Monday, January 22, 2018

మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
సాహితీమిత్రులారా!బమ్మెర పోతన దైవభక్తి -
అమ్మలమీది భక్తి
ఇక్కడ చూద్దాం-

భాగవత ప్రారంభంలో ఆయన స్తుతించిన
పద్యాలను చదవని తెలుగువారు ఉండరంటే
అతిశయోక్తికాదు. వాటిని ఇక్కడ మరోసారి
కేవలం అమ్మగారి పద్యాలనే చేసుకుందాం-

క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
        (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 6)
నేలకు నుదురు తాకునట్లు సాగిలబడి మ్రొక్కి సైకతశ్రోణి,
చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను.
ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలనూ, మరోచేతిలో
రామచిలకనూ, ఇంకోచేతిలో తామరపువ్వునూ, వేరొకచేతిలో
పుస్తకాన్నీ ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన
సుందర సుకుమార సూక్తులతో ఆ అరవిందభవు(బ్రహ్మ)ని
అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో
దేవతల సమూహాన్ని కనికరిస్తుంది.


పుట్టం బుట్టి శిరంబునన్ మొలవ, నంభోపాత్రంబునన్
నెట్టం గల్గును, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరణి నా కీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ నాకగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ దయాంభో నిధీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 7)

అమ్మా! సరస్వతీదేవీ! నేను తలపై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు.
పడవలో పుట్టిన వ్యాసుడను కాను. కాళికను కొలిచిన కాళిదాసునికాను.
అయినా భాగవత పురాణాన్ని తెనిగంచటానికి పూనుకొన్నాను. ఏం చెయ్యాలో, ఏమీ తోచటంలేదు. ఇటువంటి సమయంలో ఎటువంటిమార్గము అవసరమో
అది నీవే నాకు అనుగ్రహించి నాచేయి పట్టుకొని నడిపించు, ముమ్మాటికి
నిన్నే నమ్ముకున్నాను తల్లీ! నీవే ఆధారం. నాకు తెలుసు తల్లీ నీ కరుణ
అపార పారావారం- అని భావం

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నఁడు గల్గు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 8)

సరస్వతీదేవీ శరత్కాలమేఘంవలె, చంద్రునివలె, కర్పూరంవలె,
హంసవలె, మల్లెపూవువలె, ముత్యాలహారంవలె, మంచువలె, నురుగువలె,
వెండి కొండవలె, రెల్లువలె, ఆదిశేషునివలె,  మొల్లవలె, జిల్లేడుపూవువలె,
పాలసంద్రమువలె, తెల్లతామరవలె, ఆకాశగంగవలె స్వచ్ఛమైన తెల్లనికాంతితో
ప్రకాశించే నిన్ను  మనసున దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో


అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుత విహారిణి, నన్ గృపజూడు భారతీ
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 9)

కొత్తగా వికసించిన పద్మాన్ని ధరించి మిక్కిలిప్రకాశించే
పద్మమువంటి హస్తం కలదానా శరత్కాలపు వెన్నెకాంతుల
ఆడంబరంతో కూడిన అందమైన ఆకారం కలదానా
ధరించిన రత్నాభరణాల కాంతులు దిగంతాలను తాకేట్లు
శోభించేదానా వేదసూక్తుల్లో వ్యక్తమయ్యే స్వీయప్రభావం
కలదానా సత్కవుల మహాభక్తుల భావాకాశవీధుల్లో
ప్రశస్తంగా విహరించేదానా సరస్వతీ నను దయచూడు.

అమ్మలు గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడి బుచ్చిన యమ్మ, తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృతాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
 (శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 10)

ఆమె అమ్మలందరికీ అమ్మ, మూడులోకాలకు మూలమైన
ముగురమ్మలకు మూలమైన అమ్మ, పెద్దకాలం నాటి
అందరికన్న అధికురాలైన అమ్మ, రాక్షసులతల్లికి
గర్భశోకాన్ని కలిగించిన అమ్మ, తనను నమ్ముకొన్న
దేవకాంతల మనస్సులలో నివసించే అమ్మ, అందరికీ
అమ్మ ఆ దుర్గమ్మ దయాసముద్రురాలు, ఆమె లక్ష్మయై
సంపద, సరస్వతియై కవిత్వాన్ని, పార్వతియై శక్తిని
సమకూర్చాలని పోతనమహాకవి కోరుకుంటున్నాడు.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంపుఁబెన్నక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తోనాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లా లు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణ ముల్
(శ్రీమదాంధ్ర మహాభాగవతము - 1- 11)

శ్రీదేవి ఆదిదేవుడైన విష్ణువుకు పట్టపురాణి, ఆమె పుణ్యములరాశి,
సిరిసంపదలకు నిలయమైనది, క్షీరసాగరమథనంలో చంద్రునితో
కలిసి పుట్టినది. సరస్వతీ పార్వతులతో క్రీడించు పూబోడి,
పద్మాల్లో నివసించే యౌవనవతి, సమస్తలోకాలవారు ఆమెనే
పూజిస్తారు, ఒక్క చూపుతోనే దారిద్యాన్ని పటాపంచలు చేసే
తల్లి ఆ ఆదిలక్ష్మి తనకు నిరంతరం సౌభాగ్యాన్ని అందజేయాలని
పోతనమహాకవిగారు కోరుకుంటున్నారు.

ఈ విధంగా పోతనగారు సరస్వతి పార్వతి దుర్గాదేవిని లక్ష్మీదేవిని
కావ్యారంభంలో స్తుతించారు.

వసంతపంచమి పర్వదినాన వారిని ఈ పద్యాలరూపంలోనైనా
స్మరించుకుందాము.

No comments:

Post a Comment