Tuesday, April 17, 2018

వేణుగోపాల శతకము - 1


వేణుగోపాల శతకము - 1

               

సాహితీమిత్రులారా!శతకాలలో అధిక్షేప శతకాలు
పూర్వం చాల ప్రసిద్ధి చెందినవి
వాటిలో పోలిపెద్ది వేంకటరాయకవి
కృత వేణుగోపాల శతకము చాల 
పేరున్న శతకం దానిలోని కొన్ని 
పద్యాలు మీకందిస్తున్నాను
చవిచూడగలరు-

1. కౌస్తుభవక్ష శ్రీకరపాద రాజీవ, దీనశరణ్య మహానుభావ
కరిరాజవరద భాస్కరకోటి సంకాశ, పవనభు గ్వరశాయి పరమపురుష
వేదవేద్యానంతవిభవ చతుర్ధశ, భువనశోభనకీర్తి పుణ్యమూర్తి
వైకుంఠపట్టణవాస యోగానంద, విహగరాడ్వాహన విశ్వరూప

నీలనిభగాత్ర శ్రీరమణీకళత్ర
సద్గుణస్తోమ యదుకుల సార్వభౌమ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

2. నినుసదా హృత్కంజమునఁ బాయకుండ నా, ప్రహ్లాదువలెను నేర్పరినిగాను
ఏవేళ నిను భజియించుచుండుటకు నా, ధ్రువచిత్తుఁ డైనట్టి ధ్రువుడ గాను
సతతంబ నిన్ను సంస్తుతి చేయుచుండ నా, వే శిరంబుల సర్పవిభుఁడగాను
నీవిశ్వరూపంబు సేవించుటకు వేయి, చక్షువుల్ గల్గు వాసపుఁడఁగాను

ఇట్టివారలఁ గృపజూచు టెచ్చుగాదు
దేవ నా వంటి దీనుని బ్రోవవలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

3. శ్రీ రుక్మిణీ ముఖసారస మార్తాండ, సత్యభామా మనశ్శశి చకోర
జాంబవతీ కుచశైల కంధర మిత్ర, విందాను సుధాధరబింబకీర
భద్రావయోవన భద్రేభరాజ క, శిందాత్మజా చిదానందనిలయ
లక్షణాశృంగార వీక్షణకాసార, హంస సుదంతా గుణాపహార

సుందర కపోలవిబుధ సంస్తుత కృపాల
వాల ధృతశైల కాంచనవర్ణ చేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

4. భనుకోటి ప్రభా భాసురంబగు వెల్గు, పరులు చూచినఁ గానఁబడని వెల్గు
గురు కృపచేఁ గాకగుఱ్తెఱుంగని వెల్గు, నమృతంపు వృష్టిచే నమరు వెల్గు
విద్యుల్లతాది పరివేష్టితంబగు వెల్గు, ఘననీల కాంతులఁగ్రక్కు వెల్గు
దశవిధ ప్రణవనాదములు గల్గిన వెల్గు, మౌనులెన్నఁగ రమ్యమైన వెల్గు

ఆది మధ్యాంతరరహిత మైనట్టి వెల్గు
ఇట్టి వెల్గును సేవింపనట్టి చెట్ట
వారికే లభించు కైవల్యపదము
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

5. వేదంబులును నీవె వేదాంగములు నీవె, జలధులు నీవె భూజములు నీవె
క్రతువులు నీవె సద్ర్వతములు నీవె కో, విదుఁ డటంచన నీవె నదులు నీవె
కనకాద్రి నీవె యాకాశంబు నీవె ప, ద్మాప్త సోములు నీవె యగ్ని నీవె
అణురూపములు నీవె యవనీతలము నీవె, బ్రహ్మము నీవె గోపతియు నీవె

ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాఁడ
గింకరుని జేసి ప్రోవు మంకించనుండ
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

6. వేదాంత మనుచు బ్రహ్మాదు లెంచిన వెల్గు, నాదాంత సీమల నడరు వెల్గు
సాధుజనానంద పరిపూర్ణమౌ వెల్గు, బోధకు నిలయమై పొసగు వెల్గు
ద్విదళాబ్జ మధ్యమం దుదయమౌ వెల్గు, సుషమ్న నాళంబునఁజొచ్చు వెల్గు
చూడఁజూడఁగ మహాశోభితంబగు వెల్గు, నిఖిల జగంబుల నిండు వెల్గు

శతకోటి సారస హితుల మించిన వెల్గు
మేరువు శిఖరంబుమీఁది వెల్గు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

7. వేదాంత యుక్తులు విని రెండు నేర్చుక, వాఁగి నాతఁడు రాజయోగి గాఁడు
కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి తెలియక, ప్రేలినంతనె శాస్త్రవేత్త గాఁడు
పట్టపురాజు చేపట్టి యుంచంగానె, గుడిసె వేటుకు బారి గుణము రాదు
ముండపై వలపున రెండెఱుంగక మోవి, యానఁగానె జొల్లు తేనెగాదు

కోఁతిపై నున్న సింగపుఁగొదమ కాదు
ఎంతచదివిన గులహీనుఁ డెచ్చుగాఁడు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

8. దండకమండలుధారులై కాషాయ, ములు ధరించిన దాన ముక్తిలేదు
భూతి గంపెడు పూసి పులిచర్మమును బూని, ముక్కుమూసిన దాన ముక్తి లేదు
తిరుమణి పట్టెఁడు తీసి పట్టెలు తీర్చి, భుజము గాల్చిన దాన ముక్తి లేదు
వాయువుల్ బంధించి ధీయుక్తి యలయఁగ, న్మూత వేసిన దాన ముక్తిలేదు

గురుపదాంబుజములు భక్తి కుదిరి తమ్ముఁ
దా యెఱుంగక ముక్తి లేదీమహి పయి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

9. దారిద్ర్యమనెడు భూధరచయంబులు గూల్ప, హరి నీదు భక్తి వజ్రాయుధంబు
అజ్ఞానమనెడు గాఢాంధకార మణంప, నీదు సపర్య భానూదయంబు
ఘోరమౌ దుష్కృతాంభోరాశి నింకింపఁ, గా నీదు సేవ దావానలంబు
చపలం బనెడు రోగసమితిని మాన్ప న, బ్జాక్ష నీ స్మరణ దివ్యౌషధంబు

వెన్నయుండియు నేతికి వెదకి నటుల
పరులవేఁడితి నీమహత్తెఱుఁగ లేక
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

10. సూక్ష్మపానము చేసి సొక్కినవేళ సా, మిత ధారణము చేసి మెలఁగువేళ
బడలిక పైనంబు నడచివచ్చిన వేళ, సుఖమంది హాయిని సొక్కువేళ
ఒంటరిగాఁ జీఁకటింట నుండినవేళ, నలుకతోఁ బవళించు నట్టివేళ
దెఁఱుగొప్ప మనమున దిగులు చెందిన వేళ, భక్తి గన్నట్టి విరక్తివేళ

లాభ్యభావంబుఁ జూడ సలక్షణముగ
బండువెన్నెల గతిఁ గానబడును ముక్తి
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

11. అగ్రజన్మము తీరవాసమందు వాసంబును, వితరణము ననుభవించు నేర్పు
సంగీత సాహిత్య సంపన్నతయు మతి, రసికత బంధు సంరక్షణంబు
ననుకూలమైన చక్కని భార్య రాజ స, న్మానంబు ప్రఖ్యాతి మానుషంబు
సౌందర్యమతి దృఢశక్తి విలాసంబు, జ్ఞానంబు నీ పదధ్యాన నిష్ఠ

ఇన్నియును గల్గి వర్తించుచున్న నరుఁడు
భూతలస్వర్గ ముదమును బొందుచుండు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

12. అబ్బ మేలోర్వ లేనట్టివాఁడైనను, మోహంబుగల తల్లి మూఁగదైన
ఆలు రాకాసైన నల్లుఁ డనాధైనఁ, గూ్తురు పెను ఱంకుఁబోతుదైనఁ
గొడుకు తుందుడుకైనఁ గోడలు దొంగైనఁ, దనకు సాధ్యుఁడుగాని తమ్ముఁడైన
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిఁ బోయి, చెప్పి యేడ్చెడు చెడ్డ చెల్లెలైన

నరుని ఖేదంబు వర్ణింపఁ దరము గాదు
అంతటను సన్యసించుట యైన మేలు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

13. అఱవ చెవుల కేల యరిది వజ్రపుఁ గమ్మ, లూరి తొత్తుకు విటుం డుండ నేల
గ్రుడ్డి కంటికి మంచి గొప్ప యుద్దం బేల, సరవి గుడిసెకు బల్ చాంది నేల
ఊరఁబందులకుఁ బన్నీరు గంధం బేల, బధీరున కల వీణపాట లేల
కుక్కపోతుకు జరీ కుచ్చుల జీనేల, పూఁటకూళ్ళమ్మకుఁ బుణ్యమేల

తనకు గతిలేక యొకఁ డిచ్చు తఱిని వారి
మతులు చెడిపెడి రండకుఁ గ్రతువు లేల
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

14. అలకాధిపతినేస్త మైనప్పటికిని బా, లేందు మౌళికి బిచ్చమెత్త వలసెఁ
గమలా సమున కెంత కరుణ రా నడచినఁ, గలహంసలకుఁ దూటి కాడలేదు
క్షీరాబ్ధి లంకలోఁ జేరినప్పటికైనఁ, గొంగతిండికి నత్త గుల్లలేను
పరగ సాహేబ సుబాయెల్ల నేలిన, బేగంబులకుఁ గుట్టి ప్రోగులేను

ఒకరికుండె నటంచు మేలోర్వ లేక
నేడ్వఁగ రాదు తన ప్రాప్తి నెన్న వలయు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

15. అల్పునిఁ జేర్చిన నధిక ప్రసంగియౌ, ముద్దు చేసినఁ గుక్క మూతినాకు
గోళ్ళ సాఁకినఁ బొంత కుండలో విష్ఠించుఁ, గొద్దితొత్తుల పొందు రద్ది కీడ్చు
గూబలు వ్రాలినఁ గొంప నాశముఁ జేయుఁ, జన వీయఁగ నాలు చంక కెక్కుఁ
బలువతో సరసంబు ప్రానహాని యొనర్చు, దుష్టుడు మంత్రుయై దొరను జెఱచుఁ

కనుక నీచెర్గి జాగరూకతను ప్రజలఁ
బాలనముఁ జేయు టది రాజ పద్ధతి యగు
మదరిపువిఫాల మునిజన హృదయలోల
వేణుగోపాల భక్త సంత్రాణశీల

No comments:

Post a Comment