Saturday, April 9, 2016

శరసంధాన బల క్షమాది........


శరసంధాన బల క్షమాది........


సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయలను అల్లసాని పెద్దన వర్ణించిన పద్యం.

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భర షండత్వ - బిలప్రవేశ - చలన - బ్రహ్మఘ్నతల్ మానినన్
నర - సింహ - క్షితిమండ - లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

ఓ నరసింహరాయల కుమారుడైన కృష్ణదేవరాయా! రాజశ్రేష్ఠా!
నర - నరుడు, శరసంధాన - శరసంధానంలోను, సింహ - సింహము, బల - బలములోను, 
క్షితి - భూమి, క్షమ - ఓర్పులోను, ఈశ్వర - ఈశ్వరుడు, వివిధైశ్వర్యంబులుం- 
అనేక రకాలైన ఐశ్వర్యములోను, గొప్పవారే అయినను 
ఈనలుగురిలోను నాలుగు దోషాలున్నాయి. 1. నరునికి నపుంసకత్వం, 2. సింహం గుహలో దాగి ఉండుట(బిలప్రవేశ), 3. భూమి కంపించుట(చలన), 4. ఈశ్వరుడు బ్రహ్మహత్య(బ్రహ్మదేవుని తలనరుకుట) 
అనే దోషాలుండుటచే ఈ నరుడు, సింహం, భూమి, ఈశ్వరులు నీతో సరిపోలరు. అని వర్ణించాడు. 

No comments:

Post a Comment