Tuesday, February 19, 2019

వింధ్యుని స్వగతం


వింధ్యుని స్వగతం
సాహితీమిత్రులారా!


  ఉ. కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్
        వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం
        బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
        కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్

చదువుతుండగనే అర్థమైపోతూ ఏ వివరణ అక్కర్లేని పై పద్యం శ్రీనాధుడిది. కాశీఖండం అనే కావ్యం లోనిది.

కాశీఖండం బహుశా ఆయన వ్రాసిన ఆఖరి కావ్యం కావచ్చు. పసితనంలో మరుత్తరాట్చరిత్ర, యౌవనం పొడసూపుతున్న వయసులో శాలివాహన సప్తశతి, నిండు యవ్వనంలో ఉండగా శృంగార నైషధం అనువాదము, నలభై, నలభైఐదేండ్ల వయసులో – ప్రౌఢ నిర్భర వయఃపరిపాకంలో – భీమేశ్వర పురాణము, మరీ ముదుసలి కాకమునుపు, అంటే యాభై అరవై ఏండ్ల నడిమి వయసులో ఈ కాశీఖండమూ రచించాడు. మధ్యమధ్యలో సమయం అనుమతించినప్పుడూ, అవసరం అవకాశమిచ్చినప్పుడూ హరవిలాసము, పల్నాటి వీరచరిత్ర వ్రాసి వుంటాడు. అంటే కాశీఖండం వ్రాసే నాటికి జీవితంలోని ఆటుపోట్లను, భోగభాగ్యాలను, విజయ పరంపరలనూ అనుభవించి ఉంటాడన్నమాట. అనుభవాలంటే అనుభవాలా అవి! ఆనాటి విశాల ఆంధ్రదేశంలోని రాజ్యాల్లోనూ, కర్నాటక రాజ్యంలోనూ కూడా సాహితీ రాజకీయ రంగాలలో ప్రముఖ వ్యక్తిగా మన్ననలు పొందాడు. కనకాభిషేకాలు చేయించుకున్నాడు. అభిమానులైన అధికారులనుండి కస్తూరికాయలు స్వీకరించాడు. వారి సరసన కూర్చుని బంగారు పళ్ళెరాలలో భోజనం చేశాడు. గొప్ప జీవితం గడిపాడు. ఇలా అన్ని వైభోగాలనూ కాశీఖండం వ్రాసేనాటికే చవి చూసి ఉండటం వల్లనేమో, ఈ కావ్యం ఆ మహానుభావాలు జీర్ణించుకున్న సంయమన ఫలితంగా గొప్ప ప్రౌఢిమతో అలరారింది.

శ్రీనాధుని కావ్యాల్లో శృంగార నైషధము, కాశీఖండము అఖండమైన పేరు సంపాదించుకున్నాయి. లవితాప్రియులు పరవశించిపోయే కవన ధోరణీ, పద్యాలు ఈ కావ్యాల్లో ఉన్నాయి. అయితే, శృంగార నైషధం శ్లోకశ్లోకానువాదం. కాశీఖండం అలా ఖచ్చితంగా చెప్ప వీలుగానిది. స్కాందపురాణంలోని కాశీక్షేత్ర మాహాత్మ్య భాగాన్ని “సమకట్టితి కావ్యముగా నొనర్పగన్” అని ఆయనే చెప్పుకున్నాడు. అందుకని కాశీఖండంలో శ్రీనాధుని స్వీయప్రతిభ నైషధానికన్నా ఎక్కువగానూ, గొప్పగానూ కానవస్తుంది.

కాశిఖండ మయః పిండం నైషధం విద్వదౌషధం అనే మాట ఒకటి సాహితీలోకంలో ప్రచలితంగా ఉంది. ఇది సంస్కృత మూలాలను పోలుస్తూ చెప్పిన మాట అని కొందరంటారు. కాని, తెలుగు కావ్యాలను దృష్టిలో వుంచుకొని కేవలం శ్రీనాధుని కవిత్వాన్ని బేరీజు వేస్తూ చెప్పిందే అయ్యుండాలని అనిపిస్తుంది. సంస్కృతంలో కాశీఖండం ఒక పురాణాంతర్గత భాగం. దాని కర్త పురాణస్రష్టగానే కాని కేవలకవిగా ప్రసిద్ధుడు కాడు. పైగా ఆ రెంటినీ సంస్కృత వాఙ్మయములో పోల్చాల్సిన అవసరము – ఏకరూపత లేనందువల్ల – లేదు. తెలుగులో ఒకే చేతి మీదగా వెలుగు చూశాయి కాబట్టి పోలిక సహజం. శృంగార నైషధం ప్రౌఢమైనదే. కానీ దానిని మించిన ప్రౌఢమైనది కాశీఖండము. అందుకని అయః పిండం – అంటే ఇనుప గుండు – అన్నారు. నిజానికి అందులో అంత కొఱకరానిదేమీ లేదు. తెలుగు కాశీఖండంలోని ప్రౌఢిమ శ్రీనాధుని స్వీయ ప్రతిభ. శృంగార నైషధంలోని సౌందర్యం శ్రీనాధుని అనువాద ప్రతిభ. ఈ అనువాద ప్రతిభ కూడా అసామాన్యమైనదే.

