Monday, January 1, 2018

కాళిదాసు వర్ణనలు


కాళిదాసు వర్ణనలు




సాహితీమిత్రులారా!



మహాకావ్యాల్లో అష్టాదశ వర్ణనలు తప్పనిసరి అవి తగ్గినా
మహాకావ్యంలో లోటు కనబడుతుంది అంటారు అలంకారికులు.
అష్టాదశ వర్ణనలు కాకుండా వేరు వర్ణనలే లేవా అంటే ఉన్నాయి.
18 వర్ణనలు ప్రధానమైనవి మిగిలినవి కావని అనుకోక్కరలేదు.

ఇక్కడ ప్రధానంగా కాళిదాసు వర్ణనలు 7 అని విభజించారు కాదంబిని అనే సాహిత్యవ్యాససంపుటిలో కాళిదాసుని కమనియవర్ణనలు -పేర
కూర్చిన వ్యాసంలో సి.వి.శేషాచార్యులవారు. ఆ వర్ణన విభజన
1. ప్రకృతి వర్ణన, 2. స్వరూప వర్ణన, 3. స్వభావ వర్ణన,
4. అవస్థా వర్ణన, 5. సంవాద వర్ణన, 6. సందేశ వర్ణన,
7. సంక్షేప వర్ణన.

ఇందులో మనం ఇక్కడ స్వరూప వర్ణన చూద్దాం.
1. కుమార సంభవంలో పార్వతీ వర్ణన,
2. మేఘసందేశంలో యక్షకాంత వర్ణన.
దేవతల స్వరూపాము పాదములు మొదలు
కేశాంతముల వరకు వర్ణించటం సాంప్రదాయం.
అలాగే మానస్వరూపము కేశములుమొదలు
పాదాంతములవరకు వర్ణించుట సాంప్రదాయం.
అందుకే పార్వతి వర్ణన పాదాది కేశాంతంగా వర్ణించాడు.
ఇందులో ఆమె ముఖాన్ని ఈ విధంగా వర్ణించాడు.
చంద్రుడు సుందరుడే, అమృతకిరణుడే, ఆహ్లాదకారియే.
అయినా అతనిలో సౌగంధ్యము(సువాసన) కొంతైనాలేదు.
మార్దవ మసలే లేదు. మరి పద్మమో సుందరమే సౌగంధికమే
కాని దానిలో అమృతవోలె ఆనందింపచేయు చంద్రకాంతి
కనబడదు. ఈ రెండింటిని కవి పరిశీలించినాడు. ఈ గుణాలన్నీ ఒకచోట ఉంటే బాగుంటుందికదా అని ఆలోచించాడు. పార్వతీ ముఖంలో ఈ రెండు గుణాలు కూర్చి సంతుష్టుడైనాడు.

చంద్రం గతా పద్మగుణాన్ న భుంక్తే
పద్మాశ్రితా చాంద్రమసీమభిఖ్యామ్
ఉమాముఖం తు ప్రతిపద్య లోసా
ద్విసంశ్రయాం ప్రీతి మవాప లక్ష్మీః
          (కుమారసంభవమ్ - 1-43)
ఇక్కడ కవి లక్ష్మి అనే సౌందర్యమును ఆరాధించే దేవతను
కల్పించినాడు. ఆమె చంద్రుడు, పద్మం సుందరములని విని
ముందు చంద్రుని వద్దకు వెళ్ళింది. అతనిలో పద్మ గుణాలు
కనిపించలేదు. పద్మం వద్దకు చేరింది. ఇక్కడ చంద్రుని
వద్దనున్న కాంతి విశేషం లేదు ఇపుడు సమగ్రమైన సౌందర్యాన్ని
అన్వేషించటాని ఆమె పద్మాన్ని వదలి పార్వతి వద్దకు చేరింది.
పార్వతి వద్ద తను అన్వేషిస్తున్న రెండు గుణాలు ఉండటం చూచి
సంబరపడిపోయిందట ఇది పై శ్లోక భావం

          ఇక్కడ ముఖానికి రెండే ఉపమానాలు ఒకటి చంద్రుడు,
 రెండవది కమలం, వస్తుతః ఉపమేయంకన్నా ఉపమానం
ఉత్కృష్టమై ఉంటుంది. ప్రకృతం అలాంటి ఉపమానాలకంటే
ఉపమేయమే ప్రకృష్టమైనది కావడం వల్ల ఇది వ్యతిరేకాలంకారమైంది.

         ఇక్కడ చెప్పిన శ్లోకాన్ని బట్టి పార్వతీదేవి
ముఖసౌందర్యం చెప్పినాడేకాని ముఖచిత్రం
గీచేంతగా చెప్పలేదు. అలాంటి వర్ణన
ఈ శ్లోకంలో చూడండి. మేఘసందేశంలో
యక్షుడు మేఘానికి తన భార్య
గుర్తులు చెబుతున్నాడు-

తన్వీ శ్యామా శిఖరిదశనా పక్వబింబాధరోష్ఠీ
మధ్యే క్షామా చకితహరిణీప్రేక్షణా నిమ్ననాభిః
శ్రోణిీభరా దలసగమనా స్తేకనమ్రా స్తనాభ్యాం
యా తత్ర స్యా ద్యువతివిషయే సృష్టి రాద్యేవ ధాతుః
               (మేఘసందేశం - 2- 21)
మేఘునితో యక్షుడు ప్రియురాలికి సందేశం పంపాలి.
మేఘుడు తనభార్యను గతంలో చూచినవాడు కాదు.
అందుకే యక్షుడు అలకాపురిలో తన ఇంటి గుర్తును
మొదట చెప్పి తన భార్యను గురించి ఇలా వర్ణించాడు-

నా ప్రియురాలు సన్నని శరీరంగలది. నడి యౌవనం కలిగినది.
సన్నని కొనదేరిన పలువరుస కలది. బాగా పండిన
దొండపండు వలె ఎర్రని పెదవికలది. బెదరిన ఆడులేడి
వలె బెళుకు చూపులుకలది. జఘన భారంతో మెల్లగా నడచేది.
స్తనభారంతో కొద్దిగా వంగినది. స్త్రీ సృష్టికై బ్రహ్మ చేసిన తొలి ప్రయత్నమా -
అని అనిపించేది.

ఈ వర్ణనతో యక్షకాంత మేఘునికే కాదు
మనముందుకూడా కనబడుతున్నదికదా అన్నట్టున్నది.


No comments:

Post a Comment