చివురా? వాతెఱ
సాహితీమిత్రులారా!
హంసవింశతిలోని కొన్ని స్త్రీ వర్ణనలు-
చిన్న చిన్న పదాలతో కూర్చినవి-
చివురా? వాతెఱ; నల్లని
కవురా? నునుసోగవెండ్రుకలు; పుత్తడిమేల్
సవురా? దేహము; ముద్దుల
దవురా! అని జనులు పొగడ నాబిడ యలరున్
(3-194)
(వాతెఱ -పెదవి
నల్లని కవురా - నల్లని నిగనిగల తళుకా
పుత్తడి మేల్సవురా - మేలిమి బంగారు చాయయా)
విరులా? నగవులు, నీలపు
సరులా? కురు,లుబ్బుగబ్బి చన్నులు జాళ్వా
గిరులా? యూరువు లనఁటుల
సిరులా? యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్
(4-71)
(జాళ్వాగిరులా - బంగారు కొండలా
అనఁటుల సిరులా - అరటి స్తంభముల సంపదలా)
చిందమ్మనఁదగు గళమును;
గుందమ్ములతీరు రదనకోరకపంక్తుల్;
మందమ్ములు గమనమ్ములు;
కెందమ్ములచందములు సకియపాదమ్ముల్
(4-72)
(గళము - కంఠము
చిందమ్ము - శంఖము
రదనకోరకపంక్తుల్ - మొగ్గల వంటి పలువరుస
కుందమ్ముల తీరు - మల్లెమొగ్గల వంటివి
గమనమ్ములు - నడకలు
మందమ్ములు - మెల్లనైనవి
పాదమ్ములు - పాదములు
కెందమ్ములచందమ్ములు - ఎర్రదామర
పద్మములవంటివి.)
No comments:
Post a Comment