కాశీఖండములో కథ తక్కువ. అంతా క్షేత్రవిశేషాల వర్ణన. అయినా తన పరుసవేది లాంటి చేతితో దాన్ని ప్రతిపద్యసువర్ణంగా మార్చి వేశాడు శ్రీనాధుడు. వింధ్యాద్రి గర్వ నిర్వృతి, గుణనిధి కథ, కాశిపై వ్యాసుని కోపఘట్టం లాంటి చిన్న కథలు బంగారు తీగ మధ్యలో రత్నాల్లాగా అమరిపోయాయి.

ఇక శ్రీనాధుని పద్యాల గురించి చెప్పేదేముంది! కవిసార్వభౌముడు అనే బిరుదు ఆయనకు సహజంగా అమరిపోయిన ఆభూషణం. ప్రతి పద్యాన్నీ దేనికి దాన్నే ఒక కళాఖండంగా రూపొందించడంలో ఆయనకున్న అభిలాష ఆశ్చర్యం కలిగిస్తుంది. జాతులు కానీయండి, వృత్తాలు కానీయండి పద్యం ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు ఎంత పకడ్బందీగానో వుంటాయి. పై పద్యం మరోసారి చదవండి. ఈమాట ఎంత నిజమో అర్థమౌతుంది. ఇక సీస పద్యాలైతే చెప్పే పని లేదు. ఏ పాదానికా పాదం విరగడమూ, యతిస్థానం దగ్గరికి వచ్చే సరికి పదము, భావము రెండూ విరామం ప్రకటించడమూ – ఎంతో పఠన సౌఖ్యము, శ్రవణ సౌఖ్యము, మనన సౌఖ్యము కలిగిస్తాయి. ఆయన ప్రభావాన్ని తరువాతి కవులు తప్పించుకోలేక పోయారు. ముఖ్యంగా అల్లసాని పెద్దన్నయితే ఎంతగానో శ్రీనాధునికి ఋణపడి వున్నాడు (అయినా, పూర్వకవిస్తుతిలో శ్రీనాధుని పేరు గూడా తలపలేదు.)

కవిసమయాలకు పదును పెట్టడంలో అఖండుడు శ్రీనాధుడు. ఇది చూడండి: అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబం, కొద్దిగా కనపడుతూ వుండేది – పరశువు లాగా అనిపిస్తుంది. చీకటి అనే లతను ఛేదించే గండ్రగొడ్డలి లాగా ఆ సూర్యబింబాన్ని ఉపమించడం కవి సమయం. అయితే ఆ ఒక్క ముక్క అని ఊరుకోడం శ్రీనాధునికి నచ్చని పని. “చిరుసాన పట్టించి, చికిలి జేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు,” అని అంటేగాని ఆయనకు తృప్తి వుండదు. అలాగే అందమైన మనిషిని మన్మధునితో పోల్చడం రివాజు. “కాలకంఠ కఠోర కంఠ హుంకారంబు చెవుల సోకనీ నాటి చిత్తభవుడు” అని ఉపమేయానికి అదనపు గౌరవాన్ని కల్పించి గాని ఆగడు. అంతే కాదు, తన కాలంలో క్రమక్రమంగా జనబాహుళ్యం లోకి వస్తున్న తురుష్క పదాలను సంతోషంగా స్వీకరించాడు. సులతానును ‘సురధాణి’ గా మార్చుకొని ఖుషీగా “ఖుసి మీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో” అంటూ ఆ పద్యంలో ఆ పదాలని పొదువుకున్నాడు. కొన్ని మాటలు ప్రత్యేకంగా వాడటం ఆయనకు ఎంతో ముచ్చట. శివుణ్ణి “మంచుంగొండ యనుంగు పెండ్లికొడుకు” అంటాడు, అది పెండ్లి సందర్భం కాకపోయినా. వినాయకుడు “వడకు గుబ్బిలి కూతు కొడుకు గుఱ్ఱ” అట. ఈక ఈయన ఊహలు కూడా తమాషాగా ఉంటాయి. సూర్యుని రధపు గుర్రాలు తమ మార్గంలో పోతూ వుండగా చంద్రబింబం కనిపిస్తే దాన్ని ఉప్పురాయి అనుకొని నాకాలనుకున్నాయిట. “ఇందుబింబము జూచి చెందుప్పుగలు సావి యఱులెత్తి నాకంగ నాసపడిన” గొప్ప చమత్కారప్రియుడు శ్రీనాధుడు. ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన చాటువులు చమత్కారాల పుట్టలు.

