Tuesday, April 10, 2018

తీర్థాలు వివరణ


తీర్థాలు వివరణ




సాహితీమిత్రులారా!



కాశీఖండం ఆధారంగా కొన్ని వివరాలు
తీర్థాల గురించి గమనిద్దాం.
శ్రీశైలం మొదలైనవన్నీ దివ్యతీర్థాలు.
ముక్తి నిచ్చేది మాత్రం కాశీక్షేత్రం.
ప్రయాగ, నైమిశం, కురుక్షేత్రం, హరిద్వారం, అవంతి,
అయోధ్య, మధుర, ద్వారక, సరస్వతి, సహ్యం, గంగా
సాగర సంగమమం, కంచి, త్య్రంబకం, సప్తగోదావరం, 
కాలంజరం, ప్రభాసం, బదరికాశ్రమం, మహాలయం
(మహాకాలం), ఓంకారక్షేత్రం, పురుషోత్తమం, గోకర్ణం,
భృగుతీర్థం, అంబుపుష్కరం, శ్రీశైలం - ఇవి మోక్ష
కారణాలైన తీర్థాలు. 

శివుని అనుగ్రహం లేకపోతే తీర్థయాత్ర చెయ్యడానికి మనసురాదు.
తీర్థయాత్ర చేయకపోతే సంసారసంబంధమైన పాపం పోదు. పాప
సంహారం కాకపోతే కాశీనివాసం కలుగదు. కాశీనివాసం కలగకపోతే
విజ్ఞానదీపం వెలగదు. విజ్ఞానం కలగకపోతే మోక్షం సిద్ధించదు.
ఉపనిషత్తుల వారక్యార్థం తెలిసి ప్రవర్తించే తెలివికే విజ్ఞానం అని
సంజ్ఞ.
ధారాతీర్థం అనేది ఒకటి ముక్తినిస్తుంది. అదేమిటంటే యుద్ధంలో 
వెనుకంజ వెయ్యక శత్రుఖడ్గధారకు ఎదురునిలిచి పోరాడి, 
కుత్తుక తెగి, మరణించిన వీరుడు ముక్తి పొందుతాడు. దానికే 
ధారాతీర్థం అని పేరు. 

తీర్థాలు మానసాలు, బాహ్యాలు అని రెండు విధాలు. మానసాలైన 
తీర్థాలు ముక్తినిస్తాయి. మానసతీర్థాల సంబంధంలేనిదే జీవికి
బాహ్యతీర్థాలవల్ల ముక్తిరాదు.
సత్యం, ఇంద్రియ నిగ్రహం, అనసూయ, దానం, సమభావం, 
ఆత్మజ్ఞానం, పుణ్యకర్మాచరణం అనేవి మానసతీర్థాలు. వీటికే
అంతరతీర్థాలనిపేరు. ఇవి మనిషికి అంతశ్శరీరంలో ఉండేవి.
బుద్ధి పరిశుద్ధమై ఈ చెప్పిన తీర్థాల సంబంధం ఉన్నవానికి
ముక్కి అనేది అరచేతిలోని ఉసిరిక వంటిది. వీటిని కాదని 
పైన మనం చెప్పుకొన్న తీర్థలెన్ని సేవించినా ప్రయోజనం 
శూన్యం. అంతశ్శుద్ధి లేని బాహ్యశుద్ధి ఎన్ని తీర్థాలలో మునిగి
తేలినా వెయ్యి కడవల గంగాజలంతో కల్లుకుండను కడిగినట్లే.

అంతశ్శరీరంలో పుట్టే రాగద్వేషాదులవల్ల వచ్చే మాలిన్యాన్ని 
పోగొట్టేది మానసతీర్థం. పైనుంటే బురదను దుమ్మునూ మాత్రం
పోగొట్టేది బాహ్యతీర్థం. శరీరానికి సంబంధించిన అవయవాలకు 
ఉన్నట్టే మానసబాహ్యతీర్థాలకు తారతమ్యం ఉంటుంది.
తిరిగి తీసుకోకపోవడం(ప్రతిఫలం కోరకపోవడం. అదే 
అప్రతిగ్రహణం), అహంకారం లేకపోవడం, కోపం 
లేకుండటం, సోమరితనం లేకపోవడం, సత్యపాలన, 
శ్రద్ధ, హేతునిష్ఠ(చెయ్యవలసిన సత్క్రియకు తగిన కారణాన్ని
అనుసరించడం) పుణ్యక్షేత్రంలో ఉపవాసం చెయ్యడం, 
పితృతర్పణం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, పితృశ్రాద్ధం, 
పిండప్రదానం, శిరోముండనం(పుణ్యక్షేత్రాలకు వెళ్ళినపుడు
తల గొరిగించుకోవడం)- ఈవిధంగాతీర్థయాత్రకు సంబంధించిన 
నియమాలు పాటించాలి. ఇవిపాటించకపోతే తీర్థయాత్రా 
ఫలితం రాదు.

No comments:

Post a Comment