Sunday, December 3, 2017

స్వర్గంలో విప్లవము


స్వర్గంలో విప్లవము




సాహితీమిత్రులారా!

గతంలో భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి
ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం లో వికసించిన
కవిత ఇది. తెలుగు సాహిత్యం, తెలుగు సంగీతం, తెలుగు సంస్కృతి, 
తెలుగు శిల్పం, తెలుగు నాట్యం, తెలుగు చలనచిత్రరంగం, తెలుగువారి 
అభిరుచులు స్వర్గానికి ఎలా వ్యాపించిందీ, స్వర్గవాసులలో
ఎటువంటి మార్పుతెచ్చిందీ, సంభావించిన ఊహాచిత్రం ఇది.
ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ఉదయశ్రీ - 5 లోనిది.

"ఇందిరా! ఇదేమి? ఇంటిలో కూర్చుండి
వంటచేయుచుంటి వొంటరిగాను?"
"అక్క!  భాగ్యనగరమట!  తెల్గుసభలంట!
కోడలమ్మపోయి కులుకుచుండె!!"

స్వర్ణదీతటాన సౌపర్వకన్యలు
"ఎంకిపాట" లభినయింతురంట!
ప్రతిదినమ్ము అదితి "బంగారుబొమ్మ పూ
ర్ణమ్మ" మోము ముద్దులాడునంట!

"త్యారాజు" గారి తంబురా శ్రుతి విని
వాణి వీణ మౌన మూనెనంట!
"ఘంటసాల" వారి గానామృతము గ్రోలి
అమృత మొల్లరంట అమరులెల్ల!

అమరకాంతలెల్ల "అమరావతీకేశ
బంధము"లకె మోజుపడుదురంట!
చెక్కిరంట దేవశిల్పులు "ఓరుగల్
ద్వారబంధము"ను సుధర్మముందు!

సిద్ధహస్తుడై "క్షేత్రయ్య" గారికి
రంభ ప్రణయలేఖ వ్రాసెనంట
"కూచిపూడిబాణి" క్రొత్తగా నేర్చిన
అచ్చరలకు విలువ హెచ్చెనంట!

ఒకటి రెండు సార్లు "ఊర్వశి" రాదాయె
ఇంద్రసభకు; ఎచటి కేగె నామె?
తెలుగు చలనచిత్రకళ ప్రేమతో పిల్వ
దివిని విడిచి భువికి దిగెను మగువ!

భాగ్యనగరి ద్రాక్షపండ్లు తెచ్చివగాని
తెరవదంట తలుపు దివిజగృహిణి!
అమృతమానువేళ "ఆవగాయ"ను సురల్
నంచుకొందురంట నడుమ నడుమ!

భాగవతములోని పద్యాలతో శచీ
దేవి పెదవి మరియు తీపియెక్కె!
రుచులు పల్లవించు శచిమోవి క్షణమైన
వీడలేడు నేడు వేల్పుఱేడు!

కవి సమూహమందు కాళిదాసుడు లెస్స!
మహలులందు తాజమహలు లెస్స!
నగరులందు భాగ్యనగియే హైలెస్స!
దేశభాషలందు తెలుగు లెస్స!!

(ఈ నెల 15వ తేదీ నుండి  భాగ్యనగరిలో ప్రారంభమౌ 
ప్రపంచ తెలుగు  మహాసభలకు
గుర్తుగా మరోమారు ఈ కవితను ఇక్కడుంచాను.)

No comments:

Post a Comment