Thursday, January 11, 2018

భ్రాతృ గృహవాస మింతికి భారమగునె


భ్రాతృ గృహవాస మింతికి భారమగునె




సాహితీమిత్రులారా!



ఆడవాళ్ళ విషయంలో మగవాడు ఆడినమాట
తప్పినా భర్తలేని స్త్రీలు మాత్రం గడమనప్పుడు
తోడబుట్టినవాళ్ళ ఇంటిలో ఉండకూడదు -
అనే విషయాన్ని మదినె సుభద్రయ్యమ్మగారు
శతకంలో వివరించారు.
ఆ పద్యం చూడండి-

కాంతుడు లేకున్న గడుపేదయై యున్న
       బుత్రులు బాలత బొందియున్న
మిత్రులు శత్రులై మేలెరుంగక యున్న
       తిరిపెమే యూరను దొరకకున్న
దీన పోషకుడైన దేవ రక్షామణి
        కనికరం బెదపూని కావ కున్న
తన సహోదరులకు ధన ధాన్య సంపదల్
        కరము ప్రభుత్వంబు కలిగియున్న
భ్రాతృ గృహవాస మింతికి భార మగునె
వారి కుటిల వచశ్మర వ్రజమునాటి
బాధపడు కంటె దేహంబు బాయుటొప్పు
హీనమైయున్న బ్రదుకేల మానినులకు
వర విశాఖ పురాధీశ హరి! రమేశ!

విశాఖపురపాలకా!  ఒ హరీ! రమేశా!
భర్తలేకున్నా, చాలపేదరాలైనా, కుమారులు చిన్నపిల్లలైనా,
మిత్రులే శత్రువులై మంచి చేయకున్న, ఏ ఊర్లో బిక్షం
దొరకకపోయినా, దీనులను పోషించే దేవుడే కనికరించకపోయినా,
తన సోదరులకు ఎంత సంపదకలిగిఉన్నా, చేతిలో పాలనవున్నా,
సోదరుల ఇంటిలో నివసించడం స్త్రీకి భారమే అవుతుంది.
వారి కుటిలమైన మాటల వల్ల బాధ పడటం కంటే
శరీరాన్ని వదలడమే సరైంది. హీనమై వున్న స్త్రీల
బ్రతకులు బ్తకడం దేనికి అంటోంది సుభద్రయ్యమ్మగారు.

ఇందులో స్త్రీ ఎటువంటి పరిస్థితులలో ఉన్నా
సోదరుని ఇంటిలో ఉండకూడదనే విషయాన్ని
నొక్కి చెబుతున్నది కవయిత్రి.

No comments:

Post a Comment