గర్భవతి వర్ణన
సాహితీమిత్రులారా!
చక్రపురి రాఘవాచారిగారి
నలచరిత్ర (ద్విపద)నుండి
గర్భవతీవర్ణన గమనించండి
ఎంత చక్కగా చేశారో చూడండి-
పరిపూర్ణ సోముని బడలించు మోము
దొరకొని వేగుచంద్రునిరీతి నుండె
ననవిల్తు పూచెండ్లనందగు చనగల
మొనల నల్లని వర్ణములు గానిపించె
మృదుబింబముల వన్నె మెచ్చని మోవి
కదిసిన మలినంబు గప్పినట్లుండె
బడలికల్ మేనునఁ బర్వె నందంద
నడు మమందం బాయె నాభి గన్పడియె
సవరని నల్లపూసలపేరుఁ బోలె
నవిరళంబగు నూగారుఁ జూపట్టెఁ
గలికిచూపుల చంద్రికల్ పర్వె ననఁగఁ
బలుకఁబాఱెను గండపాళికాయుగళ
మలివేణి ముఖచంద్రుఁ డమృతంపు రసము
చిలుకు చందంబునఁజిట్టుము లెసఁగె
గగనభాగంబు సాకారమై యొప్పు
పగిదిఁ గౌదీఁగె చూపట్టె నానాఁట
(నలచరిత్ర - 3- 95నుండి 98)
కవి గర్భవతి లక్షణాలను వర్ణిస్తున్నాడు-
నాయిక ముఖం చూసి నిండు చంద్రుడు
కూడ అసూయపడతాడు అంత అందంగా
ఉంటుంది నాయికముఖం. అలాంటి ముఖం
ఇప్పుడు కాస్త పాలిపోయి తెల్లవారుజామున
చంద్రునిలా ఉంది.
నాయిక వక్షోజాలు మన్మథుని ఆయుధాలైన
పూలగుత్తుల వలె ఉన్నాయి. వాటి మొనలు
నలుపెక్కాయి.
ఆమె పెదవి దొండపండు కంటె ఎక్కువ ఎఱ్ఱగా
ఉంటుంది. కాని ఇపుడు నల్లదనం కప్పినట్లున్నది.
శరీరంలో అలసటలు క్రమ్ముకున్నాయి.
సన్ని నడుము ఇప్పుడు చెద్దదయింది.
ఇంతకుముందు కనిపించని బొడ్డు
ఇప్పుడు నడుము పెద్దదయి స్పష్టంగా
కనబడుతున్నది.
నాయిక నూగారు గ్రుచ్చని నల్లపూసలదండలా
దట్టంగా కనిపిస్తోంది. ఆమె చూపులు వెన్నెల
చెక్కిళ్ళమీదకు వ్యాపించడంవల్ల తెల్లబడ్డాయా
అన్నట్లుగా ఆమె చెక్కిళ్ళు తెల్లబడ్డాయి.
గర్భవతులకు నోటిలో నురుగుతో కూడిన ఉమ్మి
ఎక్కువగా ఊరుతుంది. అవే చిట్టుములు.
తుమ్మెదల వంటి జుట్టు కల ఆ నాయిక యొక్క
ముఖమనే చంద్రుడు అమృతరసం చిలుకుతున్నట్లుగా
ఆమె చిట్టుములు ఎక్కువయ్యాయి. ఆకాశానికి
రూపం వచ్చినట్లుగా ఆమె తీగ వంటి నడుము
క్రమక్రమంగా పెద్దదవడం వలన కనబడుతోంది.
నిజానికి ఆకాశానికి ఆకారం లేదు. అందువలన
ఆకాశం కనబడేది కాదు. కాని ఇపుడు ఆమె గర్భవతి.
నడుము చెద్దదయింది. ఆకాశానికి ఆకారం వచ్చినట్లుగా
కనబడుతున్నది.
No comments:
Post a Comment