వేటకాడు - రాబందు
సాహితీమిత్రులారా!
"నాళం కృష్ణారావు" గారి "మీగడ తరకలు" నుండి
ఈ వేటకాడు - రాబందు.
ప్రపంచంలోని అన్ని వస్తువులలో నా బిడ్డలే
అందమైనవారని భావించే తల్లి మనసును
వివరించే గేయకథ ఇది.
వేటకుక్కలు డేగలు వెంట రాగ
వెడలె కానకు నొకనాడు వేటకాడు
అంతనతడేగెనో లేదొ కొంత దవ్వు
దారిలో నొక్క రాబందు తారసిల్లె
"అయ్య! మృగయుడ! నీవు వేటాడునపుడు
నాదు బిడ్డలలో నీకు నేది యైన
కానిపించిన, చంపక కాతుననుచు
అభయ హస్త మొసంగుమా!" అనుచువేడె
అంతనాతడు పక్షితో ననియె నిట్లు
"అట్టులేకాని, నీ బిడ్డలనుచు నేను
గుఱుతు పట్టుట యెట్టులో యెఱుగజాల
కాన చెప్పుమ యేదేని యానవాలు"
పక్కుమని నవ్వి యతనితో పక్కి యనియె
"ఔర! మృగయుడ! యెంత మాటాడినావు
పులుగు జాతుల నిన్నాళ్లు మెలగుచుండి
అడిగెదవె నాదు బిడ్డల యానవాలు?
జగములందలి బహు విధఖగములెల్ల
నాదు బిడ్డలతో సౌందర్యమందు
సాటి వచ్చునె! కాన నో వేటకాడ!
వాని నవలీల పోల్పగ వచ్చునీకు"
"పెక్కు మాటలికేల? ఓ పక్కి ఱేడ!
వినుము చెప్పెద నీ బిడ్డలనగ నేల?
సుందరంబగు పక్షుల జోలి బోవ
నంచు నేనిదె బాస గావించువాడ"
అనుచు వచియించి యాతడు వనములోని
కేగి దినమెల్ల పక్షుల నెన్నొ కూల్చి
వాని నన్నిటి నొక త్రాట వరుస గూర్చి
తరలి వచ్చుచునుండె నాదారి వెంట
ఎదురుగా వచ్చి రాపులు గిట్టులనియె
"అవుర! యెంతటి మోసకావుర నీవు?
మంచి మాటల నన్ను నమ్మంగ బలికి
నాదు బిడ్డల జంపంగ న్యాయమగునె?"
"నీదు బిడ్డలు లేవిందు నిక్కముగను,
నేడు చంపిన పిట్టలన్నింటియందు
అందమగు పిట్ట యొక్కటి యైన లేదు
నీవె చూడుము నామాట నిజమొ, కాదొ!"
"ఇంత మాత్రమె మూర్ఖుడా యెఱుగవైతి!
వవని యందలి సర్వ వస్తువులలోన
తనదు బిడ్డలె యధిక సోందర్య వంతు
లనుచు మనమున దలపని జననిగలదె?"
No comments:
Post a Comment