Friday, April 1, 2016

చమత్కార పద్యం - 5


చమత్కార పద్యం - 5

సాహితీమిత్రులారా!

                            కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల పేర్లు అనేక విధాలుగా చెప్పడం జరుగుతోంది. ఈ పేర్లలో కవయిత్రి మొల్ల పేరుకూడా వినబడుతూవుంది. కవయిత్రిమొల్ల మొదటిసారి రాయలవారిని దర్శించుకున్న సమయంలో ఆమె ప్రభువులను ప్రస్తుతిస్తూ ఇలా చెప్పారు.

అతఁడు గోపాలకుండితఁడు భూపాలకుం 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవపక్షుఁడితఁడు పండిత రక్షుఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచకపోషి 

యెలమి నాతనికన్ననితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి 

యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
పల్లె కాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీలకితఁడు
సురల కాతండు తలప భూసురులకితఁడు
కృష్ణుఁడాతండు శ్రీ మహాకృష్ణుఁడితఁడు

అని కృష్ణుని, శ్రీకృష్ణదేవరాయలను పోల్చి, కృష్ణునికన్న రాయలే గొప్ప అని చమత్కరించి చెప్పినది. ఈ పద్యాన్ని విన్న తెనాలిరామకృష్ణుడు తన సహజ వికట స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఇలా చమత్కరించాడు.

అతఁడంబకు మగఁడు ఈతఁడమ్మకుమగఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలముద్రిప్పు నితఁడు వాలముద్రిప్పు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్ముననేయు నితఁడు కొమ్మునఁడాయు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటనుజిచ్చు నితని కంటను బొచ్చు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

దాతయాతండు గోనెల మోతయితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుఁడాతండు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు.

అని ఈశ్వరుని, నందీశ్వరుని పోల్చి, ఈశునికన్న నందీశుడే గొప్పని వికటంగా చమత్కరించాడు.




No comments:

Post a Comment