Wednesday, April 13, 2016

భృంగ పంచకం


భృంగ పంచకం 

నిన్నటి తరువాయి.........
సాహితీమిత్రులారా!

అలినీ తత్తరమేల నేడు నిదె నీ యాత్మేశుడౌ భృంగమున్
జలజాసక్త మకరంద పానవశతన్ సానందుడై యున్న వా
డులు కింతేనియు లేక నీ వరుగుమీ యొప్పారు నిప్పాట నీ
చెలువుండుం బరతెంచు వేకువను రాజీవంబు పుష్పించినన్

(ఆడు తుమ్మెదా నీ భర్త పద్మినీ మకరందపాన వివశుడై ఉన్నాడు.
ఆనందంలో మునిగి ఉన్నాడు. నీవు భయపడవద్దు. తెల్లవారి రాజీవం విచ్చుకోగానే,
నీ నాథుడు వస్తాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా వెళ్ళిపో.)
మంత్రి భార్యకు జరిగింది అర్థమై వెళ్ళిపోయింది.
రాజు రాణితో మదనకేళిలో తేలి, అలసి నిద్రించాడు. రాణికూడా ఆ స్థితికే వెళ్ళింది. తెల్లవార వచ్చింది.
ఇక దాక్కున్న మంత్రి వెళ్ళిపోవటానికి అవకాశం వచ్చిందని చతురిక మంత్రికి అర్థమయ్యేలా
ఈ విధంగా అన్నది.

పతి నిద్రించిన వేళ రా దగునయో పద్మారి! యీ కేళికా
యతనంబందు రతిశ్రమ న్విభుడు నిద్రాసక్తుడై యుండె నీ
శత పత్రేక్షణ మోము వాంచినది నీసామర్ధ్యముం జూపదో
కతి వేగంబుగ నేగుమా తొలగి మాయాత్మల్ సుఖం బందగన్


ఈ పద్యభావాన్ని గ్రహించిన, మంత్రి జాగ్రత్తగా ఇవతలకు వచ్చి వేగంగా వెళ్ళిపోయాడు.
మరునాటి ఉదయం అవసరమైన రాచకార్యాలు ఉండటంవల్ల విశ్రాంతి తీసుకోకుండానే
హడావిడిగా మంత్రి కొలువుకూటానికి వెళ్ళాడు. మహారాజు పేరోలగంలో ఉన్నాడు. పైనున్న
తెరల చాటున నుంచి రాణి చూస్తూంది. కొలువుకు వచ్చే తొందరలో మంత్రి ముందురోజు రాత్రి
ప్రేమావేశంలో రాణి తన మెడలో వేసిన పచ్చల హారాన్ని తీసి దాచకుండా అలాగే వచ్చాడు.
దాన్ని రాజు చూస్తే గుర్తుపడతాడు. ప్రమాదం. రాణి కలతచెంది ఈ అపాయాన్ని ఎలాగైనా
తొలగించమని చెలికత్తెను కోరింది. చతుర అయిన చతురిక మారువేషంతో ఒక భట్టువలె వచ్చి,
ఆస్థానమంతా కలయజూచి ఈ పద్యం చదివింది.

అతుల సంభాంతరస్థిత బుధవళి కెల్ల జొహారు, వీరరా
హతులకు మేల్జొహారు, సతతోజ్జ్వల విక్రమ సార్వభౌమ సం
తతికి జొహారు, వైభవవితాన పురందరుడైన యట్టి భూ
పతికి జొహారు, మానపరిపాల జొహారు ప్రధాని శేఖరా!

అందరినీ స్తోత్రం చేసినట్లు కనిపించినా తనను ప్రత్యేకంగా మానపరిపాల అనటం మంత్రికి 
పట్టిచ్చినట్లుగా ఉంది. భట్టును చూసి చతురిక అని గ్రహించి, తనను చూసుకొని, 
తడుముకొని, పచ్చల హారాన్ని గురించి తెలుసుకొని, మెడలో నుంచి 
ఇతర హారాలతో దాన్నీ కలిపి బయటకు కనబడకుండా తీసి, కవిత్వానికి సంతోషించి 
ఇస్తున్నట్లుగా కుహనాభట్టుకు బహూకరించాడు. మిగతావారు, 
రాజు ఏవో బహుమతులిచ్చి పంపారు. 
ఈ ఐదు పద్యాలలో ఇమిడిన అందమైన కథ ఇది. 

No comments:

Post a Comment