సత్యభామాకృష్ణుల సంవాదం - 1
సాహితీమిత్రులారా!
కాకపర్తి తిరుపతి పాత్రయ్య కృత
సత్యభామా కృష్ణుల సంవాదం లోని
సంవాదం ఇది చూడండి-
ఒకనాడు ఎంత రాత్రయినా సత్యభామాదేవి
ఇంటికి శ్రీకృష్ణమూర్తి రాలేదు. ఆమె విరహంలో
పడి దూతికను పంపింది. ఆయన వచ్చాడు.
అయితే ఆమె అన్యవధూ పరిభోగ చిహ్నాలను
కనుగొని రోషవహ్నిశిఖ వలె కన్నులు కెంపుల
నింపుతూ తలుపువేసుకుంది. భార్యాభర్తల మధ్య
సంవాదం నడిచింది.
ఇంకొకరికి సొమ్మయినాడని సత్యభామ ఇలా
ఎత్తిపొడిచింది-
తళుకు పసిడి గాజుల నొక్కుల గళంబు
స్తన మృగనాభి పత్రమూనిన యురంబు
గంబురా విడియంపు కావిని కనుదోయి
లాక్షారసమున ఫాలస్థలంబు
పలుమొన సోకున కళుకు లేజెక్కిళు
లసదుగాటుక చిన్నె నలతి మోవి
రమణీయతర నఖాంకముల బాహుయుగము
పలుచని జిగి కదంబమున మేను
ముద్రలెట్టుచు తనదు సొమ్ముగ దలంచి
యెవతె నిను నమ్మి యున్నదో యిపుడు తగవు
మాలి నిన్నంట దగునె మా జోలి రాకు
యొకరి సొమ్మొకరు గనంగ నుచితమగునె
(బంగారుగాజుల నొక్కులు గొంతుపైన,
కస్తూరి గుర్తులు రొమ్ముపైన,
కర్పూరతాంబూలపు రంగులో ఎర్రని కళ్లు,
లత్తుక నుదుటిన, దంతక్షతాలు బుగ్గలమీద,
కాటుక చిన్నపెదవి మీద, రెండు చేతుల మీద
ఖక్షతాలు, పలుచని కాంతి మిశ్రమముతో శరీరం
తన సొమ్మని తలచి ఎవతె ఇలా ముద్రలన్నీ
చేసిందో నిను నమ్మి, ఇపుడు నీతో కట్లాట దేనికి
నిన్ను అంటవచ్చునా ఒకరి సొమ్ము మరొకరు
చూడవచ్చునా మాజోలికి రాక వెళ్ళు - అని భావం.)
No comments:
Post a Comment