రుబాయీ
సాహితీమిత్రులారా!
రుబాయీ అంటే అరబ్బీలో నాలుగని అర్థం
అలాగే రుబాయీలో నాలుగు పంక్తులుంటాయి.
వీటి ఛందస్సు ఉండదని కాదు
దానికో ఛందస్సు, ప్రాస, అనుప్రాస
వగైరా సరంజామా వుంటుది.
ఇక్కడ దాశరథిగారి రుబాయీ లను గమనించండి
శిలనే ఒక అప్సరసగా మలిచే వారు
చెలినే ఒక దేవతగా కొలిచే వారు
ఉన్నారు కొల్లలుగా ఈ లోకంలో
సతినే ఒక దయ్యంగా తలిచే వారు
నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది
నీళ్ల లోంచి విద్యుత్తను సెగ పుడుతుంది
ఈ దానవ లోకంలో ఎన్నటికైనా
మానవులని పిలువదగిన తెగ పుడుతుంది
దాహానికి కావాలి నీరో మోరో
ప్రతి వారికి కావాలి ఊరో పేరో;
ప్రాచీనులు వ్రాశారు నీళ్లే త్రాగి
నవ కవులకు కావాలి బీరో! బారో!
గుస గుసలే సరిగమలై వినిపిస్తాయి
అమవసలే పున్నమలై కనిపిస్తాయి
తొలి రాతిరి చెలి చెంతకు చేరిందంటే
చీకటిలో స్వర్గాలే కనిపిస్తాయి
చిరునవ్వులు చిందిస్తూ చీట్లాడేను
అరమరికలు లేకుండా మాట్లాడేను
ఆ నవ్వులు, ఆ మాటలు వలపని తలచీ
అసలు విషయమెత్తగానే పోట్లాడేను!
జన్మదినోత్సవ సంరంభం చేస్తున్నారు
బంధువులూ మిత్రులూ నవ్వేస్తున్నారు
జీవితమున ఒక వర్షం గడచిన వేళ
దుఃఖించా లన్నది మరిచేస్తున్నారు
సకాలానికే సూర్యుడు ఉదయిస్తాడు
అందుకొరకె అతని నెవడు గుర్తిస్తాడు?
చలి కాలం రవి ఆలస్యంగా వస్తే
ఎండకొరకు మానవుడు పడి చస్తాడు!
చచ్చి బ్రతికి యున్నవారు కొందరు కలరు
బ్రతికి చచ్చినట్టి వారు ఎందరో కలరు
ఎంతెంతో వేదాంతం వల్లించేరు
మృతికి జడియబోని వారు ఎందరు కలరు?
No comments:
Post a Comment