Saturday, January 13, 2018

తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన


తెనాలి రామకృష్ణుని శరదృతు వర్ణన



సాహితీమిత్రులారా!



తెనాలిరామకృష్ణుని పాండురంగమాహత్మ్యంలోని
నాలుగవ ఆశ్వాసంలో మనకు శరదృతువర్ణన
కనిపిస్తుంది అందులోని ఒక పద్యం-
వర్షఋతువులో ఉండే అందాలు పోయినవి.
వాటి స్థానే శరదృతువులో కొన్ని కొత్త అంశాలు
చోటుచేసుకున్నాయి. ఆ విషయం ఎంత చమత్కారంగా
వర్ణించాడో ఈ పద్యం చెబుతుంది-

కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?
సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
          (పాండురంగ మాహత్మ్యం 4 - 42)



కలుగకుండిన నేమి కడిమి పువ్వులతావి
         ననిచిన మరువమెంతటికి నోప?
 వర్ష ఋతువులో కడిమి పువ్వులు పూచేవి. ఇపుడు శరత్తులో
కడిమిపువ్వుల వాసన రావడంలేదు. సరే కడిమిపూల వాసన 
లేకపోతేనేమి? చిగిరించిన ( ననిచిన) మరువము వాసనలు
న్నాయి కదా. (ఎంతటికైనా సరిపోతుందనడం.)

దొదవకుండిన నేమి మదకేకి నటనంబు
         చాలదె యంచల సంభ్రమంబు?
మదించిన నెమలి నాట్యము (మదకేకి నటనంబు) 
ఇప్పుడు లేకపోతే ఏమి?. హంసల సంభ్రమము చాలదా?

మెరవకుండిననేమి మెరుగుల పొలప మే
         తన్మాత్రములె శాలిధళధళములు?

మెరుపులు మెరవకపోతేయేం? శాలిధాన్యపు
( మేలిరకం ధాన్యం)  తళతళలు తక్కువా యేం?

సుడియకుండిననేమి సోనవానల పెల్లు
         గజదాన వృష్టికి గడమ కలదె?
చక్కని చిరుజల్లులు పడకపోతే మాత్రమేమి తక్కువ? 
ఏనుగులుమదజలమును వర్షిస్తున్నవికదా?

కారుకాలాన గలిగిన గౌరవంబు
చౌకయై తోచె శరదృతు సౌష్ఠవమున
వర్షాకాలమునకు గల గొప్పదనము సరిగ్గా ఆలోచిస్తే శరత్తులో
ఇంకా చౌకగా లభిస్తున్నది. అంటే వర్షాకాలంలో దొరికేవన్నీ
ఈ శరత్తులోనూ వానికన్న శ్రేష్ఠమైనవి ఇంకొంచెం చౌకగానే
దొరుకుతున్నాయి. అనగా శరత్తు తనధర్మములు చూపుతూ
వర్షాకాల ధర్మములనూ చూపగలుగుతున్నది

నురిలి తొల్లిటి యధికారి యోసరిలిన
వెనుక యధికారి యవికావె విభవకళలు?
ఒక అధికారి తాను ఉద్యోగమునుండి తప్పుకున్నా. 
వాని అధికారములన్నీ ఆ తరువాత వచ్చే అధికారికి
దొరుకుతాయితాయి కదా. ఆ వైభవాలన్నీ తరువాత
వచ్చేవాడికి దక్కినట్టే వర్షాకాల విభవము శరత్తుకు దక్కింది-
అని భావం

No comments:

Post a Comment