Monday, April 3, 2017

ఏ దోషము లేనివారెవరు?


ఏ దోషము లేనివారెవరు?




సాహితీమిత్రులారా!


ఈ ప్రపంచంలో ఏ తప్పులేని
వారెవరైనా ఉన్నారా అంటే
సమాధానం దొరకటం కష్టమే

ఈ సుభాషితం చూడండి-

నిలువెల్ల నేత్రముల్ గలవాఁడు శక్రుండు,
        చంద్రుండు మలినాంకు సంయుతుడు,
వ్రజకులమందు నుద్భమయ్యెఁ జక్రహ
        స్తుఁడు, వసిష్ఠుఁడు పణ్య సుదతికొడుకు,
తనుహీనభూతమై తనరు రతీశుండు,
        వైశ్వానరుఁడు సర్వభక్షకుండు
కైవర్తకులసతీ గర్భజాతుఁడు వ్యాసుఁ,
         డంభోధి కడులవణాన్వితంబు,
శవసమూహాస్థిధరుఁడల శంకరుండు
బహుజనకులకుఁ బొడమిరి పాండు సుతులు
ముజ్జగంబుల నేదోషముం బొరయని
యాతఁడొకఁడేని లేఁడు లేఁడరసిచూడ
                                       (సుభాషిత రత్నమాల - 103)

నీలువెల్లా కండ్లున్నవాడు ఇంద్రుడు
- దేవతలకు రాజు

మచ్చగుర్తుతో కూడినవాడు చంద్రుడు
-రాత్రికి రాజు

గొల్లకులంలో పుట్టినవాడు కృష్ణుడు
- జగద్గురువు

వెలయాలికి పుట్టినవాడు వసిష్ఠుడు
- సప్తర్షులలో ఒకడు

శరీరమేలేనివాడు మన్మథుడు
- రతిరాజు (ప్రేమకే రాజు)

అన్నిటినీ తినేవాడు అగ్ని(వైశ్వానరుడు)
- అతిశుచికరమైనవాడు పునీతుడు

బెస్తకులము పడతికి పుట్టినవాడు వ్యాసుడు
- నారాయణుడు, శంకరుల తరువాతి గురువు

సముద్రమో ఉప్పుతో కూడినది
- గొప్పవాడు
ఎముకలను మాలగా తాల్చువాడు శివుడు
- శుభంకరుడు శంకరుడు

అనేకులైన తండ్రులుగలవారు పాండవులు
- ధర్మాత్మలు

ఇటువంటివారికే దోషాలుంటే

ఈ మూడు లోకాలలో ఏ దోషం లేనివారు ఎవరు
వెదకి చూచినా లేరుగాక లేరు

No comments:

Post a Comment