రసమయి
సాహితీమిత్రులారా!"కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి" గారి కలంనుండి జాలువారిన
ఉదయశ్రీ (అయిదవ భాగం)లోని "రసమయి" పేరున గల
ఈ మూడు పద్యాలను ఆస్వాదించండి.
కలువలు పూచినట్లు! చిరుగాలులు చల్లగ వీచినట్లు! తీ
వలు తల లూచినట్లు! పసిపాపలు చేతులు సాచినట్లు! క్రొ
వ్వలపులు లేచినట్లు! చెలువల్ చెలువమ్ముగ చూచినట్లుగా
పలుకుట పూర్వపుణ్యపరిపాకముగాదె తలంచి చూడగన్
తెలతెలవారులీల! తొలిదిక్కున బాలమయూఖ మాలికల్
కలకలలాడులీల! కమలమ్ములజంట సరోవరమ్ములో
కిలకిల నవ్వులీల! గిలిగింతలతో సెలయేటి కాలువల్
జలజల పారులీల! కృతిసల్పుట భాగ్యము యోగ్య మెంతయున్
"ఛందోబద్ధకవిత్వ" మట్లు బిగువుం జందోయి కందోయికిన్
విందుల్సేయ "స్వతంత్రగీతిక" వలెన్ నెమ్మోముపై ముంగురుల్
చిందుల్ త్రొక్క "కథానికా" విధమునన్ చిర్నవ్వు చెక్కిళ్ళలో
స్పందింపన్ కనుముందు నిల్చు రసనిష్యందంబ! నీ వెవ్వరే?
No comments:
Post a Comment