మన్నించాలి. పద్యాన్ని గురించి కాకుండా కావ్యాన్ని గురించీ కవిని గురించీ వ్రాశాను. శ్రీనాధుణ్ణి తలచుకుంటే అంతే.

పైపద్యం వింధ్య పర్వతం స్వగతం. సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరువును మిక్కిలి గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమి తక్కువ అనుకుంటున్నాడు వింధ్యుడు. ఆ మేరువంటే ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. పర్వతకులపతిత్వం తనకు దక్కకుండా మేరువుకు దక్కడం సహించలేకపోతుంటాడు. అతనికి నిద్రపట్టదు. అన్నం సహించదు. కంటకుడైన శత్రువొకడు తనంతటి వాడుంటే – ఇక అతన్ని మించిన దాకా మారో ఊసు జోలికి పోలేడు. ఇదీ వింధ్య పర్వతపు మనస్థితి. పై పద్యంలో వింధ్యుని బాధంతా ఎంతో బాగా రూపు దిద్దుకున్నది.

కానీ ఇది వింధ్య పర్వతం మనస్థితేనా? ఈ పద్యాన్ని ఈ సందర్భంలో ఇరికించాడు గానీ దాన్ని ఎప్పుడో నిబంధించుకొని మనసులో భద్రంగా దాచుకుని వుంటాడు శ్రీనాధుడు. తనంతటివాడు, కంటకుడైన శాత్రవుడెవడో ఆయనకు ఎక్కడో తారసపడే వుంటాడు. అతన్ని ఓడించి తనను తను ఎలా నిరూపించుకోవాలా అని మధనపడీ వుంటాడు. అనేక రాజకీయ సభల్లో పాల్గొని తన కవనధాటినీ, పాండిత్యార్భటినీ ప్రకటించినవాడు శ్రీనాధుడు. అలాంటి ఓ సందర్భంలో తనకు సరిజోడైన ప్రత్యర్థి ఎదురై వుంటాడు. ఇంత స్పర్థ బహుశా ప్రౌఢదేవ రాయల ఆస్థానంలో కంచు ఢక్క మీద యన ప్రాగల్భ్యాన్ని చాటించుకుంటున్న గౌడ డిండిమ భట్టు పైనే అయివుంటుంది. ఆయనా మహా పండితుడు, రాజాశ్రితుడు. ఈయన ఇక్కడినుంచి అక్కడికి పోయినవాడు. స్థానబలం లేనివాడు. ఇంకొకరు అగ్రస్థానంలో ఉండగా తాను రెండోస్థానంతో సరిపెట్టుకొని ఆయన అనుచరునిగా వుండడం శ్రీనాధుని వంటి ప్రతిభాశాలి సమ్మతించగలడా? “మానుషంబు గల యట్టి మనుష్యుడు” గదా. డిండిమ భట్టును గెలిచి ఆయన కంచు ఢక్కను పగులగొట్టించి, ఎదురులేనివానిగా నిరూపించుకొని రాజు చేత కనకాభిషేకం జరిపించుకున్నదాకా నిద్రపోయి వుండడు. శయ్యాభోజన సుఖాలను ఆనందించి వుండడు. (భోజన మిందునే? = తిన్నది ఇముడుతుందా?)

అప్పుడనుభవించిన ఆ వేదననంతా పద్యంలో చెప్పుకొని సాదృశమైన ఘట్టం కాశీఖండంలో కనిపించే సరికి శ్రీనాధుడు ఆ బాధనంతా అక్కడ ఇరికించి వుంటాడనిపిస్తుంది. ఎందుకంటే పద్యంలో గొప్ప శబ్ద చమత్కారమేమీ లేదు. భావ చమత్కారమూ లేదు. చాలా సాదా సీదా పదాలతో ఏ వ్యంగ్యమూ లేకుండా సాగిందీ పద్యం. కానీ, ఒక ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనస్వి స్వానుభవపు తీవ్రత దీనిలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. పద్యం నడకలో శ్రీనాధుని చేయి తిరిగిన తనం కనిపిస్తున్నది. గుండెలోని బాధని గుదిగుచ్చి పోసిన కవిత ఎంత ఆర్ద్రంగా, హృదయస్పర్శిగా వుంటుందో చెప్పడానికి ఈ చక్కని పద్యం ఒక మంచి ఉదాహరణ.
----------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment