Monday, March 20, 2017

ఇది ఎంతటి సత్యమో?


ఇది ఎంతటి సత్యమో?
సాహితీమిత్రులారా!


బలిజేపల్లి లక్ష్మీకాంతగారి
సత్యహరిశ్చంద్ర నాటకంలోని
శ్మశానరంగంలో కూర్చిన ఈ పద్యం
ఎంతటి సత్యమో చూడండి-

మాయామేయజగంబె నిక్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నాదు పుత్రుఁడని ప్రాణంబుండునందాక యెం
తో యల్లాడిన యా శరీర మిపు డిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు నా సుతులు తోడైరారు తప్పింపగన్

ఈ ప్రపంపచమే మాయ ఇందులో మోహంలో పడి నరుడు
నాభార్య, నాకొడుకులు, అని శరీరమున్నంతవరకు తాపత్రయ
పడిపోతున్నాడు. ఇప్పుడో (ప్రాణంపోయిన తరువాత) ఆ శరీరం
చితిలో పడి కాలుతూంది దీన్ని రక్షించడానికి ఆ భార్యగాని పిల్లలుగాని
ఎవరూరావడంలేదు - అని భావం
అంతే కదా ప్రాణం పోయిన తరువాత ఎవరికెవరు
ఈ ప్రాణం ఉన్నంతవరకే అన్ని బంధాలు బాంధవ్యాలు
ఇదే విషయాన్ని మరో రకంగా
ధూర్జటి
శ్రీకాళహస్తీశ్వర శతకములో

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహా ర్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!    

ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము - అని భావం

ఎవరు ఎన్ని విధాల చెప్పినా సరైన సమయంలో
భగవంతుని స్మరించుకొంటూ చివరికి భగవంతునిలో
చేరడమే మానవజీవిత పరమార్థం
ఇది ఎంటి సత్యమో కదా ఆలోచించండి.

No comments:

Post a Comment