భృంగ పంచకం
సాహితీమిత్రులారా!
తెలుగులో భృంగ పంచకం పేరుతో ఐదు పద్యాలున్నాయి. ఇవి ఎవరు రాశారో తెలీదుగానీ, శ్రీనాథుడని కొందరి అభిప్రాయం. ఈ ఐదు పద్యాల చుట్టూ మాంచి కత కూడా అల్లిపెట్టారు మన పూర్వులు. కథలో కెళితే.....
పూర్వం ఒక మహారాజుకు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. రాజులకు అనేక మంది భార్యలు ఉండటం సహజం వారిలో ఈవిడ చిన్నదిగా అనుకోవచ్చు. మహారాజు వల్ల పూర్తి చెందక మదనజ్వరంతో వేగిపోతోంది. ఆ రాజ్యంలో మంత్రి ముసలివాడు కావడంతో, అతని కుమారుని ఆపదవిలోకి నియమించాడు రాజు. కొత్తమంత్రి మంత్రాంగనిపుణుడేకాదు అసాధారణ సౌందర్యవంతుడు. రాణిగారి కన్ను ఇతనిపైబడింది. చాతుర్యధుర్యయైన చేటికచేత రాయబారాలు నడిపింది. అతడేమి తక్కువవాడా! వచ్చిన అవకాశాన్ని వదులుకొనే అరసికుడా! వచ్చిన చిక్కల్లా ఆమెతో సంగమం ప్రమాదకరం కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. "కామాతుకాణాం నభయం నలజ్జ" అనికదా! కామాతురత భయాన్ని దాటి పురికొల్పింది. చీకటి పడిన తరువాత రాణిదూతిక ఏర్పరచిన సంకేతాన్ని అనుసరించి, ఆమె భవనానికి చేరుకున్నాడు. మదనక్రీడా పారవశ్యంలో వారికి సమయం తెలియలేదు.
ఇంతలో మహారాజు నెమ్మదిగా తన భవనం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఆరోజు సప్తమో? అష్టమో ?చంద్రుడుకూడా ఆలస్యంగా ఉదయించాడు. ఈ పరిస్థితి చూచిన చెలికత్తె తుమ్మెదపై పెట్టి అన్యాపదేశంగా మంత్రిని హెచ్చరించింది.
మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
నీయెడ పూవుదేనియల నింపు జనింపగ గ్రోలి సొక్కియున్
బోయెదనన్న భ్రాంతి నిను బొందదు రాజుదయించె నిప్పుడే
తోయజపత్రముల్ వరుసతో ముకుళించె జలింపకుండుమా!
(ఈ పద్యం పైకి కనిపించే భావం - ఓ తుమ్మెదా మంచి మల్లెలను విడచి తామరపువ్వులోని మకరందం మీదమోజుతో ఇక్కడ చేరావు. ఎంసేపటికీ విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకోవడంలేదు. చంద్రుడు ఉదయించినాడు. తామరరేకులు ముడుచుకుంటున్నవి. ఇప్పుడు బయటికి పోలేవు. కదవిక లేకుండా జాగ్రత్తగా ఉండు.దీనిలోని ధ్వని(ఆంతర్యం)- ఓ మంత్రిశేఖరా నీ భార్యను విడిచి, రాణితో క్రీడిస్తూ ఆలస్యం చేశావు. ప్రభువు వస్తున్నాడు. (రాజు - ప్రభువు, చంద్రుడు). అయినా భయపడక దాక్కో.)
లోపల ఉన్న ఇద్దరూ ఈ హెచ్చరికతో జాగ్రత్తపడ్డారు. ఈ పద్యం విన్న మహారాజుగారు చెలికత్తెను ప్రశ్నించగా. ఆమె తామరలను చూచి చెప్పానని చమత్కరించింది.
మంత్రి దాగినచోటు ఇరుకు, గాలి లేదు. బాధతో అటూ ఇటూ కదులుతున్నాడు. మహారాజు ఆ సంగతి కనిపెడితే ప్రమాదమని చెలికత్తె చతురిక మళ్ళీ ఇలా హెచ్చరించింది.
అలికులవర్య! పద్మముకులాంతమందు వసింప నేరమిన్
జలనము సెందె దేమి నవసారసమిత్రుడు రాకయుండునా
తొలగక యందె యుండు మిక తోయజవైరి తిరంబె రాత్రి యీ
కలవర మేల తుమ్మిదను గానక యూరట యురకుండుమా!
(తుమ్మెదా! ముకుళితమైన తామరలో ఉండలేక కదులుతున్నావెందుకు! ఈ చంద్రుడు స్థిరమా? సూర్యుడు రాకుండా ఉంటాడా? కలవరపడక ఊరటతో ఊరుకో.
మంత్రి పరంగా- ఓ మంత్రివరా! నీవు దాక్కొన్న ఇరుకు ప్రదేశంలో ఇబ్బందిగా ఉండవచ్చు స్థిరంగా ఉండు ఆయన వెళ్ళిన తరువాత ఒంటరి సమయం వస్తుంది. అప్పటిదాకా సద్దుచేయక జాగ్రత్తగా ఉండాలి.)
ఆ మాటలు విని మంత్రి ధైర్యంతో, ఓర్పుతోవేచి ఉన్నాడు. అతని ఇంటి దగ్గర ధర్మపత్ని ఇతని గురించి ఆందోళన చెంది, రహస్యంగా వాకబు చేసింది. భర్త వ్యవహారాలు ఆమెకు కొంత తెలుసు. రాణిగారి ఇంటికి వెళ్ళాడని తెలిసి, అక్కడ ఏమి ప్రమాదం వచ్చిందో అని ఆదుర్దాగా బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చి బయటపడి విచారణ చేస్తే గుట్టు రట్టవుతుందని చతురిక ఆమెకు ఇలా చెప్పింది.
...........ఇంకావుంది.
No comments:
Post a Comment