ
ద్వరమంగళ మైన భాగవత నిగమంబున్

శుకయోగి శ్రీహరి దివ్యనామాలను, గుణాలను గానం చేయుటయందు
ఆసక్తి కలవాడు. ఆయన యందే ఏకాగ్ర చిత్తం కలవాడు. ఆయన
భాగవతసంహితను మూడులోకాలకు శుభదాయకమైనదిగా భావించాడు.
శుభంకలగాలనే అధ్యయనం చేశాడు.

నిగమములు వేయుఁజదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భారత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా

శౌనకముని పండితా వేలవకొలదిగా ఉన్న వేదశాఖలన్నింటిని
అధ్యయనం చేసినా ముక్తిసంపద సులభంగా లభించేది కాదు.
కాని భాగవతసంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది.

No comments:

Post a Comment