Monday, December 18, 2017

బీదపూజ


బీదపూజ
సాహితీమిత్రులారా!కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి
కవితాఖండిక ఇది. ఇది ఉదయశ్రీ - లోనిది.
కడుపేదవాడొకడు దైవపూజకు పూలకై వెళ్ళి
అవి లభింపక తిరిగివచ్చి దేవునికి
తన దీన స్థితిని వివరించుకున్నదే
ఈ కవితాఖండిక చూడండి-

"వాడిన గ్రుడ్డిపూలు గొనివచ్చెను వీ" డని జాలిమాలి నో
నాడకు మో దయామయ యథార్థము నీకడ విప్పిచెప్ప నో
రాడుటలేదు - పూలకొరకై పువుదోటకు నేనుగూడ జ
న్నాడను - పుష్పమొక్కటయినన్ లభింపకపోయె నా కటన్

వారలు పెద్దపెద్ద ధనవంతుల బిడ్డలు - మంచి మంచి బల
గారపు పూలబుట్టలను గైకొని పోయిరి ముందుగానె - మా
బూరుగుచెట్టుక్రింద పడిపోయిన గోడల పూరిపాకలో
దూరిన లేత వెల్గులకు దుప్పటినెత్తితి - అమ్మలేపినన్

లేచి - చిఱుచాప నొకమూల దాచిపెట్టి
ప్రాత తాటాకుబుట్టను చేతబట్టి
పొంత లోపలి జల మింత పుక్కిలించి
తల్లి కాళ్ళకు వంగి వందన మొనర్చి!

తెలతెలవాఱుచుండ జనితిన్ విరితోటకు - తోటమాలి త
ల్పులు బిగియించె నా చినిగిపోయిన గుడ్డలు నన్నుజూచి; కా
ళుల బడి, గడ్డమంటి, యెటులో బతిమాలి, యవస్థనంది లో
పల బడినాను - చెంత గనుపట్టిరి మిత్రులు పూలుగోయుచున్

చకచక పూలు గోసికొని సాగిరి వారలు - శూన్యకుంజ మా
లిక లెటు చూచినన్; మిగులలే దొక పుష్పముకూడ నాకు నే
నొకదెస విన్నబోయి నిలుచుంటి; ననున్ గని వారలందఱున్
పకపక నవ్వినారు - తలవంచితి నేనొక కొమ్మచాటునన్

పట్టిపూమొక్క లన్ని నా వంక చూచి
ప్రసవబంధాలు సడల బాష్పములు రాల్చె;
చేతిలోనున్న బుట్టను చింపివైచి
తిరిగివచ్చితి గుండెలు దిగబడంగ

ఇంటికి వచ్చుచుండ గనిపించిరి దేవర దేవళమ్ములో
మంటపమందు పుష్పములు మాలలు గ్రుచ్చుచు వారు - పోయి కూ
ర్చుంటిని నేను కూడ నొకచో నొక స్తంభమువెన్క - ఇంతలో
గంటలు మ్రోగి - అర్చనలకై గుడులోనికి పోయి రందఱున్

పూజలై మిత్రు లిండ్లకు పోయినారు
రిక్తహస్తాల నిన్ను దర్శింపలేక
మంటపము ప్రక్క ధూళిలో నిండియున్న
గ్రిడ్డిపువ్వులనే యేరుకొంటి నేను

పరిమళము లేక - ఎవరికి పనికిరాక -
పాఱవేయ బాటల ప్రక్కపడి - కరాళ
కాల పురుషుని కాఱు చక్రాల క్రింద
బ్రతుకలేక దరిద్ర పుష్పమ్ము లివ్వి

ఈ యనాథ సుమాలనే - ఈ విశీర్ణ
జీర్ణకుసుమాలనే - ఈ కృశించు మ్లాన
హీన దీన ప్రసూనాలనే - త్వదంఘ్రి
సేవకై దోయిలించి తెచ్చితిని నేను

పూల దోసిలి కన్నీట పొరలిపోయె
విరుల మాలిన్య మంతయు వెడలిపోయె
ఆగియుంటి ప్రభూ స్వామియాజ్ఞకొఱకు
ఆదరింతువొ లేదొ నా "బీదపూజ"


No comments:

Post a Comment