Tuesday, January 30, 2018

కవీంద్ర పరమేశ్వరదాసు


కవీంద్ర పరమేశ్వరదాసు



సాహితీమిత్రులారా!



కవీంద్ర పరమేశ్వరదాసు బెంగాలీ కవి.
15వ శతాబ్ది చివరిలో జన్మించి 16వ శతాబ్ది
తొలిభాగంలో కాలం చేసిన వారు వీరు.
హుసేనుషా(1497-1518) సేనాపతి అయిన
పారగల్ ఖాను ఆస్థానకవిగా ఉండినవాడు.
ఈ పారగలుఖాను అనంతరం కూచి బీహారు
రాజయిన నరనారాయణుడి దగ్గర మంత్రిగా
పనిచేశాడు. అలా చివరి దినాలు శారీపురంలో
గడిచాయి.

      మన తెలుగులో రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని
ఆంధ్రీకరించినట్లు బాంగ్లాలో మహాభారతాలు మహమ్మదీయ
ప్రభువులు వ్రాయించారు. తమ ఆస్థానాలలో భారతం
చదివించాలని అభిలాషపడ్డారు వారు. అయితే సంస్కృత
గ్రంథాలు వారికి అడవిలా అంధకారబంధుమైనాయి.
అందువల్ల తేటతెల్లమైన బాంగ్లా అనువాదాలు చేయించారు.

    పానగల్ ఖాను ఆదేశం ప్రకారం మహాభారతాన్ని సంస్కృతం
నుంచి బాంగ్లా చేశాడు పరమేశ్వరదాసు. అందుకని ఇతని భారతానికి
పానగల్ మహరాభారతమని పేరు. తన గ్రంథంలో మొదట్లోనే
ఆ గ్రంథరచనకు కారణం వివరించాడు.

ఆ ప్రస్తావనం-

"లస్కర పారగల్ సునంత కాహినీ,
యేనమతె పాండవె హారాయిల రాజధాని
వనవాసె బంచిలేక ద్వాదశవత్సర,
కేనమతె ధర్మ రయిల వనేర్ భితర.
వత్సరేక అభిలంత అజ్ఞాత వసతి,
కేనమ తె తారా సబె పాయిల వసుమతీ?
వహి సబ కథా కహ సంక్షిప్త కరియా,
దినేక సునితె పారి పాంచాలీ కరియా,
తాఁహార ఆదేశమాల్య మస్తకె కరియా,
కవీంద్ర కహిల కథా పాంచాలీ రచియా"

(పాండవులు రాజధాని ఎలా పోగొట్టుకున్నారు
ధర్మానికి కట్టుబడి పన్నెండేళ్లు వనవాసమూ,
సంవత్సరమూ అజ్ఞాతవాసమూ ఎలాచేశారు
ఎలాతిరిగి రాజ్యం సంపాదించారు
ఇదంతా సంక్షిప్తంగా ఒక్కదినంలో వినగలిగినంత
పద్యకావ్యంగా రచించమని పానగల్ సేనాని ఆదేశించాడు.
అతని ఆదేశం శిరస్సున దాల్చి కవీంద్రుడు
పద్యంగా(భారత)కథ వ్రాశాడు.)

భారత కథంతా వొక్కరోజులో చదవగలినంత
మొదట సంక్షిప్తంగానే వ్రాశాడు కవీంద్రుడు.
తరువాత దానినే విస్తృపరచి వ్రాశాడు.
ఇప్పుడది మొత్తం 17000 పద్యాలతో వుంది.
మన భారతమేకాదు భారతదేశంలో అనేకానేక
భారతాలు వివిధభాషల్లో కూర్చారని దీన్ని బట్టి
తెలుస్తున్నదికదా మిత్రులారా!

No comments:

Post a Comment