Sunday, April 23, 2017

పెద్దనగారి ఆవేదన


పెద్దనగారి ఆవేదన




సాహితీమిత్రులారా!


శ్రీకృష్ణదేవరాలవారి మరణానంతరం
పెద్దన ఆయనను తలచుకొంటూ
ఆవేదనతో చెప్పిన పద్యం -

ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి
        కేలూతయొసంగి యెక్కించు కొనియె
మనుచరిత్రం బందు కొనువేళ పురమేగ
         పల్లకి తనకేల పట్టియెత్తి
కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు
         లడిగిన సీమలయందునిచ్చె
బిరుదైన కవి గండపెండీరమున కీవ
         తగుదని తానె పాదమున దొడిగె
ఆంధ్రపితామహ అల్లసాని
పెద్దన కవీంద్ర యని తన్ను బిల్చునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక
బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబనగుచు.

కృష్ణదేవరాయలు ఎప్పుడైనా ఏనుగు మీద
వెళుతున్నపుడు పెద్దన ఎదురైతే ఆయన క్రిందికి
దిగి తనను ఏనుగుపైకి ఎక్కించుకొనేవాడు

మనుచరిత్ర కావ్యాన్ని అంకితం తీసుకొనే
సమయంలో పల్లకీ ఊరేగింపులో, తన చేతితో
రాయలు పల్లకీ ఎత్తినాడు.
అడిగిన చోట తనకు కోకటాది గ్రామాలను
అగ్రహారాలుగా ఇచ్చినాడు

గండపెండరం ధరించటానికి నీవే తగినవాడివని
స్వయంగా తానే పాదానికి తొడిగినాడు.

ఆంధ్రపితామహా అని గౌరవంతో పిలిచి సత్కరించిన
రాయలతోటి నేనూ స్వర్గానికి పోక జీవచ్ఛవంగా మిగిలి ఉన్నాను
అని ఆవేదన చెందినాడు పెద్దనగారు.

No comments:

Post a Comment