Wednesday, December 27, 2017

భిక్ష మెత్తితి వేల - సిగ్గుపడక


భిక్ష మెత్తితి వేల - సిగ్గుపడక



సాహితీమిత్రులారా!


శేషప్పకవిగారి నరసింహ శతకంలోని
ఈ పద్యం చూడండి-
కవి భగవంతుని ఏవిధంగా నిలదీస్తున్నాడో

వాంఛతో బలిచక్రవర్తి దగ్గరఁజేరి
        భిక్ష మెత్తితివేల - బిడియపడక!
అడవిలో శబరి తీయని ఫలాలందియ్య
        జేతు లొగ్గితి వేల సిగ్గు పడక!
వేడ్కతో వేవేగ విదురునింటికి నేగి
        విందు గొంటివదేమి వెలితిపడక
నటుకు లల్పము కుచేలుఁడు గడించుకు డేగ
        బొక్క సాగితివేల లెక్కగొనక
భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను
వారి కాశించితివా తిండివాఁడ వనుచు!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

ఓ లక్ష్మీనారాయణా! నీకేంకొదువ సిగ్గుపడకుండా
బలిచక్రవర్తిని బిక్షమడిగినావు?. అభిమానం అనేకూడ
తలచుకోకుండా అడవిలో శబరి ఎంగిలి ఎందుకు తిన్నావు?
వేగంగా విదురునింటికి పోయి కక్కుర్తిగా విందారగించావెందుకు?
కటిక దరిద్రుడైన కుచేలుడిచ్చిన పట్టెడు అటుకులకే
అమితమైన ధన, కనక, వస్తు వాహనాలనెందు కిచ్చావు?
భక్తులకు నీవివ్వడం భావ్యమేకాని భక్తులనుండి నీవు
తీసుకోవడం నీకు భావ్యమా! ఓ స్వామీ! తిండిపోతంటారు
- అని భావం

No comments:

Post a Comment