గరుత్మంతునికి తల్లి దీవెన
సాహితీమిత్రులారా!
గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని
గురించిన మాటలను విని
వెళ్ళి నాగులతో ఈ విధంగా అన్నాడు-
మా యీ దాస్యము వాయును
పాయము సేయుండు నన్ను బనుపుం డిష్టం
బేయది దానిన తెత్తున
జేయుఁడనై యమరవరులఁజేకొని యైనన్
(నాతల్లి యొక్క, నాయొక్క దాసితనం పోవటానికి
ఆలోచన చేయండి. నన్ను ఆజ్ఞాపించండి.
దేవశ్రేష్ఠులను లోబరచుకొనియైన మీకిష్టమయినదాన్ని
విజయంపొంది తెచ్చిస్తాను)
అపుడు ఆ నాగులు కరుణించి
గరుత్మంతునితో ఇలా అన్నారు-
అమితపరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరో
త్తముఁడవు నీవు నీదయిన దాస్యముఁ వాపికొనంగ నీకుఁ జి
త్తముగలదేని భూరిభుదర్పము శక్తియు నేర్పడంగ మా
కమృతముఁ దెచ్చియిమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసం బునన్
(నీవు అంతులేని విక్రమమును, వేగాన్ని బలాన్ని కలిగిన
పక్షిశ్రేష్ఠునివి. నీకు గలిగిన దాస్యాన్ని పోగొట్టుకోవాలనే
అభిప్రాయం ఉంటే గొప్ప భుజాల గర్వమును శక్తిని కలిగేట్టు
మాకు అమృతం తెచ్చివ్వు అని పాములనగా,
ఆ పక్షీంద్రుడైన గరుత్మంతుడు సంతోషంతో.........)
అలాగే చేస్తాను అని చెప్పి జరిగిన వృత్తాంతాన్నంతా
తన తల్లి అయిన వినతకు వివరించి చెప్పి అమృతం
తేవడానికై వెళుతున్నాను న్ను దీవించమని తల్లిపాదాలకు
నమస్కరించిన వినత సంతోషించి కొడుకును కౌగిలించుకొని
తరువాత ఇలా దీవించింది-
అనిలుడు పక్ష్మయుగ్మ మమృతాంశుఁడు వీపనలుండు, మస్తకం
బినుఁడు సమస్త దేహమును నెప్పుడుఁగాచుచు నీకభీష్ట ముల్
ఘనముగఁ జేయుచుండెడు జగన్నుత యున్నతియున్ జయంబుఁజే
కొనుమని యిచ్చె దీవెనలు గోరి ఖగేంద్రునకుం బ్రియం బునన్
(వాయువు రెక్కల జంటని, చంద్రుడు వీపును, అగ్ని తలను,
సూర్యుడు శరీరాన్నంతటిని సర్వదా రక్షించుచు, నీకు కోరికలు
గొప్పగా(నెరవేరునట్లు) చేయుదురుగాక, లోకములచే నుతింప
బడువాడా గొప్పతనమును విజయమును గ్రహింపుము -
అని వినత మనస్సున కోరి పక్షులకు రాజైన గరుడునికి
ప్రీతితో ఆశీస్సు లిచ్చిపంపెను)
అలా వెళ్ళిన వాడు దేవతలను జయించి అమృతం
తెచ్చి పాములకు ఇచ్చి దాసీత్వాన్ని పోగొట్టుకున్నాడు.
తల్లిదీవెన ఎంతో గొప్పదోకదా!
(ఆంధ్రమహాభారతం ఆదిపర్వం ద్వితీయోశ్వాసం నుండి )
No comments:
Post a Comment